పండగలు, పబ్బాలు మనుషులకే కాదు, వైరస్ లకు బ్యాక్టీరియాలకు కూడా మంచి సంతోషాన్నిచ్చేలా ఉన్నాయి. పండగల వేళ కరోనా వైరస్ విజృంభించడం దీనికి సంకేతం. పండగ పేరుతో జనం కొవిడ్ నిబంధనలు పక్కనపెట్టి సరదాల్లో మునిగిపోతే వైరస్ కూడా అందరి సరదా తీర్చేందుకు సిద్ధమైంది. ఏపీలో ముఖ్యంగా సంక్రాంతి తర్వాత కొవిడ్ పుట్ట పగిలే అవకాశాలున్నాయి.
ఏపీలో 15 రోజుల్లో కొవిడ్ కేసుల్లో పెరుగుదల భారీగా కనిపిస్తోంది. గతంలో 10, 20 కేసులు నమోదయ్యే జిల్లాలు నేడు సెంచరీని దాటేశాయి. ఏపీలోని సగం జిల్లాల్లో కేసులు 150కి పైగానే కనిపిస్తున్నాయి. చిత్తూరు, విశాఖ, గుంటూరు జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. చిత్తూరు పుణ్యక్షేత్రం కావడం, వైకుంఠ ఏకాదశి సందర్భంగా.. తిరుమలకు భక్తులు పోటెత్తుతుండటంతో కరోనా కేసులు ముందు ముందు మరింతగా పెరిగే అవకాశం ఉంది.
నైట్ కర్ఫ్యూ విషయంలో వెనకడుగు మంచిదేనా..?
ఏపీలో నైట్ కర్ఫ్యూ అమలులోకి వచ్చినట్టే ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకో వెనక్కి తగ్గింది. పండగ తర్వాత నైట్ కర్ఫ్యూ ఉంటుందని చెప్పింది. పండగ వేళ కర్ఫ్యూతో బిజినెస్ లు దెబ్బతింటాయి సరే.. అదే సమయంలో కేసులు పెరిగితే ఎవరికి నష్టం..? ప్రజలు చివరిగా ఎవరిని నిందిస్తారు..? కానీ ఈసారి ప్రభుత్వాలు కర్ఫ్యూలు పెట్టబోమని ముందుగానే చెబుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాయి.
మరణాల సంఖ్య తక్కువ..
కేసుల సంఖ్య పెరుగుతున్నా, ఈ దఫా మరణాల సంఖ్య పెరగకపోవడం ఊరట. సెకండ్ వేవ్ సమయంలో కేసులతో పాటు, ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య, మరణాల సంఖ్య కూడా భారీగానే ఉంది. కానీ థర్డ్ వేవ్ సమయంలో ఏపీలో మరణాల సంఖ్య స్వల్పంగానే ఉంది. ఆస్పత్రుల్లో ఇన్ పేషెంట్ల సంఖ్య కూడా పెరిగిన దాఖలాలు లేవు.
గడచిన 24 గంటల్లో 1831మంది కొత్తగా కొవిడ్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఏపీలో 7195 యాక్టివ్ కేసులు ఉన్నాయి. డెల్టా వేరియంట్ విజృంభించిన సమయంలో.. శ్వాస కోశ సమస్యలు, ఊపిరి తిత్తుల్లో ఇన్ఫెక్షన్ తో ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. స్టిరాయిడ్స్ వాడితే కాని పరిస్థితి అదుపులోకి రాలేదు. ఇప్పుడు కేసుల సంఖ్య పెరుగుతున్నా పారాసిట్మాల్, సిట్రజన్ తో పని జరిగిపోతోంది.
ఈ దశలో థర్డ్ వేవ్ పెద్ద ప్రమాదకరం కాకపోయినా కొవిడ్ కేసుల వ్యాప్తి దృష్ట్యా జనం అప్రమత్తంగా ఉండటం మాత్రం మంచిది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా, పండగల వేళ నిబంధనలు గాలికొదిలేసినా.. తాడే పాము అయ్యే ప్రమాదం ఉంది.