-ముక్తకంఠంతో అభినందించిన ప్రజానీకం
-తొలి వందరోజుల్లో ఆకట్టుకున్న జగన్ పాలన
-జగన్ పాలనను అత్యంత విపులంగా విశదీకరిస్తున్న ప్రజలు
-'హాఫ్' మార్కును చేరిన అభినందనలు
-తెలుగుదేశం పార్టీ వర్గాలవి పెదవి విరుపులే
-ప్రజలతో కనెక్ట్ కాలేకపోతున్న ప్రతిపక్షం!
-'గ్రేట్ఆంధ్ర' సర్వేలో తేలిన ఆసక్తిదాయకమైన విషయాలు
'ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన ఎలా ఉంది..?' అనే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా 'గ్రేట్ఆంధ్ర' ప్రత్యేక అధ్యయనం చేసింది. కొన్ని వేల శాంపిల్స్ తీసుకుని.. జగన్ పాలనపై ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. ప్రాంత, కుల, మత, లింగతేడాలను ప్రాతిపదికగా చేసుకుని.. విభిన్న వయసుల వారి నుంచి అభిప్రాయాలను రాబట్టింది 'గ్రేట్ఆంధ్ర'. ఆఫ్‌లైన్‌లో కొన్ని వేలమందిని ప్రత్యక్షంగా కలిసి.. జగన్ పాలనపై వారి అభిప్రాయాలను తెలుసుకుంది. అత్యంత భారీ మెజారిటీతో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వందరోజులు పూర్తి అవుతున్న దశలో ఈ అధ్యయనం సాగింది. జగన్ పాలనా.. 'చాలా బాగుంది', 'బాగుంది', 'బాగోలేదు', 'అస్సలు బాగోలేదు' అనే ఛాయిస్‌లను ఇచ్చి ఈ అధ్యయనం చేయడం జరిగింది.
కొన్ని వేల అభిప్రాయాలను తీసుకున్న అనంతరం.. స్థూలంగా చెప్పాలంటే.. తన ఫస్ట్ ఇంప్రెషన్లో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి 'బెస్ట్' అనిపించుకున్నారని చెప్పవచ్చు. దాదాపు ఏడు రోజుల వ్యవధిలో జరిగిన ఈ అధ్యయనంలో కొన్నివేల శాంపిల్స్‌ను తీసుకోవడం జరిగింది. వాటి శాతాల వారీగా చూస్తే.. వైఎస్ జగన్ పాలన చాలా బాగుంది అన్న వారి శాతం 47గా ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన బాగుంది/ఫర్వాలేదు అని చెప్పిన వారి శాతం 10గా ఉంది. ఇక జగన్ పాలన బాగోలేదు అన్న వారి శాతం 30. వైఎస్ జగన్ పాలన అస్సలు బాగోలేదని పెదవి విరిచిన వారి శాతం 13గా ఉంది. ఇదీ గ్రేట్ఆంధ్ర చేసిన అధ్యయనం ఫలితం.
ఇటువైపు అనంతపురం నుంచి అటు ఉత్తరాంధ్ర జిల్లాల వరకూ 'గ్రేట్ఆంధ్ర' టీమ్ చేసిన సర్వే ఫలితం ఇది. బంపర్ మెజారిటీతో జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం పరిపాలన సాగుతున్న వైనంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఈ విషయంలో ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. అయితే పరిస్థితి చాలావరకూ ఫ్లూయిడ్‌గా ఉందని అంటున్నారు మేధావులు. ఇలాంటి నేపథ్యంలో ప్రజల అభిప్రాయం ఎలా ఉందనేది సర్వత్రా ఆసక్తిదాయకమైన అంశం. ఆ ఆసక్తి మేరకు, పాఠకులకు ఆ విషయాన్ని తెలియజేయడానికి 'గ్రేట్ఆంధ్ర' ఈ అధ్యయనాన్ని చేపట్టింది. భిన్న వర్గాల వారిని, భిన్న ప్రాంతాల వారిని, భిన్నమైన వయసుల వారిని, స్త్రీ- పురుషుల, వృద్ధుల అభిప్రాయాలను తీసుకుంటూ.. ఈ అధ్యయం సాగింది. ప్రభుత్వం ఏరకంగా అయితే ప్రజలను విభజించి వారి వారిని ఆకట్టుకోవడానికి, వారి వారి అవసరాలను తీర్చేలా పాలన సాగిస్తుందో.. అదేరకంగా వ్యక్తులను విభజించుకుని ఈ అధ్యయనం సాగింది. క్షేత్రస్థాయిలో వినిపించే వాస్తవ అభిప్రాయాల మాలికే ఈ అధ్యయనం.
