కడప జిల్లా సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తున్నానంటూ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా ఆయన జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా జగన్ సలహాదారులపై మండిపడ్డారు.
జగన్ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు, తన జిల్లాకే చెందిన అంబటి కృష్ణారెడ్డిపై డీఎల్ అవినీతి ఆరోపణలు చేసిన నేపథ్యంలో మాజీ మంత్రికి సదరు అంబటి గట్టి కౌంటర్ ఇచ్చారు.
తనకు డీఎల్ విమర్శల నేపథ్యంలో అంబటి కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ వందల కోట్ల విలువైన ఆస్తులను మాజీ మంత్రి రవీంద్రారెడ్డి ఏ విధంగా సంపాదించారని ప్రశ్నించారు. డీఎల్ రాజకీయాల్లోకి వచ్చే నాటికి సుంకేసులలో చిన్న కొట్టం, రేకుల ఇల్లు ఉండేదన్నారు. ఇపుడు హైదరాబాద్‌లో రూ.200 కోట్ల విలువైన ఆస్పత్రి, రూ.20 కోట్ల విలువైన ఇల్లు, వందల ఎకరాల భూములు ఎలా వచ్చాయని నిలదీశారు.
గతంలో మంత్రి పదవిలో ఉండి వైఎస్ జగన్‌కు పోటీగా కడప ఎంపీగా డీఎల్ నిలబడి, కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. వైఎస్ కుటుంబం దెబ్బ రుచి చూసినా డీఎల్‌కు బుద్ధి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో టీడీపీ నాయకుడు పుట్టా సుధాకర్ యాదవ్‌తో జతకట్టారని గుర్తు చేశారు. 2019లో ఎవరూ పిలవకపోయినా వైసీపీలో డీఎల్ చేరారని అంబటి విమర్శించారు.
అలాంటిది ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. డీఎల్ ఏనాడు వైసీపీ బలోపేతానికి పని చేయలేదని అంబటి విమర్శించడం గమనార్హం.