టాలీవుడ్ లో సినిమాల విడుదల గడబిడ సద్దు మణిగింది. సీటీమార్, లవ్ స్టోరీ సినిమాల డేట్ లు ఫిక్స్ అయ్యాయి. ఈ సినిమాల డేట్ల మీద గత వారం రోజులుగా విపరీతంగా చర్చలు నడిచాయి. ఆఖరికి ముందు అనుకున్నట్లుగానే 3న సీటీమార్, 10న లవ్ స్టోరీ విడుదలకు డిసైడ్ అయ్యాయి. ఈ రెండు సినిమాలకు జనాలురావడం, రాకపోవడంపై చాలా వ్యవహారాలు ఆధారపడి వున్నాయి.
గోపీచంద్-తమన్నాల కాంబినేషన్ లో సంపత్ నంది డైరక్షన్ లో తయారైన సీటీమార్ కోవిడ్ రెండో ఫేజ్ తరువాత వస్తున్న తొలి పెద్ద మాస్ సినిమా. సరైన మాస్ సినిమా పడితే జనాలు ఇళ్ల నుంచి కదిలి వస్తారని టాలీవుడ్ నిర్మాతలు ఆశిస్తున్నారు. సీటీమార్ ఆ ఆశలు నిజం చేస్తుందేమో చూడాలి.
చైతన్య-సాయిపల్లవిల కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల డైరక్షన్ లో తయారైన సినిమా లవ్ స్టోరీ. కరోనా రెండో ఫేజ్ తరువాత ఫ్యామిలీలు ఇంకా థియేటర్లకు రావడం లేదు. లవ్ స్టోరీ ఈ సమస్య తీరుస్తుందని, ఫ్యామిలీలను థియేటర్లకు రప్పిస్తుందని ఆశిస్తున్నారు.
ఈ రెండు సినిమాల వల్ల థియేటర్లు కళకళలాడితే మరిన్ని సినిమాలు క్యూ కట్టడం ఖాయం. ఇదిలా వుంటే 3న రావాల్సిన సందీప్ కిషన్ గల్లీ రౌడీస్ మాత్రం వాయిదా పడే అవకాశం వుందని తెలుస్తోంది.