సోషల్ మీడియాలోనో.. మీడియాలోనో.. మేధావుల మాటల్లోనో.. తాము ఏర్పరుచుకున్న అభిప్రాయానికి అనుగుణమైన వాణి వినిపిస్తూ ఉంటుంది. లాజికల్‌గా ఆలోచిస్తూ, గతాన్ని, వర్తమానాన్ని బేరీజు వేస్తూ సదరు వ్యక్తులు, మేధావులు మాట్లాడుతూ ఉంటారు. అయితే మేధావులవి విశ్లేషణలు మాత్రమే. క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయాన్ని తీసుకుని విశ్లేషించే వాళ్లు తక్కువమందే. ప్రజలు ఏదైనా అభిప్రాయం చెప్పినా.. వారిని తక్కువ అంచనా వేయడం, వారికి జ్ఞానబోధ చేయాలని ఎదురు సుత్తి వేసే మేధావులూ ఉంటారు. ఇటీవలి ఎన్నికల్లో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజారిటీతో విజయం సాధిస్తుందని ఏ మేధావీ ఎన్నికల ముందు ఒక అభిప్రాయంగా కూడా చెప్పలేకపోయారు. అదే ప్రజల దగ్గరకు వెళ్లినవారు మాత్రం దాదాపుగా అదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. టీవీల్లో కూర్చుని విశ్లేషించే వాళ్లు, పడక్కుర్చిలో కూర్చుని విశ్లేషణలు రాసేవాళ్లూ.. జగన్ ప్రభావాన్ని ఏమాత్రం అంచనా వేయలేకపోయారు. అలాంటి విశ్లేషకుల మాటలు.. ఇప్పుడూ అలానే సాగుతూ ఉన్నాయి.
ఇలాంటి నేపథ్యంలో అసలు పరిస్థితి ఏమిటనే విషయం కోసం ప్రజల వద్దకే వెళ్లింది 'గ్రేట్ఆంధ్ర'. అందులో అత్యంత ఆసక్తిదాయకమైన వాస్తవాలు తేలాయి. ప్రజాభిప్రాయాలను శాతాల వారీగానే కాకుండా.. జగన్ పాలనపై వినిపించిన ఆసక్తిదాయకమైన కామెంట్లను కూడా పాఠకులకు అందిస్తున్నాం. ప్రముఖంగా వినిపించిన అభిప్రాయాల తీరు ఇలా ఉంది.
రైతులు హ్యాపీ..
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రధానంగా ఆనందంగా ఉన్న వర్గాలు ఏవి? అంటే.. రైతులే అని చెప్పాలి. క్షేత్రస్థాయిలో అనేకమంది రైతులను కలిసిన అనంతరం కలిగే అభిప్రాయం ఇది. ఎన్నికల ఫలితాలను, ప్రభుత్వాన్ని మార్చేసే వాళ్లు ప్రధానంగా రైతులే. వారు ఏది అనుకుంటే అది జరుగుతుంది. వారు ఆశపడితే ఓటేస్తారు.. ఆ ఆశలను అంచనాలను అందుకోకపోతే మాత్రం పాలకుడిపై తిరుగుబాటు తప్పదు. గత ఐదేళ్ల రాజకీయాన్ని రైతు రుణమాఫీ అంశం గట్టిగా నిర్దేశించింది. రుణమాఫీ చేస్తానంటూ గద్దెనెక్కిన చంద్రబాబు నాయడు ఆ హామీని నెరవేర్చలేకపోయే సరికి ఆయనపై రైతుల్లో పూర్తిగా విరక్తి కలిగింది. చెప్పిన పని చేయకుండా చంద్రబాబు నాయుడు ఎన్నికబుర్లు చెప్పినా రైతులను అయితే ఆకట్టుకోలేకపోయారనేది వాస్తవం. ఇక జగన్ పాలనపై రైతుల నుంచి సానుకూలత వ్యక్తం అవుతూ ఉంది. ఈ విషయాన్ని ఉరికే చెప్పేయడం లేదు. రైతులు చెప్పిన మాటలనూ ఇక్కడ ప్రస్తావిస్తున్నాం.
