తిరుప‌తిలో భ‌య‌ప‌డ్డ‌ట్టే…

తిరుప‌తిలో భ‌య‌ప‌డిన‌ట్టే జ‌రుగుతోంది. క‌రోనా మ‌హ‌మ్మారి కబ‌ళించేందుకు దూసుకొస్తోంది. ప్ర‌సిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల‌కు నిత్యం ల‌క్ష‌లాది భ‌క్తుల రాక‌ క‌రోనా వ్యాప్తికి దోహ‌దం చేస్తోంది. ప్ర‌స్తుతం స‌ర్వ‌ద‌ర్శ‌నం ర‌ద్దు చేసి భ‌క్తుల రాక‌ను…

తిరుప‌తిలో భ‌య‌ప‌డిన‌ట్టే జ‌రుగుతోంది. క‌రోనా మ‌హ‌మ్మారి కబ‌ళించేందుకు దూసుకొస్తోంది. ప్ర‌సిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల‌కు నిత్యం ల‌క్ష‌లాది భ‌క్తుల రాక‌ క‌రోనా వ్యాప్తికి దోహ‌దం చేస్తోంది. ప్ర‌స్తుతం స‌ర్వ‌ద‌ర్శ‌నం ర‌ద్దు చేసి భ‌క్తుల రాక‌ను త‌గ్గించిన ప్ప‌టికీ …క‌రోనా మాత్రం త‌న ప‌ని తాను చేసుకుపోతోంది. 

ఈ నేప‌థ్యంలో చిత్తూరు జిల్లాలో ప్ర‌తిరోజూ వెయ్యికి పైగా కేసులు రావ‌డం, అందులో ఒక్క తిరుప‌తిలోనే స‌గం ఉండ‌డంతో స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, ఉన్న‌తాధికారులు అప్ర‌మ‌త్తం అయ్యారు. కేంద్ర మార్గ ద‌ర్శ‌కాలు అనుస‌రించి తిరుప‌తి న‌గ‌రాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా క‌మిష‌న‌ర్ గిరీషా కాసేప‌టి క్రితం ప్ర‌క‌టించారు.

తిరుప‌తి న‌గ‌ర‌పాల‌క సంస్థ కార్యాల‌యంలో వ్యాపార సంఘాలు, ఆటో, జీపు డ్రైవ‌ర్ల యూనియ‌న్ల‌తో ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి, మేయ‌ర్ శిరీషా, న‌గ‌ర పాల‌క క‌మిష‌న‌ర్ గిరీషా, ఎస్పీ వెంక‌ట‌ప్ప‌ల‌నాయుడు స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా తిరుప‌తిలో క‌రోనా ఉధృతిపై ఆందోళ‌న వ్య‌క్త‌మైంది. ఈ నేప‌థ్యంలో వైర‌స్ క‌ట్ట‌డికి ప్ర‌జ‌లే స్వ‌చ్ఛందంగా బాధ్య‌త తీసుకోవాల‌ని ఎమ్మెల్యే, మేయ‌ర్‌, క‌మిష‌న‌ర్ కోరారు.

తిరుప‌తిలో ప్ర‌తి డివిజ‌న్‌లో క‌రోనా కేసులున్నాయ‌ని, కేంద్రం నిన్న రాత్రి జారీ చేసిన మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం న‌గ‌రంలో క‌రోనా  పాజిటివిటీ రేటు 10 శాతం దాట‌డం, ఆక్సిజ‌న్‌, ఐసీయూ ప‌డ‌కల భ‌ర్తీ 60 శాతం మించ‌డంతో మినీ లాక్‌డౌన్ త‌ర‌హా చ‌ర్య‌లు త‌ప్ప‌డం లేద‌ని కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్‌ వెల్ల‌డించారు. కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు త‌మ‌కు తాముగా ఎక్క‌డికీ తిర‌గ‌కుండా నియంత్రించుకోవాల‌ని కోరారు.  

రేపటి నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలు తెరిచేలా తాము నిర్ణయం తీసుకున్నట్లు వ్యాపార సంఘాలు అధికారులకు తెలిపాయి. వైరస్‌ నియంత్రణపై కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరుపతి నగరాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా నగరపాలక కమిషనర్‌ ప్రకటించారు.  

కేసుల నియంత్రణతో పాటు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఏదైనా ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్ర‌క‌టించే ముందు బ‌హిరంగంగా వెల్ల‌డించాల‌నే కేంద్ర ప్ర‌భుత్వ ఆదేశాల‌ను పాటిస్తున్న‌ట్టు క‌మిష‌న‌ర్ స్ప‌ష్టం చేశారు. ఆంక్ష‌ల‌ను అనుస‌రిస్తూ ప్ర‌జ‌లు త‌మ‌ను తాము కాపాడుకోవాల‌ని ఆయ‌న సూచించారు.