ముఖ్యమంత్రి బెయిల్ పిటిషన్‌పై గత కొన్ని రోజులుగా సీబీఐ వ్యవహార శైలి తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఒక్కోసారి ఒక్కో మాట చెబుతూ కాలయాపన చేయడంపై పలు అనుమానాలొస్తున్నాయి.
కానీ తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సంబంధించి మాత్రం సీబీఐ తన వైఖరిని కుండబద్దలు కొట్టింది. కేసు నుంచి తనను తొలగించాలని కోరుతూ ఆమె డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేయడంపై సీబీఐ వైఖరి ఏంటో తెలుసుకుందాం.
ప్రస్తుత దశలో కేసు నుంచి తొలగించవద్దని, ఆమె ప్రమేయంపై ఆధారాలున్నాయని సీబీఐ కౌంటరు దాఖలు చేయడం ఆసక్తి పరిణామంగా చెప్పొచ్చు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమాల కేసులో సబితపై సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
అభియోగాల నమోదు, డిశ్ఛార్జి పిటిషన్‌పై వాదనలు వినిపించేందుకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమయం కోరారు. కేసు నుంచి తనను తొలగించాలని కోరుతూ సబితా ఇంద్రారెడ్డి డిశ్ఛార్జి పిటిషన్ దాఖలు చేశారు.
డిశ్ఛార్జి పిటిషన్‌తోపాటు కేసులో అభియోగాల నమోదుపై వాదనలు వినిపించేందుకు సబిత సమయం కోరారు. దీంతో విచారణను సీబీఐ కోర్టు ఆగస్టు 2కి వాయిదా వేసింది. గతంలో కాంగ్రెస్ పాలనలో గనులశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి అవకతవకలకు పాల్పడ్డారని సీబీఐ కేసు నమోదు చేసింది.
సీబీఐ కేసు ఆమెని నీడలా వెంటాడుతూనే ఉంది. దాని నుంచి బయటపడాలనే ఆమె ప్రయత్నాలకు ప్రస్తుతం సీబీఐ గండికొట్టేందుకు ప్రయత్నిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.