జగన్ గద్దెనెక్కిన వందరోజుల్లో.. రైతులకు ఇన్పుట్ సబ్సిడీలు అందాయి, పంటల బీమా సొమ్ములు అందాయి! మూడునెలల వ్యవధిలో ఐదెకరాల స్థాయి భూమి ఉన్న ఒక్కో రైతూ ప్రభుత్వం నుంచి కనీసం ముప్పై నుంచి నలభై వేల రూపాయల లబ్ధిపొందారు. ఈ విషయాన్ని రైతులు ఆనందంగా చెబుతున్నారు. గమనించాల్సిన అంశం ఏమిటంటే.. అటు ఇన్పుట్ సబ్సిడీలు అయినా, ఇటు పంటల బీమా అయినా.. చంద్రబాబు నాయుడు ఏలిన గత ఐదేళ్లలో అర్ధరూపాయి కూడా రైతులకు అందలేదు. తనుచెప్పిన రుణమాఫీ హామీని అటకెక్కించడమే గాక.. రైతులకు న్యాయంగా దక్కాల్సిన క్రాప్ ఇన్సూరెన్స్ సొమ్ములను కూడా చంద్రబాబు నాయుడు దక్కనీయలేదు. ఇన్పుట్ సబ్సిడీల ఊసేలేదు. అయితే జగన్ గద్దెనెక్కిన మూడు నెలల్లోనే.. రైతులు సహజంగా పొందే ఈ రెండూ కూడా వారికి అందాయి.
చంద్రబాబు నాయుడు చేసిన రుణమాఫీ కన్నా.. వీటి విలువ ఎక్కువ అనేది కూడా గమనించాల్సిన అంశం. కొన్ని రైతు కుటుంబాలు అయితే.. రెండు మూడు పట్టాదారు పాసుపుస్తకాలతో లక్ష రూపాయల వరకూ ఇన్సూరెన్స్- ఇన్పుట్ సబ్సిడీలు పొందారు. గమనించాల్సిన మరో అంశం ఏమిటంటే.. పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీలు చివరగా రైతులకు అందింది వైఎస్ హయాంలోనే. ఆ తర్వాత పాలకులు వాటిని అటకకు ఎక్కించారు. ఇప్పుడు జగన్ వాటిని మళ్లీ ప్రజలకు చేరువచేశారు. ఈ విషయాలను చాలాచోట్ల రైతులు ప్రస్తావించారు. ఇక పగలే తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ పంపిణీ కూడా జరుగుతూ ఉంది. ఇది రైతులకు మరో సానుకూలాంశం. అయితే రాయలసీమలో రైతులు తొమ్మిది గంటలసేపు ఏకధాటిగా విద్యుత్ సరఫరా వద్దని చెబుతున్నారు. దానివల్ల బోర్లలో నీళ్లను తోడటానికి కూడా అవకాశం లేకుండా పోతోందని.. విరామాలతో కరెంట్ ఇస్తే.. నీళ్లు లోపల మళ్లీ ఊరుతాయని, అప్పుడు వాటిని తోడుకోవడానికి వీలుంటుందని చెబుతున్నారు. ఈ మేరకు మండలస్థాయి విద్యుత్‌శాఖ అధికారుల వద్దకు వెళ్లి.. ఏకధాటిగా తొమ్మిది గంటల విద్యుత్ వద్దని చెప్పి మార్పించుకున్నట్టుగా కూడా రైతులు చెప్పారు.
ఇక రైతులు జగన్ పాలన విషయంలో ఇంకో దానిపై వేచి ఉన్నారు. అదే పెట్టుబడి సాయం. అక్టోబర్‌లో దాన్ని రైతులకు అందించనున్నట్టుగా జగన్ ప్రకటించారు. ఏడాదికి పన్నెండు వేల ఐదువందల రూపాయల మొత్తాన్ని రైతులకు పెట్టుబడి సాయం కింద అందించనున్నారు. అది కూడా రైతులకు అందితే.. జగన్ తొలి ఏడాదికే గట్టెక్కినట్టే! రైతులను అన్ని విధాలుగానూ జగన్ ఆదుకున్నట్టుగా అవుతుంది. ఇదే సమయంలో సాగునీటి ప్రాజెక్టులు నిండటం, వాటి కింద భూమలు సాగుకు రావడం, హంద్రీనీవాకు పుష్కలమైన నీరు అందే అవకాశాలు ఉండటం.. ఇవన్నీ కూడా జగన్ మీద సానుకూల భావనను ఏర్పారుస్తోంది రైతుల్లో. గతంలో వైఎస్ పాలనలో కనిపించిన జలకళ ఇప్పుడు మళ్లీ కనిపిస్తోందనే భావన రైతుల నుంచి వ్యక్తం అవుతోంది. ఈ పీల్ గుడ్ ఫ్యాక్టర్‌తో జగన్ తిరుగులేని స్థాయి నేతగా మారుతున్నారు! ఇవే పరిస్థితులూ కొనసాగితే.. జగన్ రైతు బంధువుగా నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
డ్వాక్రా మహిళలు.. మిశ్రమ స్పందన!
