తెలంగాణలో 'జనంలోకి జనసేన' అనే కార్యక్రమం మొదలుపెట్టారు. కాస్తో కూస్తో ఏపీ పార్టీలపై సానుకూలత ఉండే ఖమ్మం జిల్లా నుంచి దీన్ని మొదలు పెట్టారు. అసలు తెలంగాణలో పార్టీయే వద్దు, నా దగ్గర అంత డబ్బులేదని చెప్పిన పవన్ కల్యాణ్.. ఇలా పార్టీ పటిష్టం కోసం ఏకంగా కార్యక్రమాలు రూపొందించడం ఏంటి అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న.
ఇటీవల తెలంగాణ జనసైనికులతో ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేసిన పవన్, అక్కడ పార్టీ పటిష్టం కోసం వ్యూహ రచన చేస్తున్నారు.
ఎవరి కోసం, ఎందుకోసం..?
పవన్ మాటమీద నిలకడ లేని వ్యక్తి అని అందరికీ తెలుసు. అయితే ఠపీమని ఆయనకి తెలంగాణపై ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చిందనేదే అర్థం కాని విషయం. బీజేపీని కాస్త కంట్రోల్ లో పెట్టేందుకే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలంటున్నాయి.
తెలంగాణలో జెండా పూర్తిగా పీకేస్తే.. ఏపీలో తన జుట్టు బీజేపీ చేతికి ఇచ్చినట్టేనని పవన్ భావిస్తున్నారు. అందుకే అక్కడ స్క్రూ బిగిస్తే, ఇక్కడ బీజేపీ కి వంగి వంగి దండాలు పెట్టే అవకాశం ఉండదని అనుకుంటున్నారు.
గతంలో తెలంగాణ ఎన్నికల సమయంలో జనసేనను కూరలో కరివేపాకులా తీసేసింది బీజేపీ. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో జనసేన బీ ఫారంలు ఇచ్చినా పట్టించుకోలేదు. చివరి నిముషంలో పవన్ స్వయంగా వెనక్కి తగ్గి పార్టీ నేతలను బుజ్జగించుకున్నారు.
అదే సమయంలో ఏపీలో కూడా జనసేనపై బీజేపీ పెత్తనం కొనసాగుతోంది. దీంతో తెలంగాణలో పార్టీని పూర్తిగా ఎత్తేయాలనే ఆలోచనను పవన్ విరమించుకున్నారు. అక్కడ పార్టీ ఉనికి ఉంటేనే.. బీజేపీ ముందు తాము డిమాండ్లు ఉంచగలమనేది పవన్ ఆలోచన.
అందులోనూ తెలంగాణలో పవన్ కి డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. అభిమానులంతా ఏదో చేసేస్తారని కాదు కానీ.. ఇటీవల పోసాని వ్యవహారంలో తెలంగాణలో జనసైనికులు, పవన్ అభిమానులు ఎంత హడావిడి చేశారో చూశాం. అందుకే పవన్ తెలంగాణలో కూడా పార్టీ ఉనికి ఉండాలనుకుంటున్నారు. భవిష్యత్తులో బీజేపీతో పొత్తు ఉన్నా లేకపోయినా.. పార్టీని బతికించుకుంటే అదే చాలనేది పవన్ భావన.
ఏపీలో కూడా ప్రస్తుతం బీజేపీ, జనసేన కలసి ఏ ఒక్క కార్యక్రమం చేపట్టలేదు. అటు తెలంగాణలో కూడా అంతే. కనీసం ఏపీలో అయినా నాయకులు అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నారు కానీ, తెలంగాణలో ఆ పరిస్థితి కూడా లేదు.
కనీసం హుజూరాబాద్ లో అంత గొడవ జరుగుతున్నా.. పవన్ జనసైనికులకు బీజేపీకి ఓట్లు వేయాలని, ఆ పార్టీ తరపున ప్రచారం చేయాలని పిలుపునివ్వలేదు. ఇప్పుడు ఖమ్మంలో సొంతంగా జనంలోకి అంటూ వెళ్తున్నారు. అంటే ఒకరకంగా పవన్ ఒంటరిగా పార్టీని పటిష్ట పరిచేందుకు సిద్ధమవుతున్నట్టే.