హత్యలను ఏ రాజకీయ పార్టీ కూడా ప్రోత్సహించకూడదు. పైగా హత్యలు చేసుకుంటూ మనశ్శాంతిని, జీవితాన్ని కోల్పోడానికి ఏ ఒక్కరూ సిద్ధం లేరు. గతంతో పోల్చితే హత్యలు చాలా వరకూ తగ్గాయి. దీనికి ప్రజల్లో వచ్చిన చైతన్యం, విద్య, ఉపాధి తదితర అవకాశాలు మెరుగుపడడమే. ఈ నేపథ్యంలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చోటు చేసుకున్న హత్యలపై టీడీపీ చేసిన యాగీ అంతాఇంతా కాదు.
ఆధిపత్య పోరు, ఇంటి, పొలం తగాదాలో, మరేతర వ్యక్తిగత కారణాలతో హత్యలకు పాల్పడితే దాన్ని జగన్ ప్రభుత్వానికి ముడిపెడుతూ టీడీపీ నేతలు పెద్ద సీన్‌ను క్రియేట్ చేయడం తెలిసిందే. ఇది కేవలం పొలిటికల్ స్టంట్ అనే విమర్శలు ఆయా సందర్భాల్లో వెల్లువెత్తాయి. టీడీపీ మద్దతుదారులు హత్యలకు గురైన సందర్భాల్లో నారా లోకేశ్ వెంటనే అక్కడికి వెళ్లడం, జగన్ ప్రభుత్వాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడ్డం చూశాం.
తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత నియోజక వర్గంలో, అది కూడా వైసీపీ మద్దతుదారైన సర్పంచ్ చిన్న మునెప్ప (50) మంగళవారం హత్యకు గురయ్యాడు. ఈ హత్యను టీడీపీ యువకిశోరం లోకేశ్ ఏ ఖాతాలో వేస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది.
హత్యకు దారి తీసిన పరిస్థితులను తెలుసుకుందాం. కడప జిల్లా పులివెందుల నియోజక వర్గం లింగాల మండలం కోమనూతల చెందిన మాజీ ఎంపీటీసీ లక్ష్మినారాయణరెడ్డి వైసీపీ నాయకుడు. లక్ష్మినారాయణరెడ్డి అనుచరుడే చిన్న మునెప్ప. కొన్ని నెలల క్రితం జరిగిన పంచాయతీ సర్పంచ్ పదవి కోసం లక్ష్మినారాయణరెడ్డి, వైసీపీ ముఖ్యనాయకుడు దంతులూరి కృష్ణ తమతమ అనుచరులకు ఇప్పించుకోవాలని పోటీ పడ్డారు.
ఈ నేపథ్యంలో రాజీ ఫార్ములా తెరపైకి వచ్చింది. అయితే ముందు రెండున్న రేళ్లు తమకంటే… కాదు తమకే కావాలని నేతలు పోటీ పడ్డారు. చివరికి రాజీ కుదరకపోవడంతో పోటీ అనివార్యమైంది. ఈ పోటీలో లక్ష్మినారాయణరెడ్డి అనుచరుడు చిన్న మునెప్ప 150 ఓట్ల మెజార్టీతో దంతులూరి కృష్ణ అనుచరుడిపై గెలుపొందాడు. దీంతో పరస్పరం కక్షలు పెంచుకున్నారు. అప్పటి నుంచి గ్రామంలో ఒకే పార్టీలోని ఇరు వర్గాల మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగున్నాయి.
ఈ నేపథ్యంలో సర్పంచ్ల శిక్షణా తరగతులకు హాజరయ్యేందుకు మునెప్ప మంగళవారం పులివెందులకు వెళ్లాడు. శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం ద్విచక్ర వాహనంలో ఓబులరెడ్డి అనే వ్యక్తితో కలిసి ఇంటికి తిరిగి వెళుతుండగా గ్రామశివారులో ప్రత్యర్థులు కాపు కాచి వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. హత్యకు పాల్పడిన వారు కూడా వైసీపీ కార్యకర్తలే కావడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆధిపత్య పోరు, పాతకక్షలతోనే హత్య జరిగినట్టు పోలీసులు భావిస్తు న్నారు.
కొన్నాళ్ల క్రితం కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయిలో అన్నదమ్ములైన తెలుగుదేశం నేతలు నాగేశ్వర్ రెడ్డి, ప్రతాప్‌రెడ్డి హత్యకు గురి కావడం రాజకీయ దుమారం రేపింది. ఈ హత్యలు కూడా ఆధిపత్య పోరులో భాగంగానే జరిగాయనేది బహిరంగ రహస్యం. కానీ తమ వాళ్లు హత్యకు గురైతే మాత్రం రాజకీయ కోణంలో విమర్శలు చేయడం, ఇదే ప్రత్యర్థులైతే సైలెంట్ కావడం వల్లే టీడీపీ నేతలపై విమర్శలొస్తున్నాయి.
హత్యల సంస్కృతిని తరిమి కొట్టేందుకు ఏ పార్టీ ముందుకొచ్చినా ప్రజలు హర్షిస్తారు. కానీ ప్రత్యర్థి పార్టీ నేతల చావులకు వక్రభాష్యం చెప్పడం వల్లే టీడీపీ నేతల విమర్శలకు విలువ లేకుండా పోయింది. మరి పులివెందులలో వైసీపీ సర్పంచ్ హత్యను టీడీపీ ఏ విధంగా చూస్తున్నదో చెప్పాల్సిన అవసరం ఉంది.