ఒక వ్యక్తి ఇలాంటి రాజకీయ అంశాల గురించి తన అభిప్రాయాన్ని చెప్పాడంటే కొన్నిసార్లు తను వ్యక్తిగతంగా పొందిన లబ్ధి ఎంత అనేది కూడా బేరీజు వేసుకుంటాడు. అందరికీ మంచి జరుగుతోందని.. మాట్లాడేవాళ్లు కొందరు ఉంటారు. తనకు మంచి జరిగినా మిగతా వాళ్లకు ఏమవుతోందని పరిశీలించి.. ఆపై ఒక అభిప్రాయానికి వచ్చేవాళ్లూ ఉంటారు. డ్వాక్రా మహిళల విషయానికి వస్తే.. తమకు ఎంతవరకూ లబ్ధి కలిగిందనే విషయాన్నీ వారు ఆలోచించుకుంటారు. జగన్ డ్వాక్రా మహిళలకు రుణమాఫీ హామీని ఇచ్చారు. దాన్ని దశల వారీగా అమలు అంటూ ముందే చెప్పారు. ముందే క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలకు డైరెక్టుగా డబ్బులు అందే ఏర్పాట్లు చేసినా.. పోలింగ్‌కు ముందువారంలో వాళ్లకు డబ్బులు విడుదల చేసినా.. మహిళలు క్యూల్లో నిలబడి తనకే ఓటేశారని చంద్రబాబు నాయుడు చెప్పుకున్నా అదంతా అబద్ధమే అనితేలింది.
ఇక జగన్ నెగ్గగానే డ్వాక్రా మహిళలకు భారీగా కలిగిన లబ్ధి ఏమీలేదు. దీంతో ఈ వర్గాలు ఎగ్జయింటింగ్ లేవు. త్వరలోనే ఆ రుణమాఫీకి సంబంధించిన తొలి విడత నిధుల విడుదల ఉందని తెలుస్తోంది. అది జరిగితే వీళ్లలో కొంత ఉత్సాహం వస్తుంది. అయితే జగన్ గెలిచే నాటికి రుణాలను కలిగిన వారికే లబ్ధి జరగబోతోంది. ఒకవేళ ఆ సమయంలో రుణం చెల్లింపుల్లో లేకపోతే డ్వాక్రా మహిళలకు కలిగే లబ్ధి ఏమీలేదు. ఎంతమంది లోన్లు ప్రాసెస్‌లో ఉంటే.. వాళ్లకు మాత్రమే లాభం. మిగతావాళ్లకు ఏలాభం ఉండదు. దీంతో లోన్లను అప్పుడప్పుడే కంప్లీట్ చేసుకున్న వాళ్లలో ఏమాత్రం ఎగ్జయిట్మెంట్ లేదు. దీంతో ఈ వర్గాల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తం అవుతూ ఉంది.
యువత.. బిజీ, బిజీ!
జగన్మోహన్ రెడ్డి వచ్చీరాగానే చేసిన గొప్ప పని.. నోటిఫికేషన్లు. ప్రభుత్వ ఉద్యోగాలను సంపాదించుకోవాలని తాపత్రయపడే యువతకు చేతినిండా పని కల్పించారు జగన్మోహన్ రెడ్డి. ఈ కేటగిరిలోని వారు ఖాళీగా ఉంటే ప్రభుత్వాల మీద త్వరగా వ్యతిరేకత వస్తుంది. వీళ్లకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఉంటే.. ఏ ప్రభుత్వానికి అయినా ఇబ్బంది ఉండదు. ఈ విషయాన్నే గ్రహించినట్టుగా జగన్మోహన్ రెడ్డి అటు గ్రామ వాలంటీర్లు, ఇటు పంచాయతీ సెక్రటరీ పోస్టులకు భారీ నోటిఫికేషన్ ఇచ్చారు. గ్రామ వాలంటీర్ల నియామకాలు ఇప్పటికే జరిగాయి.
సొంతూళ్లో ఉంటూ.. చేయడానికో పని.. నెలకు ఐదారువేల రూపాయల జీతం, ఆపై ఇంటి దగ్గరా ఏదైనా పని చేసుకోవడానికి అవకాశం.. చాలామంది గ్రామీణ యువతరం కోరుకునేది ఇదే. ఇంటి పట్టున ఉంటూ.. ఈ మాత్రం ఉపాధిమార్గం కోసం ఎంతోమంది ఎంతగానో ఎదరుచూశారు. చాలామంది చదువుకుని పెద్ద ఉద్యోగాలు చేయాలనుకుంటారు. ఇంకొందరు ఇంటి పట్టున పని చేసుకోవడాన్ని ఇష్టపడతారు. అలాంటి వారికి జగన్ చేసిన ఉపాధికల్పన ఎంతో ఉత్సాహాన్ని ఇస్తూ ఉంది.
