మొదట తమకు మెజారిటీ లేదు తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమంటూ భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. అయితే వారమైనా గడకముందే భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేసింది. ఈ వారం రోజుల్లో భారతీయ జనతాపార్టీకి మెజారిటీని ఎవరిచ్చారు? ప్రజలు అయితే ఇవ్వలేదు!
అడ్డగోలుగా మాత్రమే ఇప్పుడు మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నిలబడాలి. అయితే అడ్డగోలుగా అయినా బీజేపీ ప్రభుత్వం నిలబడుతుందా? అనేది సందేహమే. ఎందుకంటే.. బీజేపీ మెజారిటీకి చాలా చాలా దూరంగా ఉంది!
ఎన్సీపీ అధినేత శరద్ పవారేమో తమ అధికారిక మద్దతు బీజేపీ ప్రభుత్వానికి లేదని తేల్చి చెబుతున్నారు. అజిత్ పవార్ తన ఇష్టానికి వెళ్లి బీజేపీతో చేతులు కలిపారని శరద్ పవార్ అంటున్నారు. అజిత్ పవార్ వెంట 10-11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని శరద్ పవార్ అంటున్నారు!
మరి అదే నిజం అయితే..బీజేపీకి కనీస మద్దతు లేనట్టే. తెల్లవారుఝామున టక్కున సీఎంగా ఫడ్నవీస్ చేత ప్రమాణ స్వీకారం అయితే చేయించారు కానీ, ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు బల పరీక్షను అయితే నెగ్గాలి. అందుకు బీజేపీకి చాలా మంది ఎమ్మెల్యేల అవసరం ఉంది.
బలపరీక్షలోపు శరద్ పవార్ ను కూడా బీజేపీ బెదిరించో, బతిమాలో తన వైపుకు తిప్పుకోవచ్చు. ఒకవేళ అది జరగకపోతే మాత్రం.. ప్రభుత్వ మనుగడ కష్టమే. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలప్పుడు మొదట యడ్యూరప్ప చేత సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. రెండు రోజులకే బలపరీక్షలో ఓడి ఆయన రాజీనామా చేశారు. ఎన్సీపీ అధికారికంగా సపోర్ట్ చేయకపోతే ఫడ్నవీస్ కు కూడా భంగపాటు తప్పకపోవచ్చు. చీలిక పేలికల వర్గాల మద్దతుతో బీజేపీ ప్రభుత్వ మనుగడ కష్టమే.