గతేడాది సంక్రాంతికి మహేష్, అల్లు అర్జున్ మధ్య పోటీ గట్టిగా నడిచింది. వాళ్లిద్దరి సినిమాల్లో ఏది ఇండస్ట్రీ హిట్ అనే అంశంపై ఇప్పటికీ ఫ్యాన్స్ గొడవ పడుతూనే ఉన్నారు. ఇదిలా ఉండగా.. వచ్చే ఏడాది సంక్రాంతికి పోటీ ఆల్రెడీ ఫిక్స్ అయింది. 2022లో మహేష్ బాబు, పవన్ కల్యాణ్ పోటీ పడబోతున్నారు.
పవన్ కల్యాణ్, రానా హీరోలుగా నటిస్తున్న సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా నుంచి పవన్ లుక్ ను కొద్దిసేపటి కిందట విడుదల చేశారు. సినిమాలో పోలీసాఫీసర్ భీమ్లా నాయక్ గా పవన్ కనిపించబోతున్నాడు. .
ఇక ఇదే వీడియోలో రానా లుక్ ను కూడా కొద్దిగా ఎలివేట్ చేశారు. అయితే అతడి క్యారెక్టర్ పేరు ఏంటి? షేడ్స్ ఎలా ఉంటాయనే విషయాన్ని ఇంకా బయటపెట్టలేదు.
మలయాళంలో హిట్టయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్ గా వస్తోంది పవన్-రానా మూవీ. సాగర్ చంద్ర డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాకు స్క్రీన్ ప్లే-డైలాగ్స్ త్రివిక్రమ్ అందిస్తున్నాడు.
ఇక మహేష్ బాబు సినిమా రిలీజ్ డేట్ ను చాన్నాళ్ల కిందటే ప్రకటించారు. సర్కారువారి పాట ఫస్ట్ లుక్ అయితే రాలేదు కానీ, రిలీజ్ డేట్ మాత్రం పక్కా అయింది. ప్రస్తుతం నడుస్తున్న షూటింగ్ అప్ డేట్స్ బట్టి చూస్తే, సంక్రాంతికి ఈ సినిమా రావడం పక్కా. పరశురామ్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఇలా వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పట్నుంచే 2 పెద్ద సినిమాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. బరిలో పవన్-మహేష్ నిలిచారు కాబట్టి, మరో పెద్ద సినిమా సంక్రాంతికొచ్చే సాహసం చేయకపోవచ్చు. అన్నట్టు ఈ 2 సినిమాలకూ తమనే సంగీత దర్శకుడు.