టాలీవుడ్, కోలీవుడ్ లో అంజలి-జై డేటింగ్ వ్యవహారం అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరి ప్రేమకథ ఓపెన్ సీక్రెట్. కలిసి ఒకే అపార్ట్ మెంట్ లో గడిపిన గతం కూడా వీళ్లకుంది. అలాంటి వీళ్లిద్దరూ తాజాగా విడిపోయారు. జై నుంచి విడిపోయిన తర్వాత అంజలి పూర్తిగా టాలీవుడ్ కే పరిమితమైంది. దాదాపు ఆమె హైదరాబాద్ లోనే ఉంటోంది. మధ్యలో చెన్నై వెళ్లినా తిరిగి హైదరాబాద్ వచ్చేస్తోంది.
ఇలా హీరో జైకు దూరంగా ఉంటున్న అంజలి గురించి ఓ నిర్మాత స్పందించాడు. అంజలి కెరీర్ ను జై నాశనం చేశాడని ఆరోపించాడు నిర్మాత నందకుమార్. గతంలో జై-అంజలి హీరోహీరోయిన్లుగా బెలూన్ అనే సినిమా నిర్మించిన ఈ నిర్మాత.. జై పై తీవ్ర విమర్శలు చేశాడు.
బెలూన్ సినిమా ఫ్లాప్ అవ్వడానికి, భారీగా నష్టాలు రావడానికి జై కారణమని ఆరోపించిన నందకుమార్.. మంచి మనసున్న అంజలిని చెడగొట్టేశాడని చెబుతున్నాడు. కోలీవుడ్ లో అంజలికి ఆఫర్లు తగ్గడానికి ఓ రకంగా జై కారణమని ఆరోపించాడు. ఈ సందర్భంగా కొడైకెనాల్ లో జరిగిన ఓ ఘటనను చెప్పుకొచ్చాడు.
బెలూన్ షూటింగ్ టైమ్ లో కొడైకెనాల్ లో హీరోహీరోయిన్లకు రెండు ఫైవ్ స్టార్ రూమ్స్ బుక్ చేశారట. కానీ జై మాత్రం అంజలి గదిలోనే ఉన్నాడట. తన గది అస్సలు వాడలేదట. రోజుకు 12వేల రూపాయల రెంట్ ఉన్న ఆ గదిని ఖాళీ చేద్దామని కోరినా జై నిరాకరించాడట. అంతేకాకుండా.. కావాలనే షూటింగ్స్ ఎగ్గొట్టేవాడని, అంజలి చేత కూడా రకరకాల సాకులు చెప్పి షూటింగ్స్ కాన్సిల్ చేయించాడని నందకుమార్ ఆరోపించారు.
ఇలా అంజలి కెరీర్ తో జై ఆడుకున్నాడని అంటున్నాడు. ప్రస్తుతం అంజలి-జై కలిసి ఉండడం లేదు. ఆమె పూర్తిగా సినిమాలపైనే దృష్టిపెట్టింది. తమిళ్ లో 5, తెలుగులో 2 సినిమాలు చేస్తోంది. ఆమె నటించిన నిశ్శబ్దం సినిమా విడుదలకు సిద్ధమైంది.