భారతదేశమంటే ఓ పుణ్యభూమి. సంస్కృతి, సంప్రదాయాలు, వేదాలు, ఉపనిషత్తులకు నిలయైన నేల ఇది. భిన్నత్వంలో ఏకత్వానికి పెట్టింది పేరైన భారతదేశంలో మనం జన్మించడమే ఓ అదృష్టం. అలాంటి గడ్డ మనిషి జన్మనివ్వడమే మనకిచ్చిన ఓ గొప్ప వరం. మరి మనకెంతో ఇచ్చిన భరతమాత రుణాన్ని మనం ఏమిచ్చినా, ఎంతిచ్చినా తీర్చుకోలేం.
కానీ భరతమాత రుణం తీర్చుకునే తరుణం వచ్చింది. ఈ పుణ్యభూమి, ఈ కర్మభూమి మనకేం ఇచ్చిందనే ఆలోచన కంటే…మనం ఏం ఇచ్చామని ప్రతి ఒక్కరం ఎవరికి వాళ్లు ప్రశ్నించుకునే సమయం ఇది. అంతేకాదు మనం ఏం ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో కూడా ప్రధాని మోడీ కళ్లకు కట్టినట్టు వివరించాడు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో వారం రోజుల వ్యవధిలో ప్రధాని మోడీ రెండోజారి జాతినుద్దేశించి ప్రసంగించారు.
“చేతులు జోడించి అర్థిస్తున్నా. మీ నుంచి కొన్ని వారాలు తీసుకుంటానని ముందే చెప్పా. దాన్నిప్పుడు అడుగుతున్నా. కరోనా వైరస్ సంక్రమించే సైకిల్‌ను విడగొట్టాలంటే 21 రోజుల సమయం అవసరం. దీన్ని మనం పాటించకపోతే మనం, మన కుటుంబాలు 21 ఏళ్లు వెనక్కి పోతాం. నేనో ప్రధానిగా ఈ మాట చెప్పడం లేదు. మీ కుటుంబంలో వ్యక్తిగా చెబుతున్నా” అని సాక్ష్యాత్తు ఓ ప్రధాని మనముందుకొచ్చి చేతులు జోడించారంటే… భారత్‌లోకి కరోనా వైరస్ మహమ్మారి ఎంత వేగంగా దూసుకొస్తున్నదో అర్థం చేసుకోవచ్చు.
“సామాజిక దూరం పాటించేందుకు 21 రోజుల పాటు ఇంట్లో ఉండండి. ఇంట్లోనే ఉండండి. మీరే కాదు…నేను కూడా దీన్ని పాటించాల్సిందే. లేకపోతే యావత్ భారతం ఇబ్బందులు పడుతుంది” అని ఆయన చెప్పిన దాంట్లో ఆవేదన, అర్థింపు ఉన్నాయి.
21 రోజుల పాటు మనం ఇళ్లలోనే ఉండకపోతే….21 ఏళ్లపాటు మనం, మన కుటుంబాలు వెనక్కి పోతాయని ప్రధాని చేసిన హెచ్చరికను కొట్టిపారేయల్సినవి కాదు. కరోనా తీవ్రతను ఆయన హెచ్చరికలు ప్రతిబింబిస్తున్నాయి.
“బాగా అభివృద్ధి చెంది , అత్యుత్తమ వైద్య సదుపాయాలున్న ఇటలీ, అమెరికా వంటి దేశాల్లో సైతం ఇది బీభత్సం సృష్టిస్తోంది. దీన్ని నివారించడానికి నిపుణులు చెబుతున్న మార్గం ఒక్కటే. అది సామాజిక దూరం”….పదేపదే ప్రధానితో పాటు ప్రతి ఒక్కరూ చెబుతున్న మాట సామాజిక దూరం. కరోనా ఒకరి నుంచి మరొకరికి అంటుకుంటుందని, కాబట్టి పరస్పరం దూరంగా ఉంటే దాని ఆట కట్టించవచ్చని ప్రధాని మొదలుకుని వైద్య రంగ నిపుణులు చేస్తున్న హెచ్చరికను ప్రతి ఒక్కరం పరిగణలోకి తీసుకోవాల్సిందే.
అంతేకాదు, ప్రధాని చెబుతున్నట్టు అత్యుత్తమ వైద్య సదుపాయాలున్న ఇటలీ, అమెరికా దేశాల్లో కరోనా బీభత్సం సృష్టించడాన్ని మీడియా కళ్లకు కట్టినట్టు చూపుతోంది. అయినా మనం మేల్కోకపోతే తప్పు కరోనాది కాదు మనదే అవుతుంది.
అందువల్ల మన కోసం, దేశం కోసం మనం ప్రధాని సూచనలను పరిగణలోకి తీసుకుని 21 రోజుల పాటు ఇంటికే పరిమితమై కరోనా మహమ్మారిని తరిమి తరిమి కొడదాం. 21 రోజుల పాటు ఇంటికే పరిమితమై భరతమాత రుణాన్ని తీర్చుకుందాం. ఎవరి కోసమో అన్నట్టు కాకుండా మన కోసం, మన భవిష్యత్ తరాల కోసం, దేశం కోసం…అన్నిటికి మించి ప్రపంచ మానవాళి సుఖసంతోషాల కోసం 21 రోజుల పాటు స్వీయ నిర్బంధాన్ని పాటిద్దాం. సామాజిక దూరంతో….కనుచూపు మేరలో కరోనా ఉనికే లేకుండా పారదోలుదాం. ఇదే మనముందున్న తక్షణ కర్తవ్యం. దాన్ని చిత్తశుద్ధితో పాటించి…కరోనా అంతు తేలుద్దాం.