cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Gossip

కాగల కార్యం 'కరోనా' తీర్చింది

కాగల కార్యం 'కరోనా' తీర్చింది

జీవితానికి రివైడ్ బటన్, ఫాస్ట్ ఫార్వార్డ్ బటన్ రెండూ వుండవు. ప్లే అవుతుంటే, మన వంతు ఆట మనం ఆడాల్సిందే. నచ్చినా నచ్చకున్నా.

రాజకీయాల్లో కూడా అంతే. అనుకోకుండా కొన్ని జరుగుతుంటాయి. మరి కోన్ని రియాక్షన్స్ కూడా వుంటాయి. ఈ రియాక్షన్లలో పాజిటివ్ కొన్ని వుంటే, రివర్స్ కొట్టేవి మరికొన్ని. అలాంటి టైమ్ లో ఈ నెగిటివ్ రియాక్షన్ ను ఎలా తప్పించుకోవాలా? అని చూస్తుంటారు రాజకీయనాయకులు. అప్పుడే వీళ్లకు ఫాస్ట్ ఫార్వార్డ్ బటన్ వుంటే బాగుండేది కదా? అని అనిపిస్తుంది.

సిటిజన్ షిప్ ఎమెండ్ మెంట్ యాక్ట్ ను అనౌన్స్ చేసిన తరువాత దేశ వ్యాప్తంగా సంభవించిన పరిణామాలు ప్రధాని మోడీ, హోమంత్రి అమిత్ షా లను కాస్త గట్టిగానే కలవరపెట్టాయి. అదే సమయంలో ఢిల్లీ ఎన్నికల ఫలితాలు మరింతగా కలవరపెట్టాయి. దేశంలోని అనేక రాష్ట్రాలు భాజపా ను వీడడమో లేదా భాజపా ను నిరాశ పర్చడమో చేస్తున్నాయి. పరిస్థితి అంతా ఉక్కిరిబిక్కిరిగా వుంది. అమిత్ షా, మోడీ ల నోట మాట పెగలని పరిస్థితి.

చాలా రాష్ట్రాలు సిటిజిన్ షిప్ అమెండ్ మెంట్ ను అమలు చేయబోమంటూ తీర్మానాలు. ప్రతి చోటా ప్రదర్శనలు. సోషల్ మీడియాలో ఇటు అటు కూడా అనుకూలంగా రకరకాల పోస్ట్ లు. ఇలాంటి పరిస్థితి. కొద్ది నెలల ముందుగా తెలుగుదేశం లాంటి పార్టీలు మళ్లీ భాజపా పంచన చేరుదాం అనుకున్నాయి. చిన్నగా ప్రయత్నాలుచేద్దాం అనుకున్నాయి. కానీ సిఎఎ కారణంగా మళ్లీ మౌనంగా మిగిలిపోయాయి.

ఇలాంటి సమయంలో కరోనా వచ్చింది. గట్టి వర్షం పడితే రోడ్లు శుభ్రం అయిపోతాయన్నట్లుగా తయారైంది పరిస్థితి. జనం సిఎఎ సంగతి మరిచిపోయారు. కేవలం మరిచిపోవడం కాదు. మరో సంఘటన జరిగింది. ఢిల్లీలో జరిగిన ఓ మత సమ్మేళనం లో పాల్గొన్నవారి కారణంగా దేశ వ్యాప్తంగా కరోనా మరింతగా అలుముకుంది అన్న విషయం పైకి వచ్చింది. దాంట్లో మరింత క్లారిటీ వచ్చింది.

క్లారిటీ రావడమే కాదు, దేశ వ్యాప్తంగా సీన్ ఒక్కసారిగా మొత్తం మారిపోయింది. ఓ మతం వారి కారణంగా కరోనా ఇండియా అంతా పాకేసింది అన్న పాయింట్ కింద వరకు వెళ్లిపోయింది. కరోనా చైనాలో పుట్టినా, ఇండియాను ఏమీ చేయలేకపోయింది. కానీ ఈ ఢిల్లీలో జరిగిన మత సమ్మేళనం వల్ల ఇండియా కొంప మునిగిపోయింది అనే ప్రచారం విపరీతంగా జరిగిపోయింది. ఒక దశలో ఓ మతం వారిని దూరం నుంచి చూస్తూనే, కరోనా వస్తుందేమో అన్న భయంతో పక్కకు జరిగే పరిస్థితి నెలకొంది.

మరోపక్క జనతా కర్ఫ్యూ అంటూ, లాక్ డౌన్ అంటూ మోడీ తీసుకున్న చర్యలు కాస్త ఫలితాలు ఇవ్వడం, కరోనా సందర్భంగా మోడీ తరచు టీవీల్లో కనిపించి ప్రసంగాలు చేయడం, ఇవన్నీ కలిసి ఆయన ఇమేజ్ ను అమాంతం పెంచేసాయి. ఇప్పుడు మరింత ముందుకు వెళ్లి, అయిదో తేదీన తొమ్మిది దీపాలు పెట్టండి అనే హిందూ సెంటిమెంట్ ను మరింత రాజేసారు మోడీ.

