ఈసీకి స్ట్రాంగ్ డోస్‌ …అబ్బ‌బ్బ‌బ్బా!

కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఈ స్థాయిలో ఎప్పుడూ డోస్ ప‌డి ఉండ‌దు. క‌రోనా మ‌హ‌మ్మారికి ఇలాంటి డోస్ కావాల‌నే రీతిలో హైకోర్టు ఘాటు వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయంటే …వాటి తీవ్ర‌త‌ను అర్థం…

కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఈ స్థాయిలో ఎప్పుడూ డోస్ ప‌డి ఉండ‌దు. క‌రోనా మ‌హ‌మ్మారికి ఇలాంటి డోస్ కావాల‌నే రీతిలో హైకోర్టు ఘాటు వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయంటే …వాటి తీవ్ర‌త‌ను అర్థం చేసుకోవ‌చ్చు. మ‌ద్రాస్ హైకోర్టు స‌రైన స‌మ‌యంలో స‌రైన అక్షింత‌లే వేసింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

త‌మిళ‌నాడులో క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతి రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ప్ర‌జ‌ల ప్రాణాలు గాల్లో క‌లిసిపోతున్నాయి. మ‌రోవైపు వీకెండ్ లాక్‌డౌన్ మొద‌లైంది. త‌మిళ‌నాడుకు ఇత‌ర రాష్ట్రాల నుంచి వెళ్లాలంటే ఈ-పాస్‌లు త‌ప్ప‌ని స‌రి చేసింది.

ఈ నేప‌థ్యంలో త‌మిళ‌నాడులో ప్ర‌స్తుతం అసెంబ్లీ ఎన్నిక‌ల వ‌ల్లే క‌రోనా సెకండ్ వేవ్ విజృంభ‌ణ‌కు కార‌ణ‌మైంద‌ని మ‌ద్రాస్ హైకోర్టు భావించింది. అంతే కాదు, కేసు విచార‌ణ‌లో భాగంగా ఈసీపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డింది. క‌రోనా క‌ట్ట‌డి, ఎన్నిక‌ల‌కు సంబంధించి పిటిష‌న్‌పై మ‌ద్రాస్ హైకోర్టులో నేడు విచార‌ణ చేప‌ట్టింది. ఈ సంద‌ర్భంగా ఈసీపై హైకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

త‌మిళ‌నాడులో క‌రోనా సెకండ్ వేవ్‌కి ఈసీనే కార‌ణమ‌ని పేర్కొంది. ఈసీ అధికారుల‌పై మ‌ర్డ‌ర్ కేసులు పెట్టాల‌ని అత్యంత ఘాటు వ్యాఖ్య‌లు చేసింది. ఒక వైపు కోవిడ్ చాప‌కింద నీరులా విస్త‌రింస్తుంటే …రాజ‌కీయ పార్టీల ఎన్నిక‌ల‌ బ‌హిరంగ స‌భ‌లు, ర్యాలీల‌ను ఎందుకు నిలువ‌రించ‌లేకపోయార‌ని ఈసీ అధికారుల‌ను హైకోర్టు సూటిగా ప్ర‌శ్నించింది.  

బ‌హిరంగ స‌భ‌లు, ర్యాలీలు య‌థేచ్ఛ‌గా జ‌రుగుతుంటే ఈసీ అధికారులు వేరే గ్ర‌హంలో ఏమైనా ఉన్నారా? అని నిల‌దీయ‌డం గ‌మ‌నార్హం. మే 2న కౌంటింగ్‌కు కోవిడ్ రూల్స్ పాటించాల‌ని ఈసీని హైకోర్టు ఆదేశించింది. ఒక‌వేళ ఈసీ కోవిడ్ నిబంధ‌న‌ల‌ను అనుస‌రించి స‌రైన చ‌ర్య‌లు తీసుకోక‌పోతే ఎన్నిక‌ల ప్ర‌క్రియ ర‌ద్దు చేస్తామ‌ని తీవ్ర‌స్థాయిలో హెచ్చ‌రిక చేయ‌డం దేశ వ్యాప్త దృష్టిని ఆక‌ర్షించింది. 

స్వ‌తంత్ర ప్ర‌తిప‌త్తి గ‌ల‌ రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల సాకుతో కేంద్ర‌, రాష్ట్రస్థాయిల్లో ఎన్నిక‌ల సంఘాలు ప్ర‌జాభిప్రాయాల‌తో సంబంధం లేకుండా ప్ర‌వ‌ర్తిస్తున్నాయ‌నే విమ‌ర్శ‌లు బ‌లంగా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో మ‌ద్రాస్ హైకోర్టు ఘాటు వ్యాఖ్య‌ల‌పై ప్ర‌జ‌ల నుంచి సానుకూల స్పంద‌న వ‌స్తోంది.

ఇటీవ‌ల శివ‌సేన మ‌హిళా ఎంపీ  ప్రియాంక చ‌తుర్వేది కూడా ఈసీ తీరుపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. క‌రోనా మ‌హ‌మ్మారి ఉధృతిలో ఎన్నిక‌ల సంఘం పాత్ర‌నూ చ‌రిత్ర మ‌ర్చిపోద‌ని ఆమె అన్న మాట‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఆమె మాట‌ల‌కు తాజాగా మ‌ద్రాస్ హైకోర్టు ఘాటు వ్యాఖ్య‌లు బ‌లం చేకూరుస్తున్నాయి.