కేంద్ర మంత్రి నారాయణ రాణేను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేయబోతున్నారా? అనే అంశం ఆసక్తిదాయకంగా మారింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను ఉద్దేశించి రాణే చేసిన తీవ్ర వ్యాఖ్యలపై శివసేన శ్రేణులు మండి పడుతున్నాయి. ఈ విషయంలో ఆయనపై పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశాయి. ఈ నేపథ్యంలో సొంత రాష్ట్రంలో జన అశీర్వాద యాత్రను చేస్తున్న రాణేను పోలీసులు అరెస్టు చేయవచ్చనే ప్రచారం జరుగుతూ ఉండటం గమనార్హం.
ఇంతకీ ఈ రచ్చ ఎందుకు రేగిందంటే.. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు తను గట్టి చెంప దెబ్బను కొట్టే వాడినంటూ రాణే జన ఆశీర్వాదయాత్రలో ప్రకటించడం వివాదానికి దారి తీసింది. ఇంతకీ.. ఎందుకు తను ఠాక్రేను కొట్టాలనుకున్నట్టో కూడా రాణే చెప్పుకొచ్చారు.
ఒక కార్యక్రమంలో ఠాక్రే మాట్లాడుతూ.. దేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చిందనే అంశాన్ని తడుముకోకుండా చెప్పలేకపోయారట. ఆగస్టు 15 అంటూ చెప్పి, సంవత్సరం చెప్పడం గురించి సరి చూసుకున్నాడట.. అది చూసి రాణేకు చాలా కోపం వచ్చిందట. ఒకవేళ తను అక్కడే ఉండి ఉంటే.. ఠాక్రే చెంపపై గట్టి దెబ్బ కొట్టేవాడినంటూ రాణే వ్యాఖ్యానించాడు.
అసలే తమ పార్టీ నేతలను ఏమైనా అంటే శివసైనికులు అస్సలు సహించే టైపు కాదు. ఇలాంటి నేపథ్యంలో శివసేనలోనే ఎదిగిన రాణే ఇప్పుడు ఠాక్రేపై తీవ్ర వ్యాఖ్య చేయడాన్ని వాళ్లు అసలు సహించలేకపోతున్నారు.
నారాయన్ రాణే రాజకీయ ప్రస్థానమే శివసేనతో మొదలైంది. సేన ద్వారానే ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అంతే కాదు.. చాలా కాలం కిందట బీజేపీ-సేన సంకీర్ణ ప్రభుత్వంలో ఆయన కొన్ని రోజుల పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా చేశారు. ఆ తర్వాత ఠాక్రేలతో విబేధించి సేనను వీడారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడ మంత్రిగా చేశారు. ఆపై సొంత పార్టీ, అటుపై బీజేపీ.. ఇదీ రాణే కథ.
శివసేనలో పుట్టి పెరిగి, ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే చెంప పగల గొట్టే వాడినంటూ రాణే చేసిన వ్యాఖ్య ఆ పార్టీలో బాగా అసహనాన్ని కలిగిస్తూ ఉంది. ఈ క్రమంలో మహారాష్ట్రలోనే ఈ కేంద్ర మంత్రి అరెస్టు జరగవచ్చనే ప్రచారం కూడా జరుగుతూ ఉంది. మరి బీజేపీ కేంద్ర నాయకత్వంతో వివాదాలను సేన కోరుకోవడం లేదు. అయితే మహారాష్ట్ర బీజేపీ నేతలంటే మాత్రం సేన విరుచుకుపడుతోంది.