ఏపీలో కరెంటు కోతలున్నాయని ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ సాక్షాత్తూ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని వార్నింగ్ ఇస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ అనుకూల మీడియాలో కరెంటు కోతల్లేవు, ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయంటూ కథనాలు వెలువడుతున్నాయి.
అటు అధికారులు కూడా కవరింగ్ కోసం కష్టాలు పడుతున్నారు. అసలు నిజంగానే కరెంటు కోతలు లేకపోతే ప్రభుత్వానికి ఇలా కవర్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి..? కరెంటు ఉందా లేదా అనేది ఎవరూ దాచలేనిది, తప్పుడు ప్రచారం చేయలేని విషయం. మరి ప్రభుత్వానికి భయమెందుకు..? ప్రజలకే నేరుగా ఆ విషయం తెలుసు కదా..? సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినంత మాత్రాన ప్రతిపక్షాల మాటలు ప్రజలు ఎందుకు నమ్ముతారు..?
నిజం గడపదాటే లోపు..
నిజం గడపదాటే లోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తుందనే విషయం తెలిసిందే. అయితే ఆ అబద్ధం బయటికెళ్లే లోగా.. ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. పీక్ టైమ్ లో ఎక్కువ రేటుకి కరెంటు కొంటున్నాం కాబట్టి ఏసీలు, కరెంటు ఎక్కువ ఖర్చయ్యే ఇతర వస్తువుల వాడకం తగ్గించాలని ఆయన సూచించారు.
ఇక సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పొదుపు తప్పదని స్టేట్ మెంట్ ఇచ్చారు. దీంతో సహజంగానే జనాల్లో అనుమానాలు మొలకెత్తాయి. దీనికి తోడు ప్రతిపక్షాల పుకార్లు మొదలయ్యాయి. ఏపీలో అంధకారం అలముకొంటోంది.. రాబోయే రోజుల్లో అసలు కరెంటే ఉండదు, ఏపీలో అన్నీ కట్ అయిపోతాయి అంటూ సోషల్ మీడియాలో హోరెత్తించారు.
వాస్తవానికి ఏపీలోనే కాదు, బొగ్గు నిల్వలు నిండుకోవడంకో దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. కానీ ఏపీలో మరికొన్ని రోజులకు సరిపడా నిల్వలు ఉండటంతో.. ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టమేమీ లేదు. బొగ్గు కొనుగోలు కోసం జెన్ కో కి 250 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించింది.
రాష్ట్రానికి అదనంగా బొగ్గు రైళ్లను కూడా కేంద్రం కేటాయించింది. ఒకరకంగా దేశవ్యాప్తంగా బొగ్గు నిల్వల కొరతకు సంబంధించి కేంద్రం ప్రత్యామ్నాయాలను వెదికి పెట్టేలోపు ఏపీకి వచ్చిన ఇబ్బంది కూడా లేదు. కానీ ముందు జాగ్రత్తగా అధికారులు చెప్పిన మాటల్ని ప్రతిపక్షాలు వక్రీకరించి ప్రజల్లో గందరగోళ వాతావరణం తీసుకొస్తున్నాయి.
అనవసర రాద్ధాంతం ఎందుకు..?
ఒకవేళ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నా.. ప్రభుత్వం అనవసరంగా భుజాలు తడుముకోవడం ఎందుకు..? కరెంటు ఉందా లేదా అనే విషయాన్ని ఎవరూ దాచిపెట్టలేరు. దాచాలన్నా దాగేది కాదు. ప్రతిపక్షాల ప్రచారంలో నిజమెంత, అబద్ధమెంత అనేది ప్రజలు బేరీజు వేసుకోగలరు.
ఒకవేళ నిజంగానే కోతలు మొదలైతే.. ప్రభుత్వం కచ్చితంగా బాధ్యత వహించాల్సిందే. దాని కోసం ఇప్పటినుంచే ప్రభుత్వం జవాబులు చెప్పుకోవడం మాత్రం కాస్త ఆలోచించాల్సిన విషయమే. అటు ఇంధన శాఖ కూడా కోతలు లేవు అని చెప్పుకోడానికి ఆపసోపాలు పడుతోంది. తప్పుడు ప్రచారం నమ్మొద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది.
ఒకప్పుడు సైలెంట్ గా కరెంట్ కోతలుండేవి. ఇప్పుడు కరెంట్ కోతలు ఉండవని పబ్లిక్ గా చెప్పుకోవాల్సిన పరిస్థితిని కల్పించాయి ప్రతిపక్షాలు. ఏంటో ఈ చోద్యం.