మెగా బ్రదర్స్‌లో పౌరుషం ఏమైంది? “మా” ఎన్నికల్లో ఓడించడమే కాకుండా ప్రత్యర్థులు హెచ్చరిస్తున్నా కిమ్మనకుండా మౌనం పాటించడం ఏంటి? అన్నయ్యా ఎందుకిలా? ఒక్కసారిగా జూలు విధిల్చి మీ సత్తా ఏంటి చాటండి అని మెగా అభిమానులు, జనసైనికులు సోషల్ మీడియా వేదికగా ఇటీవల పెద్ద ఎత్తున ప్రశ్నిస్తుండడంతో పాటు డిమాండ్ చేస్తున్నారు. మెగా బ్రదర్స్‌లో అంతోఇంతో పౌరుషం నాగబాబులో మాత్రమే కనిపిస్తోందని జనసైనికుల అభిప్రాయం.
ఇంట గెలిచి, రచ్చ గెలవమని పెద్దలు ఏనాడో చెప్పారు. కానీ మెగాబ్రదర్స్ మాత్రం కనీసం ఇంట కూడా గెలవలేకపోయిన వైనాన్ని “మా” ఎన్నికలు నిరూపించాయి. జనసేనాని పవన్‌కల్యాణ్ రాజకీయ పంథాను చూస్తే జాలి పడాలో, ఆగ్రహించాలో అర్థం కావడం లేదని ఆయన అభిమానులే వాపోతున్నారు. ఒకవైపు తన అన్నలను, కాపు సామాజిక వర్గ నాయకత్వాన్ని “మా” ఎన్నికల్లో చంద్రబాబు సామాజిక వర్గం పట్టుపట్టి మరీ ఓడించిన విషయం బహిరంగ రహస్యమే. దీన్ని జనసైనికులు, మెగా అభిమానులు, కాపు సామాజిక వర్గీయులు జీర్ణించుకోలేకున్నారు.
అంతెందుకు తమ ప్రమాణ స్వీకారానికి మెగా బ్రదర్స్‌ను మంచు విష్ణు బహిష్కరించడాన్ని కేవలం వ్యక్తిగతంగా చూడలేమని జనసైనికులు, మెగా అభిమానులు అంటున్నారు. దీని వెనుక నందమూరి బాలకృష్ణ ప్రమేయం ఉందని వారి అనుమానం. గతంలో హిందూపురంలో లేపాక్షి ఉత్సవాలకు మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించకపోవడంపై మీడియా ప్రశ్నించగా, బాలయ్య అవమానకర రీతిలో స్పందించడంపై మెగా అభిమానులు మండిపడ్డారు. అప్పట్లో బాలయ్యపై నాగబాబు సీరియస్‌గా రియాక్ట్ కావడాన్ని జనసైనికులు, మెగా అభిమానులు గుర్తు చేస్తున్నారు.
నిన్నటికి నిన్న విష్ణు ప్రమాణ స్వీకార వేదికపై నుంచి మంచు మోహన్‌బాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మెగా ఇంట్లో ఎక్కువ మంది హీరోలున్నారని బెదిరింపులకు పాల్పడినట్టు మోహన్‌బాబు పరోక్షంగా విమర్శించారనే చర్చ జరుగుతోంది.
మెగా బెదిరింపులకు భయపడేవాళ్లెవరూ ఇక్కడ లేరని మోహన్‌బాబు హెచ్చరికలపై చిరంజీవి, పవన్‌కల్యాణ్ అభిమానులు మండిపడుతున్నారు. ఇదంతా కావాలనే చంద్రబాబు సామాజిక వర్గం చేస్తోందని కాపులు నమ్ముతున్నారు. మెగా బ్రదర్స్ ఏమీ చేయలేరనే లెక్కలేని తనమే వారితో రెచ్చగొట్టే ప్రకటనలు చేయిస్తోందని జనసైనికులు, మెగా అభిమానులు మండిపడుతున్నారు.
ఒకవైపు వాళ్ల చేతిలో అవమానపాలవుతూ, మరో వైపు చంద్రబాబుకు రాజకీయంగా మద్దతు పలకడం ఏంటని పవన్‌కల్యాణ్‌ను సొంత సామాజిక వర్గ నేతలు, అభిమానులు తీవ్రస్థాయిలో ప్రశ్నిస్తున్నారు. కేవలం నాలుగైదు శాతం ఓటు బ్యాంకు ఉన్న ఆ రెండు సామాజిక వర్గాల అధికార పల్లకీలు మోయడానికి ఉత్సాహం చూపడం…25-30 శాతం ఓటు బ్యాంకు ఉన్న తమను తాము అవమానించుకోవడమే అని కాపులు భావిస్తున్నారు.
ఆ రెండు సామాజిక వర్గాలకు వ్యతిరేకంగా అత్యధిక జనాభా కలిగిన తాము తృతీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగలేమా? అని నిలదీస్తున్నారు. ఎంతసేపూ ఇతరుల నాయకత్వాన్ని బలపరిచే పనేనా? అని పవన్‌ను ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలకు మరో రెండున్నరేళ్ల సమయం ఉందని, ఇప్పటి నుంచే బలమైన శక్తిగా అవతరించేందుకు పవన్‌కల్యాణ్‌తో పాటు మెగా బ్రదర్స్ అంతా కలిసి రావాలని కాపులు కోరుకుంటున్నారు.