గంగవరం పోర్టు అదాని గ్రూప్ పరం అయిపోయినట్లే. దాదాపుగా తొంబై శాతం వాటాలు ఆదానీ సొంతమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న పది శాతం వాటాను కూడా కొనుగోలు చేయడానికి ఆదాని రెడీ అయిపోయింది.
దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇందుకోసం కార్యదర్శులతో ఒక నిపుణుల కమిటీని ప్రభుత్వం నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. నేడో రేపో ఆ ప్రక్రియ కూడా జరిగిపోనుంది. ఇప్పటికే ఆదానీ సెజ్ లో గంగవరం పోర్టు విలీనం అయింది. దాన్ని అధికారికంగా గుర్తించారు కూడా.
నిజానికి గంగవరం పోర్టుని అభివృద్ధి చేసింది డీవీఎస్ రాజు కన్సార్టియం. వారికి ఈ పోర్టులో 58 శాతానికి పైగా వాటా ఉంది. అలాగే విండీ లేక్ సైడ్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్‌కు 31 శాతానికి పైగా వాటా ఉంది. అయితే అన్ని వాటాలూ ఆదానీ కొనుగోలు చేసి గంగవరానికి సోలోగా హక్కుదారు అయింది. ఇక మిగిలిన పది శాతం ప్రభుత్వ వాటా కూడా కొనుగోలు చేస్తే గంగవరం పోర్టు ఇక పూర్తిగా ఆదానీదే అవుతుంది.
విశాఖలో 1800 ఎకరాల విస్తీరణంలో ఏర్పడిన గంగవరం పోర్టు కెపాసిటీ ఏడాదికి 6.4 కోట్ల టన్నులుగా చెబుతున్నారు. ఒక విధంగా దేశంలోనే ప్రైవేట్ పోర్టుల కార్గోలో ఆదాని గ్రూప్ నంబర్ వన్ ప్లేస్ లో ఉందని చెప్పాలి.