మనుషులకూ బర్డ్ ఫ్లూ.. ఈసారి కూడా చైనాలోనే!

ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ కు మూలం చైనా అనే విషయం తెలిసిందే. ఇప్పుడు మరో ప్రమాదానికి కూడా చైనా కేంద్ర బిందువైంది. ఇన్నాళ్లూ పక్షులకు మాత్రమే సోకుతుందనుకున్న బర్డ్ ఫ్లూ వ్యాధి, తొలిసారిగా…

ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ కు మూలం చైనా అనే విషయం తెలిసిందే. ఇప్పుడు మరో ప్రమాదానికి కూడా చైనా కేంద్ర బిందువైంది. ఇన్నాళ్లూ పక్షులకు మాత్రమే సోకుతుందనుకున్న బర్డ్ ఫ్లూ వ్యాధి, తొలిసారిగా మనిషికి సోకింది. ప్రపంచంలోనే తొలిసారిగా ఓ మనిషికి ఈ వ్యాధి సోకింది. చైనాలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.

పక్షులకు ప్రాణాంతకంగా మారే బర్డ్ ఫ్లూ మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉందంటూ కొన్నేళ్లుగా విశ్లేషణలు వస్తూనే ఉన్నాయి. కానీ దానికి ఆధారాలు మాత్రం లేవు. తొలిసారిగా చైనాలోని తూర్పు ఫ్రావిన్స్ లోని జెన్ జియాంగ్ నగరానికి చెందిన ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకింది. జ్వరం, ఇతర వైరస్ లక్షణాలతో హాస్పిటల్ లో చేరిన ఇతడికి బర్డ్ ఫ్లూ సోకినట్టు వైద్యులు నిర్థారించారు.

అయితే ఎప్పట్లానే ఈ విషయాన్ని చైనా అధికారులు చాలా ఆలస్యంగా బయటకు చెప్పారు. ఏప్రిల్ లోనే ఇతడికి బర్డ్ ఫ్లూ నిర్థారణ కాగా.. నిన్న ఆ విషయాన్ని ప్రపంచానికి చెప్పింది చైనా. బాధితుడికి వైరస్ ఎలా సోకిందనే విషయాన్ని చెప్పని చైనా వైద్యులు.. అతడి ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదని, త్వరగానే కోలుకున్నాడని మాత్రం చెప్పారు. 

బర్డ్ ఫ్లూ కూడా అంటువ్యాధి అనే విషయం తెలిసిందే. దీంతో సదరు రోగితో ఈమధ్య కాలంలో టచ్ లోకి వచ్చిన వాళ్లందర్నీ క్వారంటైన్ లో ఉంచారు అధికారులు. అయితే ఇదేమంత ప్రమాదకరమైన వైరస్ కాదంటున్నారు.

H10N3 రకానికి చెందిన ఈ వైరస్ పక్షుల్లోనే ఎక్కువగా వ్యాపిస్తుందని.. మనుషుల్లో పెద్ద ఎత్తున వ్యాపించే ప్రమాదం లేదని అంటున్నారు సైంటిస్టులు.

ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న ప్రాణాంతక వైరస్ లలో బర్డ్ ఫ్లూ కూడా ఒకటి. ఈ వైరస్ బారిన పడి లక్షలాది కోళ్లు మృత్యువాత పడిన ఘటనలు గతంలో చూశాం. ఒక దశలో పౌల్ట్రీ రంగం కుదేలైంది కూడా. ఇప్పుడీ వైరస్ మనిషికి కూడా సోకుతోందనే వార్త అందర్నీ భయభ్రాంతులకు గురిచేస్తోంది. అయితే ఎక్కువగా పౌల్ట్రీల్లో పనిచేసేవారికే ఈ ముప్పు ఎక్కువ.