కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా అనూహ్య మార్పులకు కారణమైంది. కంటికి కనిపించని సూక్ష్మజీవి సమాజాన్ని ఆర్థికంగా విచ్ఛిన్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా విపత్తు నుంచి తాము చాలా గుణపాఠం నేర్చుకుంటున్నామని వినమ్రంగా ప్రకటిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు లాక్‌డౌన్ మొదటి రోజుల్లోనే స్పందిస్తూ ప్రకృతి చేస్తున్న హెచ్చరికగా పేర్కొన్న విషయం తెలిసిందే.
మానవుడి ఆశ ప్రకృతి వినాశనానికి దారి తీస్తోందని, కావున మనతో పాటు ప్రతి ప్రాణి జీవించేలా మనిషి తన ప్రవర్తన మార్చు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అనేక మంది శాస్త్రవేత్తలు, పర్యావరణ వేత్తలు, వైద్యులు, తదితర రంగాల ప్రముఖులు ఎంతో గొప్పగా గత నాలుగు నెలలుగా సందేశాలను ఇస్తున్నారు. కొందరు తమలో మార్పు కోసం ప్రయత్నిస్తుండగా, మరికొందరు మార్పు రావాలని ఆకాంక్షిస్తున్నారు. మొత్తానికి మనిషి ఇప్పుడున్నట్టుగా కాకుండా, మరింత మెరుగైన ఆలోచనలు, నిస్వార్థంతో కూడిన జీవనాన్ని సాగించాలని మెజార్టీ ప్రజల అభిప్రాయం.
కానీ సమాజంలో మారని మనిషి, నాయకుడు ఎవరైనా ఉన్నారా? అంటే ఆయన ఒక్క చంద్రబాబు మాత్రమే. ఆయనకు అధికారం, రాజకీయం తప్ప ప్రజలు, సమాజం ఏ మాత్రం పట్టవు. ఎంతసేపూ ప్రత్యర్థులపై ఎలా బురద చల్లాలా అనే కుట్ర పూరిత ఆలోచన తప్ప, సమాజానికి, రాజకీయానికి కాస్త పనికొచ్చే మాట చెబుతామని ఒక్క క్షణం కూడా ఆలోచించడం లేదు.
తాజాగా ఆయన చేసిన ట్వీట్ చూద్దాం.
‘కోవిడ్-19 అనుమానిత లక్షణాలు ఉన్న వారిని ఆంబులెన్స్‌లో గొర్రెల మందలుగా ఎక్కించడం దారుణం. ఇలా చేయడం వల్ల వైరస్ లేని వారికి కూడా కరోనా సోకే ప్రమాదం ఉంది. ఇది 108 పబ్లిసిటీ కోసం చేస్తున్నారా?, లేక మరిన్ని కేసులు ఏపీలో పెంచేందుకు చేస్తున్నారా?, ఇక ఏపీని ఆ దేవుడే రక్షించాలి’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన ఓ వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. ఇటీవల జగన్ సర్కార్ కొత్తగా ప్రవేశ పెట్టిన 108 వాహనాలలో పెద్ద సంఖ్యలో కోవిడ్ అనుమానిత లక్షణాలున్న వారిని తీసుకెళ్లే వీడియోను తన ఆరోపణలకు బలం కలిగించేందుకు చూపే ప్రయత్నం చేశారు. కనీసం తన పాలనలో ఒక్క 108 వాహనాన్ని కూడా ప్రవేశ పెట్టని చంద్రబాబు….ఇప్పుడు మాత్రం విమర్శలకు ముందున్నారు.
ఐదేళ్ల తన పాలనలో కనీసం ఒక్కరికైనా మంచి చేయాలని చంద్రబాబు ప్రయత్నించారా? ఇప్పుడు ప్రజలకు మంచి చేయాలని జగన్ తాపత్రయ పడుతుంటే, అందులో రంధ్రాన్వేషణ చేయడంలో బాబు నిమగ్నమయ్యారు. అందుకే కరోనా కాలంలో మారని మనిషి ఎవరైనా ఉన్నారా అంటే …ఒక్క చంద్రబాబు మాత్రమే. ఆయన్ను ఇక ఆ దేవుడే మార్చాలి.