గంటా శ్రీనివాసరావు రాజకీయ చాణక్యం అందరికీ తెలిసిందే. తన గెలుపు కొసం ఆయన చాలా వ్యూహాలే పన్నుతారు. సైలెంట్ గా చాపకింద నీరుగా ఆయన రాజకీయ కధ సాగిపోతుంది. ఎవరికీ అనుమానం రాకుండా కాగల కార్యం అలా చక్కబెట్టుకునే నైపుణ్యం గంటా సొంతం అంటారు.
విశాఖ జిల్లా టీడీపీ రాజకీయాల్లో ఇప్పటికీ తిరుగులేని నేతగా ఉన్న గంటా ఇపుడు జిల్లా రాజకీయాల కంటే తన సొంత నియోజకవర్గం మీదనే ద్రుష్టి పెట్టారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరంలో మొత్తానికి మొత్తం సీట్లు టీడీపీ ఖాతాలో వేయించాలని పక్కా ప్లాన్ తో ఉన్నారు.
దాంతో ఆయనలోని అపర చాణుక్యుడు బయటకు వచ్చాడు. అక్కడ కాస్తా బలంగా కనిపిస్తున్న బీజేపీ, జనసేన కూటమిని మచ్చిక చేసుకుని లోపాయికారి ఒప్పందంలో మొత్తం వార్డు కార్పోరేటర్లను గెలిపించుకోవాలన్నది గంటా ఎత్తుగడగా ఉంది.
ఈ కూటమికి కొన్ని సీట్లు వదిలేయడం, వారి మద్దతుతో మెజారిటీ వార్డులను గెలుచుకోవడం ఇదీ గంటా స్ట్రాటజీగా కనిపిస్తోంది. ఈ విధంగా ఉత్తరంలో మరో మారు వైసీపీని దెబ్బతీయాలను మాజీ మంత్రి అనుకుంటున్నారు.
మరి ఇది గంటా సొంత ఆలోచనా లేక అధినేత చంద్రబాబు కూడా ఏపీవ్యాప్తంగా ఇదే తీరుగా లోకల్ ఫైట్ లో లోపాయికారి ఎత్తుగడలు వేస్తున్నారో తెలియక తమ్ముళ్ళు, ఆశావహులు తికమక అవుతున్నారట.