చంద్రబాబు హయాంలో ఇచ్చిన నిరుద్యోగభృతి కన్నా.. ఇది ఎంతో గౌరవంతో కూడుకున్నది అనే భావన వ్యక్తం అవుతోంది యువత నుంచి. తను దిగిపోయే ముందు చంద్రబాబు నాయుడు నెలకు రెండువేల రూపాయల ఇచ్చారు. దాంతో పోలిస్తే జగన్ ఇచ్చే ఐదారువేల రూపాయలు ఎక్కువే. దాంతో పాటు.. ఒక పని చేస్తున్నారనే గౌరవం ఉండనే ఉంటుంది. పల్లెల్లో ఉంటారు కాబట్టి.. వ్యవసాయ పనులూ కొనసాగించుకోవచ్చు. దీంతో గ్రామీణ యువతరంపై ఇది సమ్మోహనాస్త్రంగా మారింది.
ఇక అంత చిన్న జాబ్ చేయలేమనే వారికి.. పంచాయతీ సెక్రటేరియట్ స్థాయి పోస్టుల నోటిఫికేషన్ ఇచ్చారు. అది కూడా భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ. టాలెంట్ ఉండే వారికి అంతకు మించి అవకాశం లేదు. జగన్ తీరును చూస్తుంటే మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో యువతరం వాటి టార్గెట్‌గా బిజీగా ఉంది. ఐటీ కొలువులూ గట్రా కావాలంటే మాత్రం.. యథారీతిన పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థి కొనసాగుతూ ఉంది. ఈ విషయంలో వందరోజుల్లో జగన్ చేయగలిగింది ఏమీలేదు.. ముందు ముందు ఏం చేస్తారనేదే చూడాలని యువతరం నుంచి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
పెన్షన్.. లేట్ అవుతుందా?
చంద్రబాబు నాయుడు బాగా టార్గెట్ చేసుకున్న వర్గాలు పెన్షనర్లు. ఏదోవర్గం అయినా తనకు అండగా ఉండాలని చంద్రబాబు నాయుడు ఒకటో తేదీ రాగానే పెన్షన్ ఇచ్చారు. జగన్ ఇచ్చిన రెండు వేల రూపాయల హామీని కూడా చంద్రబాబు నాయుడు ఆఖర్లో అమలు చేశారు. జగన్ మూడువేలు పెన్షన్ చేస్తానంటూ ప్రకటించారు. అయితే అదిదశల వారీగా అని జగన్ అప్పుడే చెప్పారు. కానీ.. జగన్ అధికారంలోకి రాగానే.. మూడువేలు చేయాలంటూ కొందరు మాట్లాడారు. ఆ మాటలు అసంబద్ధమే. జగన్ తొలి ఏడాదికి అంటూ రెండువందల యాభై రూపాయలు పెంచారు. జగన్‌ను ఎలాగోలా వ్యతిరేకించాలనే వాళ్లు, దురాశ పరులు తప్ప ఈ విషయాన్ని మిగతావారు స్వాగతిస్తున్నారు. అయితే అక్కడక్కడ పెన్షన్ల అందించడం లేట్ అవుతోంది అనేది అభియోగం. కొంతమందే ఈ విషయాన్ని చెప్పారు. తమకు పదో తేదీకి కూడా పెన్షన్ రాలేదని వారుచెప్పారు. మరికొందరు మాత్రం తమకు నాలుగోతేదీ లోపే పెన్షన్ అందుతోందని వివరించారు. ఈ విషయంలో ఇలా భిన్నాభిప్రాయాలు వినిపించాయి.
జగన్‌పై సానుభూతి..!
'ఆ పిల్లగాడు కానీ.. ఎన్నన్ని చేస్తాడు..ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం..' అనే ఒక సానుభూతితో కూడినమాట జగన్ విషయంలో ప్రజల నుంచి వినిపించింది. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాగోలేదనే విషయాన్ని రాజకీయ నేతలు, మేధావులే మాత్రం అర్థం చేసుకున్నారో.. కానీ ప్రజలు మాత్రం ఈ విషయంపై పూర్తి స్పష్టతతో ఉన్నారు. జగన్ వయసులో చిన్నవాడు కూడా కావడంతో.. ప్రజల్లో ఒకింత పెద్దరికం కనిపిస్తోంది. ఉన్నంతలో జగన్మోహన్ రెడ్డి చాలా బాగానే చేస్తున్నాడని పెద్ద తరహాలో చెబుతున్నారు అనేకమంది. జగన్ చేయగిలింది చేస్తాడు, చేయలేనిది కుదరదని చెబుతాడు.. అనే మాటనూ ప్రజలు ప్రస్తావిస్తున్నారు. జగన్ అలా సూటిగా, స్పష్టంగా.. నిజాయితీగా మాట్లాడాడు, చంద్రబాబులా మోసం చేసేమాటలు మాట్లాడరు.. అని అనేకమంది ప్రజలు వ్యాఖ్యానించారు ఈ అధ్యయనంలో. ఇదే ఇమేజ్ను జగన్ కొనసాగించుకోవడం ఆయనకే మంచిదని చెప్పవచ్చు.
