సోషల్ మీడియా పోకిరీపై మొట్ట మొదటిసారిగా కడప పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. కడప ఎస్పీ కేకేఎన్ అన్భురాజన్ సిఫార్సు మేరకు కలెక్టర్ విజయరామరాజు ఉత్తర్వులిచ్చారు.
కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన చెన్నుపల్లి ప్రసన్నకుమార్ (23) సోషల్ మీడియా వేదికగా అమ్మాయిలకు ఎర వేసి లొంగదీసుకుని, బ్లాక్మెయిల్కు పాల్పడుతూ పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసేవాడు.
బీటెక్ ఫస్ట్ ఇయర్లో చదువు మానేసిన ఈ యువకుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకని రకరకాల పేర్లతో సోషల్ మీడియాలో ఫేక్ ఖాతాలు సృష్టిస్తూ మహిళలకు చేరువయ్యేవాడు. యువతులను, మహిళల్ని మభ్యపెట్టి వారితో నగ్న వీడియోకాల్స్, అసభ్య చాటింగ్ చేసేవాడు. అవే యువతుల పాలిట శాపాలయ్యాయి. వాటిని అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిల్కు పాల్పడేవాడు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో అతని బాధితులు వందలాది మంది యువతులు, మహిళలపై ప్రేమ వల విసిరి.. ఏ స్థాయిలో మోసానికి పాల్పడ్డాడో అర్థం చేసుకోవచ్చు. అలాగే అతను పలు దొంగతనాల కేసుల్లో కూడా ఉన్నాడు. ఈ ఏడాది ఆగస్టు 1న పోలీసులకు చిక్కడం దిమ్మతిరిగే భాగోతాలు బయటపడ్డాయి.
సోషల్ మీడియా వేదికగా మహిళల్ని మోసగిస్తున్న ప్రసన్నకుమార్పై రాష్ట్రంలోనే తొలిసారిగా పీడీ యాక్ట్ ప్రయోగించడం చర్చనీయాంశమైంది.