21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన కేంద్రం, సోషల్ డిస్టెన్స్ మెయింటెన్ చేయాలని పదే పదే చెబుతోంది. ఒకే చోట గుమిగూడొద్దని విజ్ఞప్తి చేస్తోంది.. అయితే ప్రజల్లో మాత్రం ఆ స్ఫూర్తి కొరవడుతోంది. ఉదయం పూట కూరగాయలకు, నిత్యావసరాలు తెచ్చుకునేందుకు మూడు గంటలు టైమ్ ఇవ్వడంతో జనం షాపుల పైకి ఎగబడుతున్నారు. వీటిని పర్యవేక్షించాల్సిన అధికారులు కూడా చోద్యం చూస్తున్నారు.
ఎమ్మార్వో స్థాయి అధికారులే మాస్క్ లు లేకుండా యథేచ్ఛగా కింది స్థాయి సిబ్బందిని వెంటబెట్టుకుని తనిఖీలకు వెళ్తుంటే.. సామాన్య జనాలకు వాళ్లు ఎలాంటి సందేశం ఇస్తున్నట్టు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సోషల్ డిస్టెన్స్ అనేది పూర్తిగా మరుగునపడిపోయింది. కలెక్టర్ స్థాయి అధికారులూ కూడా దీన్ని పాటించట్లేదు, మిగతావారిని పాటించాలని చెప్పడంలేదు. మరోవైపు జనాలకు ఎక్కడలేని మొహమాటం, దూరం దూరంగా ఉండాలంటే మిగతావాళ్లు ఏమనుకుంటారోనన్న ఇబ్బంది.
అందుకే అటు తెలంగాణ, ఇటు ఏపీలో కూడా జనం గుంపులు గుంపులుగా పోగవుతున్నారు. ఉదయాన్నే కూరగాయల కోసం మార్కెట్ కి వెళ్లిన వ్యక్తి.. అక్కడ అందరితో సన్నిహితంగా ఉండి వైరస్ అంటించుకుంటే.. ఇక లాక్ డౌన్ స్ఫూర్తి ఎక్కడిది. ఇంట్లో సేఫ్ గా ఉన్న కుటుంబ సభ్యులకు కూడా అతని వల్ల ప్రమాదమే. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇదే జరుగుతోంది. ఉదయాన్నే రోడ్లపైకి రావడం, జనసమ్మర్థంలో తిరిగి తర్వాత ఇంటికి వెళ్లడం.. దీని వల్ల లేనిపోని రుగ్మతలు సోకే అవకాశం కనిపిస్తోంది.
ఊరంతటికీ ఒకే టైమింగ్ ఇవ్వడం కంటే.. చిన్న చిన్న ప్రాంతాలుగా విభజించి నిత్యావసరాలను అందించడం వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది. అప్పుడే ప్రజలంతా ఇంటికే పరిమితం అవుతారు, ఒకవేళ బైటకు వచ్చినా తక్కువ సమూహానికే పరిమితం అవుతారు. అప్పుడే లాక్ డౌన్ అనే పదానికి అర్థం, పరమార్థం. అప్పటివరకు సోషల్ డిస్టెన్స్ అనేది పూర్తిగా అర్థరహితం.