జ‌గ‌న్‌కు తెలిస్తే…యాక్ష‌న్ అంతే మ‌రి!

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు పాల‌న‌లో భాగంగా త‌ప్పుల గురించి తెలియ‌నంత వ‌ర‌కూ ఎవ‌రికీ ఇబ్బంది ఉండ‌దు. ప్ర‌జా స‌మస్య‌ల ప‌రిష్కారంలో అధికారుల నిర్ల‌క్ష్యం వ‌ల్ల ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు వ‌స్తోంద‌ని ముఖ్య‌మంత్రి గ్ర‌హిస్తే మాత్రం,…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు పాల‌న‌లో భాగంగా త‌ప్పుల గురించి తెలియ‌నంత వ‌ర‌కూ ఎవ‌రికీ ఇబ్బంది ఉండ‌దు. ప్ర‌జా స‌మస్య‌ల ప‌రిష్కారంలో అధికారుల నిర్ల‌క్ష్యం వ‌ల్ల ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు వ‌స్తోంద‌ని ముఖ్య‌మంత్రి గ్ర‌హిస్తే మాత్రం, ఆయ‌న ఆగ్ర‌హానికి గురి కాక త‌ప్ప‌దు. తాజాగా కొంద‌రు అధికారుల నిర్ల‌క్ష్యంపై సీఎం జ‌గ‌న్ సీరియ‌స్ అయ్యారు. దాని ప‌ర్య‌వ‌సానం…ఫెర్మామెన్స్ బాగా లేని వారికి మెమో జారీ చేయాల‌నే ఆదేశాలు.

ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం నిమిత్తం జ‌గ‌న్ ప్ర‌భుత్వం స్పంద‌న కార్య‌క్ర‌మాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టింది. దీనిపై సీఎం ఎప్ప‌టి క‌ప్పుడు స‌మీక్షిస్తూ లోటుపాట్ల‌ను స‌వ‌రించుకోవాల‌ని అధికారుల‌ను ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అప్ర‌మ‌త్తం చేస్తూ వుంటారు. 

ఈ నేప‌థ్యంలో స్పంద‌న కార్య‌క్ర‌మంపై జిల్లా క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌తో మంగ‌ళ‌వారం ఆయ‌న వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న కొంత మంది అధికారుల తీరుపై ముఖ్య‌మంత్రి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అలాంటి వారిని హెచ్చ‌రిస్తూ మెమో జారీ చేయాల‌ని సీఎం ఆదేశించ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

వారానికి నాలుగు సార్లు గ్రామ, వార్డు సచివాలయాలు సందర్శించాలని చెప్పామ‌ని, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకుంటే సమస్యలెలా తెలుస్తాయని సీఎం ప్రశ్నించారు. కిందిస్థాయి అధికారులు గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో ప‌ర్య‌టిస్తేనే త‌ప్పుల‌ను స‌రిదిద్దుకునే అవకాశం ఉంటుంద‌న్నారు. క‌లెక్ట‌ర్లు, జేసీల స్థాయిలో ప‌ర్య‌వేక్ష‌ణ‌పై జ‌గ‌న్ సంతృప్తి వ్య‌క్తం చేశారు. మిగిలిన అధికారులు స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేయాల‌ని ఆయ‌న సూచించారు. పేద‌ల గురించి మాన‌వత్వం చూపాల‌ని సీఎం జ‌గ‌న్ కోరారు.

ముఖ్యంగా  బియ్యం కార్డు, పెన్షన్ కార్డు, ఇళ్ల పట్టాలు, ఆరోగ్యశ్రీ పథకాలు అత్యంత ముఖ్యమైనవని సీఎం అన్నారు. నిర్దేశించిన‌ గడువులోపు అర్హులకు అందేలా చూడాల‌ని సీఎం ఆదేశించారు. వీటిని స్వయంగా  పర్యవేక్షించాల‌న్నారు. ఏమైనా లోపాలు ఉంటే త‌మ‌ దృష్టికి తీసుకురావాల‌న్నారు.  

గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తో స‌మ‌స్య‌ల‌ను క్షేత్ర‌స్థాయిలో ప‌రిష్క‌రించ వ‌చ్చ‌ని సీఎం ఉద్దేశం. కానీ అధికారుల ప‌ర్య‌వేక్ష‌ణ లోపించ‌డం వ‌ల్ల నెల‌లు, సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి పేద‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్కా రానికి నోచుకోలేదు. ఈ వాస్త‌వాన్ని సీఎం ఇప్ప‌టికి గ్ర‌హించిన‌ట్టున్నారు.

నిజంగా అర్హులైన  పింఛ‌న్ రాని వారెంద‌రో ఉన్నారు. అలాంటి వాళ్లు స‌చివాల‌యం చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేసినా ప్ర‌యోజ‌నం లేకుండా పోతోంది. అలాంటి పేద‌ల దృష్టిలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌జావ్య‌తిరేక ప్ర‌భుత్వంగా ముద్ర ప‌డుతోంది. ఇలాంటి వాటిని స‌రిదిద్దుకోడానికి జ‌గ‌న్ దిశానిర్దేశం చేయ‌డం మంచి ప‌రిణామం.