గ్యాంబ్లింగ్‌కు పాల్పడిన ఘటనలో ఆంధ్రజ్యోతి దినపత్రిక కడప మేనేజర్ మద్దిపట్ల రఘునాథనాయుడితో పాటు మరో ఐదుగురిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. కడప నగరం చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పక్కీర్‌పల్లి తూర్పు వైపు సమాధుల పక్కన కంప చెట్లలో ఆరుగురు వ్యక్తులు పేకాట ఆడుతున్న సమాచారం పోలీసులకు అందింది.
అసాంఘిక కార్యకలాపాలపై జగన్ సర్కార్ ఉక్కుపాదం మోపిన నేపథ్యంలో చిన్నచౌక్ సీఐ కె.అశోక్‌రెడ్డి నేతృత్వంలో ఎస్ఐ సత్యనారాయణ, పోలీసు సిబ్బంది కలిసి వెళ్లి దాడి చేశారు. పేకాట ఆడుతూ ఆరుగురు పట్టుబడ్డారు. పోలీసులకు చిక్కిన వాళ్లలో ఆంధ్రజ్యోతి కడప మేనేజర్ రఘునాథనాయుడు కూడా ఉండడం మీడియా సర్కిల్స్‌లో కలకలం రేపింది. నిందితుల నుంచి రూ.14 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
కాగా గత కొంత కాలంగా ఆంధ్రజ్యోతిని అడ్డుపెట్టుకుని గ్యాంబ్లింగ్‌ను ఆ పత్రిక మేనేజర్ రఘునాథనాయుడు ప్రోత్సహిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన ఇతను ఉద్యోగ నిర్వహణలో భాగంగా సుదీర్ఘ కాలంగా కడపలో తిష్టవేసి , ఆంధ్రజ్యోతిని అడ్డుపెట్టుకుని ఇటు రాజకీయ నేతలు, అటు పోలీసు అధికారులతో సత్సంబంధాలు నెరుపుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు కడపలో జర్నలిస్టులు కోడై కూస్తున్నారు. ఎట్టకేలకు జగన్ పాలనలో అతను పోలీసులకు చిక్కి కటకటాలపాలు కావడం గమనార్హం.