దేనికైనా ఒక హద్దుండాలి!
ఫ్రీ పథకాలకూ ఒక హద్దుండాలని అంటున్నారు సామాన్య ప్రజానీకం. ఎడాపెడా అన్నీ ఉచితంగా ఇవ్వడం అనుచితమని వారేచెప్పారు. ఉచిత పథకాలు మంచివే కానీ.. అవి మరీ హద్దు మీరుతున్నాయేమో అని కొందరు అన్నారు. పెన్షన్ అయితేనేం, మరోటి అయితేనేం.. అలా పెంచుకుంటూపోవడం, పనికి మించిన స్థాయిలో డబ్బులు ఇవ్వడం, అన్నీ ఫ్రీ అనడం మంచిది కాదని.. అలాంటి వాటిని క్రమక్రమంగా కట్టడిచేయాలని కొందరు విశ్లేషించారు. అన్నా క్యాంటీన్ల రద్దు విషయాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. కొందరు ఈ విషయంలో ఆక్షేపణ తెలిపారు. అన్నా క్యాంటీన్లు అందుబాటులో లేకపోవడం వల్ల తమకు భోజనమే లేదన్నట్టుగా వారు మాట్లాడారు. ఐదు రూపాయలకు అన్నం దొరికేదని అన్నారు. అలా వెళ్లి తినేవారి కన్నా, ఆ పథకం రద్దు చేయడంపై కొంతమంది తమకు సంబంధం లేని అపార సానుభూతి ప్రకటించారు. మరికొందరు మాత్రం.. ఉచితాలను కట్టడిచేయాలని, ఐదు రూపాయలకు అన్నం వస్తోంది కాబట్టి తింటారు కానీ, అదే కావాలని ప్రజలు అనుకోవడం లేదని.. కాబట్టి ప్రభుత్వంపై భారంపడే ఉచిత పథకాలను క్రమక్రమంగా రద్దుచేసుకొంటూ రావాలని వారు అంటున్నారు.
వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిన చంద్రబాబు నాయుడు!
ఈ మాట కూడా ప్రముఖంగా వినిపించింది. తనపాలనలో చంద్రబాబు నాయుడు అన్ని వ్యవస్థలనూ నాశనం చేశారని కొందరు సామాన్యులనే విశ్లేషించారు. అంశాలను ప్రస్తావించి సైతం వారు ఆ అభిప్రాయాలను వ్యక్తంచేశారు. అన్నీ ఉచితం.. ఉచితం.. అంటూ చంద్రబాబు నాయుడు తన పాలన ఆఖర్లో అల్లకల్లోలం చేశారని, అలాంటి వాటిని జగన్ కట్టడి చేయాలని చూస్తుంటే.. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్లీ వాటిపై రాజకీయం చేస్తున్నారనివారు అంటున్నారు. చంద్రబాబు హయాంలో కొన్ని అసంబద్ధమైన పథకాలు వచ్చాయి. వాటిని కూడా ప్రజలు ప్రస్తావిస్తున్నారు. చంద్రన్న కానుకలు అనేది ఒక పెద్దస్కామ్ అనే అభిప్రాయాలు వినిపించాయి. ఇక ఎన్టీఆర్ విదేశీ విద్యాదీవెన అంటూ చంద్రబాబు మరో అసంబద్ధమైన పథకాన్ని ప్రారంభించారు. చదువుకోవడానికి విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఆర్థికసాయం చేయడం ఈ పథకం ఉద్దేశం. ఆర్థికసాయం అంటే.. ఏ పదివేలో ఇరవై వేలో కాదు.. లక్షల రూపాయలు!