ఇలా మొత్తం మీద పోయింది లేదా పోతోంది అనుకున్న పర్సనల్ చరిష్మాను మళ్లీ గెయిన్ చేయడమే కాదు, సిఎఎ గురించి మరి ఇంక ఎవ్వరూ మాట్లాడలేని పరిస్థితిని తీసుకువచ్చారు మోడీ. దీని ద్వారా మరోసారి మోడీ ప్రధాని కావడానికి ఇప్పటి నుంచే మార్గం సుగమం అయిపోయింది. ఆ విధంగా మోడీకి కరోనా చేసిన మేలు ఇంతా అంతా కాదు.

కేసులతో ఉక్కిరి బిక్కిరి

ఇక ఆంధ్ర ప్రదేశ్ సంగతి చూద్దాం. నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వం వంతు, అవి అమలు జరుగుతాయో లేదో తెలియాలంటే కోర్టులు చెప్పేదాకా ఆగాలి అన్నట్లు వుంది అక్కడ పరిస్థితి. అక్కడ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటే చాలు అలా కోర్టుల్లో కేసులు పడుతున్నాయి. అక్కడ చాలా వరకు ప్రభుత్వానికి ఎదురు దెబ్బలే తగులుతున్నాయి.

ఇలాంటి టైమ్ లో  స్థానిక ఎన్నికలు జరపాలనుకున్నారు ముఖ్యమంత్రి జగన్. వద్దని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అడ్డంకి. బరస్ట్ అయిపోయారు సిఎమ్ జగన్. అదే పెద్ద తప్పు. ఆయన కూడా సహచరుల చేత మాట్లాడిస్తే, దిద్దుకోవడానికి అవకాశం వుండేది. కానీ అలా జరగలేదు. పైగా ఈ విషయంలో సుప్రీం కోర్టు మెట్లు ఎక్కారు. అది మరీ తప్పిదంగా మారింది. ముఖ్యమంత్రిగా జగన్ ఉక్కిరిబిక్కిరి అయిపోతున్న వేళ కరోనా వచ్చింది.

మళ్లీ ఇక్కడా మొత్తం సినేరియా మారిపోయింది. వాలంటీర్ల వ్యవస్థ అద్భుతంగా పనికి వచ్చింది. నిన్న మొన్నటి దాకా ఈ వ్యవస్థ మీదే జోకులు పేలాయి. టిక్ టాక్ లు నడిచాయి. కానీ ఇప్పుడు ఈ వ్యవస్థ సమర్థవంతగా పనిచేసి, సమాచార సేకరణ బాగా చేసిందన్న టాక్ వచ్చింది. అలాగే ఆంధ్రలోని అధికారులు కూడా బాగా పనిచేసారు. ముఖ్యంగా ఐఎఎస్, ఐపిఎస్ అధికారులకు కరోనా తీవ్రత బాగా తెలిసివచ్చింది. దాంతో వాళ్లు కావాల్సినంత జాగ్రత్తలు తీసుకున్నారు. కఠినంగా పనిచేసారు. దాంతో ఆంధ్ర ప్రదేశ్ లో పరిస్థితి అదుపులోనే వుంది.

అదుపులోనే వుంది అనడానికి ఒకటే ఉదాహరణ. అలా అదుపులో లేకపోయి వుంటే, ప్రభుత్వం సమర్థవంతంగా పని చేయకుండా వుండి వుంటే ప్రతిపక్షం కావచ్చు, దాని అను'కుల' మీడియా కావచ్చు రెచ్చిపోయి మరీ చీల్చి చెండాడేసి వుండేవి. అలా జరగకపోవడం వల్లనే చంద్రబాబు లాంటి వాళ్లు, యనమల రామకృష్ణుడు లాంటి వాళ్లు రంధ్రన్వేషణకు దిగారు. దిగజారి మరీ విమర్శలు చేస్తున్నారు అనే అపప్రథ మూట కట్టుకుంటున్నారు.

మొత్తం మీద కరోనా ఆంధ్రలో కూడా జగన్ ను ఇంతో అంతో విపత్కర పరిస్థితి నుంచి ఆదుకుందనే చెప్పాలి.

సినిమా పవనాలు

జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ వుండనే వున్నారు. నాలుగేళ్ల వరకు ఎన్నికలు లేవు. ఆయన కు అంత ఓపికలేదు. కమిటీలు వేయడం, కార్యవర్గాలు నియమించడం, సమావేశాలు నిర్వహించడం ఇలాంటివి అన్నీ చేయలేరు. పార్టీ పట్టి ఏళ్లు గడుస్తున్నా ఆయన ఆ దిశగా ఆలోచించ లేదు. ఇక ