తమ అధినేత చంద్రబాబునాయుడికి గల్లా కుటుంబం దూరమవుతోందా? అంటే “ఔను” అని చిత్తూరు జిల్లా ప్రజానీకం ముక్త కంఠంతో జవాబిస్తోంది. ఈ ప్రచారానికి బలం చేకూర్చే తాజా ఘటన గురించి జిల్లా వ్యాప్తంగా చర్చ సాగుతోంది.
చిత్తూరు జిల్లా రాజకీయాల్లో గల్లా అరుణకుమారి కుటుంబానిది బలమైన ముద్ర. తండ్రి రాజగోపాలనాయుడి వారసత్వంగా అరుణకుమారి రాజకీయాల్లో ప్రవేశించారు.చంద్రబాబు స్వగ్రామం ఉన్న చంద్రగిరి నియోజక వర్గం నుంచి ఆమె తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
కాంగ్రెస్ అగ్రనేతలు రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీతో ఆమెకు స్నేహసంబంధాలుండేవి. దివంగత వైఎస్సార్ కేబినెట్‌లో కీలక మంత్రిగా అరుణకుమారి పనిచేశారు. చంద్రబాబు అంటే ఒంటికాలిపై లేచేవారని అరుణకు పేరు.
వైఎస్సార్ ఆకస్మిక మరణం, అనంతరం రాష్ట్ర విభజనతో మారిన రాజకీయ పరిణామాల్లో గల్లా అరుణకుమారి కుటుంబం టీడీపీలో చేరింది. 2014లో చంద్రగిరి నుంచి అరుణకుమారి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.
ఆమె కుమారుడు గల్లా జయదేవ్ మాత్రం గుంటూరు పార్లమెంట్ నుంచి విజయం సాధించారు. ఓడిపోయిన తర్వాత గల్లా అరుణకుమారి రాజకీయాల్లో యాక్టీవ్‌గా లేరు. ప్రస్తుతం గుంటూరు ఎంపీగా కొనసాగుతున్న గల్లా జయదేవ్ కూడా టీడీపీలో క్రియాశీలకంగా పనిచేయడం లేదనే అభిప్రాయాలున్నాయి.
ఈ నేపథ్యంలో రేణిగుంట-కడప బైపాస్ మార్గంలో నిర్మించిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను నేడు (గురువారం) ప్రారంభించేందుకు గల్లా కుటుంబం నిర్ణయించింది. ఈ ఆస్పత్రిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు. కానీ చంద్రబాబును ఆహ్వానించకపోవడంపై చిత్తూరు జిల్లాలో రకరకాల చర్చకు దారి తీసింది.
గల్లా కుటుంబం బీజేపీకి దగ్గర కావడంతో పాటు చంద్రబాబును దూరం పెడుతోందనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు నిదర్శనం ఆస్పత్రి ప్రారంభానికి చంద్రబాబును ఆహ్వానించకపోవడమే అని గుర్తు చేస్తున్నారు. బాబుకు అత్యంత సన్నిహితులుగా పేరొందిన రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి, సీఎం రమేశ్‌నాయుడు బాటనే భవిష్యత్‌లో గల్లా కుటుంబం ఎంచుకునే అవకాశం లేకపోలేదని అంటున్నారు.
రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదు కదా! వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న గల్లా కుటుండానికి, దాన్ని కాపాడుకోవడమే మొట్టమొదటి ప్రాధాన్య అంశమని, అందుకోసం రాజకీయంగా ఎలాంటి అడుగైనా వేయ వచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.