ఒక్కో విద్యార్థికి పది, ఇరవై లక్షల రూపాయలు ఇవ్వడం ఈ పథకం ఉద్దేశం! దేశీయంగా చదువుకోవడానికి, ఏ ఐఐటీల్లోనో సీటు కొట్టిన వాడికో.. డబ్బులిస్తే అది అభినందనీయమే. అయితే మరీ విదేశానికి చదువుకోవడానికి వెళ్లే వారికి ప్రభుత్వం ఉచితంగా డబ్బులు ఇవ్వడం ఏమిటి! విదేశీ వర్సిటీలో ర్యాంకులు తెచ్చుకుంటే.. ఆర్థిక సామర్థ్యం ఉంటే వెళ్తాడు, శక్తి ఉంటే అప్పులు తీసుకుని వెళ్తాడు. అది విద్యార్థి వ్యక్తిగతం. అయితే చంద్రబాబు అలాంటి వారికి డబ్బులు ఇచ్చి విదేశాలకు పంపే పథకం ఒకటి స్టార్ట్ చేశారు. ఏమాత్రం కామన్ సెన్స్ లేని వ్యవహారం అది. విదేశాలకు వెళ్లి చదివే వారికి పదుల లక్షల రూపాయలు ఇవ్వడం ఏమిటి అసలు? అని కొంతమంది ఆక్షేపించారు. అలాంటి పథకాలను జగన్ రద్దు చేయాలని వారు సూచిస్తున్నారు. అలాంటి పథకాలు అప్పుడు ఉన్నా.. వాటి ద్వారా లబ్ధిపొందింది ఎమ్మెల్యేల చుట్టూ ఉన్న వాళ్లే! పక్క రాష్ట్రంలో చదివితే ఫీజురీయింబర్స్మెంటే ఇవ్వరు. అలాంటిది విదేశీ విద్యకు ఉచితంగా డబ్బులు ఇచ్చే తలతిక్క పథకాలను చంద్రబాబు నాయుడు ప్రారంభించారని.. వాటిని కట్టడి చేయాలని సామాన్య ప్రజానీకం కోరుతున్నారు.
అత్యంత ఆనందంగా వాళ్లదే!
జగన్మోహన్ రెడ్డి వందరోజుల పాలనతో క్లౌడ్‌నైన్‌లో విహరిస్తున్నది ఆర్టీసీ ఉద్యోగులే. వాళ్ల దశాబ్దాల చిరకాల వాంఛ నెరవేరింది. ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేయడంతో వారు ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. ఏ ఆర్టీసీ బస్సులో ప్రయాణించినా ఈ విషయం వారి మాటల్లోనే వినిపిస్తుంది. తాము ప్రభుత్వ ఉద్యోగులం అయ్యామని వారు ఎంతో ఆనందంగా చెబుతున్నారు. జగన్ చెప్పిన పనిని చేసి చూపించారని, ఇచ్చిన మాటలను నిలబెట్టుకున్నారని వారు అపరిమిత ఆనందంగా చెబుతున్నారు. జనహృదయాల్లో స్థానం సంపాదించడం అంటే ఇలాగే మరి. ఆర్టీసీ ఉద్యోగులు అంటే రాష్ట్రంలో వాళ్లు కూడా ఒక నిర్ణయాత్మక వర్గమే. అలాంటి వారు ఇప్పుడు జగన్‌ను హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు.
ఆ వర్గాల్లో జగన్‌పై అసంతృప్తి!
వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో కొన్నివర్గాలు పూర్తి అసంతృప్తితో ఉన్నాయి. వాళ్లు మరెవరో కాదు.. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ వర్గాలే. జగన్ పాలన రావాలని వీళ్లు తెగ తాపత్రయపడ్డారు. వాటివెనుక వారి లెక్కలు వేరే ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన వస్తే తమకు ఏవో అవకాశాలు వస్తాయని అనుకున్న వాళ్లు చాలామంది ఉన్నారు. నామినేటెడ్ పోస్టులు పొందాలనే వారి దగ్గర నుంచి, ఊర్లో బార్ అండ్ రెస్టారెంట్ మెయింటెయిన్ చేయాలని ఆశించిన వాళ్ల వరకూ ఒక్కోరిది ఒక్కో లెక్క. ఒక్కోరిది ఒక్కో ఆశ. ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతూ ఉండే వాళ్లే వీళ్లలో అధికం. తాము పార్టీ కోసం తిరిగాం కాబట్టి.. తమకు ఏదో ఒకటి కావాలన్నట్టుగా ఉంటుంది వీళ్ల తీరు. అలాంటి వాళ్ల ఆశలు కొంతమంది ఫలించి ఉండవచ్చు, మరి కొందరివి ఫలించకపోయీ ఉండవచ్చు. కోరినవి దక్కించుకున్న వాళ్లు ఓకే, దక్కించుకోలేకపోయిన వారే ఇప్పుడు బాగా అసహనంతో కనిపిస్తూ ఉన్నారు. తాము కష్టపడినా ఫలితం లేకుండా పోయిందని వారు వాపోతూ ఉన్నారు. ఇలాంటి వాళ్లందరినీ సంతృప్తి పరచడం కూడా అంత తేలిక ఏమీకాదు. ప్రధానంగా ఇది ఎమ్మెల్యేల చేతుల్లోని పని. వీళ్లను సంతృప్తి పరచడమూ ఈజీకాదు, అలాగని వీళ్లను అలాగే వదిలేస్తేనూ ఇబ్బందే! ఇది ఎమ్మెల్యేలు డీల్ చేయాల్సిన వ్యవహారం.
