బంగారం రేటు ఎలా ఆకాశాన్నంటిందో అందరం చూస్తూనే ఉన్నాం. రోజుకో రికార్డ్ ధరతో బంగారం సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకుంటోంది. మరి ఇలాంటి టైమ్ లో సగం రేటుకే బంగారం దొరికితే ఎలా ఉంటుంది? ఎవరికైనా ఆశ కలగడం సహజం. ఇదే ఆశను తమ మోసానికి పునాదిగా చేసుకున్నారు కొందరు వ్యక్తులు.
ఒకప్పుడు బంగారం మెరుగు పెడతాం అంటూ వచ్చేశారు. ఆ తరహా మోసాలు ఇప్పుడు పాతవైపోయాయి. అందరూ జాగ్రత్తపడడం స్టార్ట్ చేశారు. అందుకే మోసగాళ్లు ఇప్పుడు కొత్తమార్గం ఎంచుకున్నారు.
పొలం దున్నుతుండగా లంకె బిందెలు దొరికాయని, అందులో కిలోల కొద్దీ బంగారు నాణేలు ఉన్నాయని నమ్మబలుకుతున్నారు. బయటకు తెలిస్తే ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి సగం రేటుకు ఇస్తామంటూ ఊరిస్తున్నారు.
ఇక్కడే ఈ ముఠా తమ తెలివితేటల్ని అమోఘంగా ప్రదర్శిస్తోంది. ముందుగా చెక్ చేసుకోమంటూ అసలు బంగారాన్నే ఇస్తున్నారు. చెకింగ్ లో అది మంచి బంగారమని తేలుతుంది. అప్పుడు డీల్ కోసం బెంగళూరు రమ్మంటున్నారు. డబ్బులు తీసుకొని నకిలీ బంగారాన్ని, బంగారు నాణేల్ని అంటగడుతున్నారు.
ఇలా అదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పదుల సంఖ్యలో కొంతమంది మోసపోయినట్టు తెలుస్తోంది. మంచిర్యాలకు చెందిన ఓ బంగారు వ్యాపారి ఇలానే 15 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. పోలీసులకు ఫిర్యాదుచేస్తే సమాజంలో పరువు పోతుందని, మీడియా ముందు వాపోయాడు.