ఏపీలో టీడీపీకి సీన్ లేదని అందరి కంటే తమ్ముళ్లకే ముందు తెలిసిపోతుందా అంటే జరుగుతున్న పరిణామాలు అవును అనే చెబుతున్నాయి. ఏడాది అయినా టీడీపీ బతికిబట్టకట్టకపోవడంతో నైరాశ్యంలో ఉన్న తమ్ముళ్ళు తమ దారి తాము వెతుక్కునే పనిలో పడ్డారు.
అందులో భాగంగా ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన ఓ మాజీ మంత్రి, సీనియర్ నేత బీజేపీ వైపు చూస్తున్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఆయన రాజకీయంగా ఢక్కామెక్కీలు తిన్న నేత. పార్టీ అధికారంలో ఉన్నపుడు అత్యంత కీలకంగా వ్యవహరించడమే కాదు అధినాయకత్వానికి కుడుభుజంగా ఉండేవారు. గత కొంతకాలంగా పార్టీలో ఆయన యాక్టివిటీ తగ్గిందని అంటున్నారు.
ఇక ఆయన విపక్ష పాత్రంలో కూడా ఇమడలేకపోతున్నారని అంటున్నారు. తనకు సరైన హామీ ఇస్తే బీజేపీ తీర్ధం పుచ్చుకోవడానికి అభ్యంతరం లేదని ఆయన రాయబారాలు నడుపుతున్నట్లుగా చెబుతున్నారు. ఆయన చూపు రాజ్యసభ మెంబర్ షిప్ మీద ఉందని అంటున్నారు.
మరి బీజేపీ పెద్దలు ఆయన్ని చేరదీస్తారా. ఆయన కోరినట్లుగా పెద్దల సభకు పంపుతారా అన్న దాని మీదనే ఆయన గోడ దూకుడు ఆధారపడి ఉందని అంటున్నారు. ఏపీలో బలమైన సామాజికవర్గానికి చెందిన ఆయన సేవలు బీజేపీకి చాలా అవసరం కూడా. ఆర్ధికంగా కూడా బలంగా ఉన్నా ఆయన్ని కమలం గూటికి చేర్చేందుకు ఈ సరికే అక్కడ చేరిన మాజీ టీడీపీ నేతలు కూడా క్రుషి చేస్తున్నారని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.