జనసేనాని పవన్‌కల్యాణ్ పాలిటిక్స్ సంథింగ్ స్పెషల్ అని చెప్పక తప్పదు. ఎందుకంటే పార్టీ పెట్టిన తర్వాత మొదటి సారిగా ఆయన కార్యక్రమాల నిర్వహణ విభాగం కమిటీని ఏర్పాటు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
తాజాగా పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగం కమిటీ ఏర్పాటు చేయడం ద్వారా… ఇంత వరకూ చెప్పుకో తగ్గ కార్యక్రమాలేవీ చేయలేదనే సంకేతాన్ని జనసేనానే పంపినట్టైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జనసేనాని ప్రత్యేకత ఏమంటే… సంస్థాగతంగా ఆ పార్టీకి ఎలాంటి కమిటీలు లేకపోవడం. సాధారణంగా ఎవరైనా పార్టీ స్థాపించిన తర్వాత గ్రామ స్థాయి మొదలుకుని మండల, తాలూకా, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలను వేసి బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు.
అదేంగానీ పవన్‌కల్యాణ్ పార్టీ బలోపేతానికి తన పవర్స్ వికేంద్రీకరణకు ససేమిరా అనడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీనంతటికి ప్రధాన కారణం… తానిచ్చే పార్టీ అధికారాలతో దుర్వినియోగం చేస్తారనే అనుమానమే జనసేనకు శాపంగా మారిందనే విమర్శలు లేకపోలేదు.
ఈ నేపథ్యంలో జనసేన పార్టీ నిర్వహించే కార్యక్రమాల కోసం 14మందితో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయడం ఒకింత ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలనే ఆశ్చర్యానికి గురి చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్ర కమిటీకి కళ్యాణం శివ శ్రీనివాస్ కో ఆర్డినేటర్ గా, రాష్ట్ర కమిటీలో ఇద్దరు జాయింట్ కో ఆర్డినేటర్లు, అలాగే నలుగురు ప్రధాన కార్యదర్శులు, 8 మంది కార్యదర్శులను ప్రకటించడం విశేషం. ఇందులోని నేతలంతా కొత్తవారే కావడం గమనార్హం.
ఏది ఏమైనా ఇప్పటికైనా కమిటీల ఏర్పాటు ప్రారంభమైన పరిస్థితుల్లో ….జనసేనకు మంచి రోజులొచ్చాయని ఆ పార్టీ శ్రేణులు వ్యంగ్యంగా అంటున్నాయి.