జగన్‌పై అంతులేని అక్కసు!
ఈ అధ్యయనంలో ఇది కూడా వ్యక్తం అయ్యింది. తెలుగుదేశం అనుకూల వర్గాలు జగన్ పాలన పట్ల పూర్తి పెదవి విరుపులతోనే ఉన్నాయి. కులం కోణం నుంచినే, జగన్‌పై అప్పటికే రేగి ఉన్న విద్వేషంతోనో.. ఒక అభిప్రాయానికి వచ్చినవారు.. అదే విషయాన్నే చెప్పారు. జగన్ పాలనను వారు తీవ్రంగానే వ్యతిరేకిస్తున్నారు. జగన్ ఏం చేశారనే అంశంతో సంబంధం లేకుండా.. జగన్ పాలనను తీవ్రంగా వ్యతిరేకించే వాళ్లూ తారసపడ్డారు.
ఇదీ 'గ్రేట్ఆంధ్ర' పరిశీలనలో వినిపించిన విభిన్నమైన అభిప్రాయాలు. పాలన అనేది సినిమా లాంటిదికాదు, దాన్ని వందరోజులు.. రెండువందల రోజులు.. అంటూ విశ్లేషించలేమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వ్యాఖ్యానాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించాలి. నిజమే.. పాలన అనేది వందరోజులో, వెయ్యిరోజుల సంబరం కాదు. అయితే ఇదొక పరిశీలన. ప్రజాభిప్రాయం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం. జగన్ పాలనపై ఏర్పడిన సానుకూలత ఇక ముందు మరింత పెరగవచ్చు కూడా. అదెలాగంటే.. సెప్టెంబర్, అక్టోబర్ నెలలో కీలకమైన పథకాలను వైఎస్ జగన్ అమలు చేయబోతున్నారు. అందులో 'అమ్మఒడి' వంటి కీలకమైన పథకం కూడా ఉంది. వాటి అమలు జగన్‌పై ప్రజల్లో మరింత నమ్మకాన్ని కలిగిస్తుందేమో! అది ముందు ముందు పరిశీలనల్లో తేలే అంశం. ప్రస్తుత పరిశీలనలో మాత్రం ఎన్నికల నాటి ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్ చాలావరకూ జగన్ విషయంలో కొనసాగుతూ ఉంది.
వందరోజుల్లో జగన్ ఏం సాధించారు?
1) 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు.
2) ఏపీఎస్ ఆర్టీసీ విలీనం చేశారు.
3) ఇంటింటికీ వెళ్ళి పెన్షన్స్ అందిస్తున్నాడు.
4) పలాసలో కిడ్నీ వ్యాదుల సమస్యకి నడుంబిగించాడు.
5) బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేషన్ వర్క్స్‌లో యాభైశాతం చట్టం తెప్పించాడు.
6) బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు యాభైశాతం నామినేటెడ్ పోస్టులను ప్రకటించారు.
7) ఆశ వర్కర్స్‌కి 10 వేల జీతం ఇస్తున్నాడు.
8) ఆసుపత్రుల ఇన్ఫ్రా కోసం 1400 కోట్ల కేటాయింపు చేశాడు.
9) ప్రభుత్వ పాఠశాలలో లక్షమందిని గతంలో కంటే ఎక్కువ మందిని జేర్చాడు.
10) 24రోజుల పాటు అసంబ్లీ నిర్వహించాడు.
11) హిందూ ఆలయాలలో ఇతర మతస్తులు పని చెయ్యడానికి వీలులేదు అని చట్టం చేశాడు.
12) స్పందన అనే కార్యక్రమానికి రూపకల్పన చేశాడు.
13) 100 కోట్ల రూపాయలకు మించిన టెండర్స్‌ను జ్యూడీషియల్ ప్రాసెస్ అంటూ విధానాలు రూపొందించాడు.
14) తిత్లీ బాధితులకు ఇచ్చిన హామీ, చంద్రబాబు 8 నెలల్లో చేయలేని పని 3 నెలల్లో చేశాడు (పంట నష్టం)
15) పల్నాడుకి 5 ఏళ్లలో మెడికల్ కాలేజీ ఇస్తా అని చంద్రబాబు చేయలేని హామీ నేరేవేర్చాడు.
16) రాష్ట్రంలో పేకాట నిషేదించాడు.