ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్యలా ఇంట్లో రఘురామ…బయట సీఐడీ అంటే సినిమా టైటిల్ మాత్రం కాదు. ఏపీ సీఐడీతో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకున్న అనుబంధం ఏంటో అందరికీ తెలిసిందే. అప్పుడప్పుడు రఘురామను చూడ కుండా సీఐడీ అధికారులు ఉండలేరట! అందుకే ఆయన్ను చూసి, యోగక్షేమాలు తెలుసుకునేందుకు హైదరాబాద్‌లోని రఘురామ ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు వెళ్లారని సరదా కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.
పాపం, రఘురామకేమో సీఐడీ అంటే వణుకు. సీఐడీ పేరు చెబితే చాలు…గత జన్మ కూడా గుర్తుకొస్తుందనే అభిప్రాయాలు లేకపోలేదు. రఘురామను చూసి, ఆప్యాయంగా పలకరిద్దామని ఇంటి వరకూ వెళ్లిన సీఐడీ అధికారులకు కాస్త నిరాశే ఎదురైనట్టు వార్తలొస్తున్నాయి.
సీఐడీ వాళ్లొస్తే తాను ఇంట్లో నుంచి బయటికి రానని భీష్మించుకుని కూర్చున్నట్టు సమాచారం. గతంలో సీఎం జగన్‌పై దూషణలకు సంబంధించి రఘురామపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఆ కేసుల్లో రఘురామ అరెస్ట్, అతిథి సత్కారాలు, ఇతరేతర సంగతులు తెలిసినవే.
ఆ కేసులకు సంబంధించి మంచీచెడు ముచ్చటించేందుకు రఘురామ వద్దకు ఏపీ సీఐడీ అధికారులు వెళ్లినట్టు తెలుస్తోంది. కేసుల్లో విచారణ విషయమై నోటీసులు అందించేందుకు వచ్చామని, తమను నమ్మి బయటికి రావాలని ఏపీ సీఐడీ అధికారులు వేడుకుంటున్నా …ఊహూ నమ్మనంటే నమ్మను అని రఘురామ అంటున్నారని సమాచారం.
మరోవైపు ఆ నోటీసులను తనకు ఇవ్వాలని రఘురామ కుమారుడు కోరినట్టు తెలిసింది. అందుకు సీఐడీ అధికారులు నిరాకరించారని సమాచారం. ఇంత దూరం వచ్చి… పెద్దాయన్ను చూసి, ఆయన చేతికి ఇస్తేనే తమకు తృప్తిగా ఉంటుందని సీఐడీ అధికారులు ప్రేమగా కుటుంబ సభ్యులకు చెప్పినట్టు తెలిసింది. మరోవైపు రఘురామ లాయర్లతో సీఐడీ అధికారులు చర్చిస్తున్నారని సమాచారం.
రఘురామ ఒక్కసారి బయటికి రావయ్యా….మీ కోసం అంతదూరం నుంచి వచ్చిన వాళ్లను నిరాశ పరచడం న్యాయమా సార్?