బుల్లితెర, వెండితెర …ఏదైనా గ్లామర్ రంగానికి చెందినవే. ఈ రంగంలోని వారికి సమాజంలో ఆకర్షణ ఉండడంతో, అందులో ప్రవేశించడానికి నానా తిప్పలు పడుతుంటారు. బుల్లితెరపై యాంకర్‌గా కనిపించడానికి ఓ వ్యక్తికి ఏకంగా రూ.25 లక్షలు సమర్పించుకుని మోసపోయిన ఘటన వెలుగు చూసింది. ఇలా ఒక్క యాంకర్ పోస్టే కాదు, అనేక ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసగించిన వ్యక్తి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.
విజయవాడలోని భవానీపురానికి చెందిన కోనాల అచ్చిరెడ్డికి మోసగించడమే వృత్తి. బాగా డబ్బున్న వాళ్ల అవసరాలను, ఆకాంక్షలను పసిగడుతూ వారిని ఎలాగోలా బుట్టలో వేసుకోవడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. ఈ క్రమంలో ఓ కేసు విషయంలో అతను పోలీసులకు పట్టుబడ్డాడు.
నల్లగొండ పట్టణంలోని హనుమాన్‌నగర్‌కు చెందిన సమ్మినేని సాయికి ఉద్యోగం ఇస్తానని నమ్మబలికాడు. సాయి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసి, ముఖం చాటేశాడు. దీంతో అచ్చిరెడ్డి చేతిలో మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో అచ్చిరెడ్డి మోసాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి.
నల్లగొండలో జ్యోతిష్యం పేరిట మరో వ్యక్తి దగ్గర రూ.4లక్షలు తీసుకొని మోసం చేశాడు. అలాగే ఖమ్మంకు చెందిన ఓ మహిళకు సాఫ్ట్వేర్ కంపెనీలో వాటా ఇస్తానని రూ.50లక్షలు తీసుకున్నాడు. ఆ తర్వాత అచ్చిరెడ్డి తన నిజస్వరూపాన్ని ప్రదర్శించాడు. సహజంగానే వంచించాడు. దీంతో గత ఏడాది ఖమ్మం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
ఖమ్మం పట్టణానికి చెందిన మరో మహిళకు రైల్వేలో అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఉద్యోగం ఇప్పిస్తామని రూ.20లక్షలు తీసుకున్నాడు. ఆ తర్వాత పత్తా లేకుండా పోయాడు. ఈ మోసంపై విజయవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
విజయవాడకు చెందిన ఒక మహిళకు యాంకరింగ్‌పై మోజు పెంచుకుంది. దీంతో ఎలాగైనా బుల్లితెరపై కనిపించాలనే ఆమె కోరిక నేరువేరుస్తానని అతను ముందుకొచ్చాడు. ఓ ప్రముఖ చానల్లో యాంకర్‌గా అవకాశం ఇప్పిస్తానని నమ్మించి రూ.25లక్షలు వసూలు చేశాడు. చివరికి మోసపోయానని గ్రహించి లబోదిబోమని పోలీసులకు ఆశ్రయించింది. దీంతో భవానీపురం స్టేషన్లోనే మరో కేసు నమోదైంది.