తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్ తనయ వైఎస్ షర్మిల మరోసారి పంచ్‌లు విసిరారు. తెలంగాణలో కొత్త పార్టీ పెట్టే పనిలో ఉన్న వైఎస్ షర్మిల …తాను బలపడాలంటే రాజకీయంగా కేసీఆర్‌ను టార్గెట్ చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఈ పరంపరలో కేసీఆర్ పాలనపై సూటిగా, ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు. అదే ఒరవడిని మరోసారి ఆమె కొనసాగించారు.
తెలంగాణలో ఉద్యోగాల భర్తీ చేపట్టకపోవడాన్ని నిరసిస్తూ వెంకటేశ్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. వెంకటేశ్ కుటుంబానికి తాను అండగా ఉంటానని షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లాలోని వెల్దుర్తి మండలం శేరిల్లా గ్రామంలో వెంకటేశ్ కుటుంబాన్ని వైఎస్ షర్మిల బుధవారం ఉదయం పరామర్శించారు.
అనంతరం మీడియాతో షర్మిల మాట్లాడుతూ కేసీఆర్ పాలనపై విరుచుకుపడ్డారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని అందరూ నమ్మారన్నారు. కానీ, తెలంగాణ రాష్ట్రం వచ్చి ఏడేళ్లు గడిచినా ఉద్యమ లక్ష్యాలు దరిదాపుల్లో కూడా లేవన్నారు.
నేడు తెలంగాణలో ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువత ఉద్యోగాలు రాలేదనే అవేదనతో బలవన్మరణాలకు పాల్పడడం తెలంగాణ ఉద్యమానికే అవమానకరమన్నారు. తెలంగాణలో 35 లక్షల మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని షర్మిల గుర్తు చేశారు.
ఉద్యోగాల కల్పనకు నోటిఫికేషన్లు ఇవ్వకుండా పాలకులు మరణ శాసనాలు రాస్తున్నారని మండిపడ్డారు. ఇంకా ఎంత మంది నిరుద్యోగులు చనిపోతే ఉద్యోగాలు ఇస్తారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారని, మరి ప్రజల పిల్లలకు ఉద్యోగాలు వద్దా అని షర్మిల పంచ్ డైలాగ్‌లతో తెలంగాణ సర్కార్‌పై తనదైన స్టైల్‌లో విమర్శలు గుప్పించారు.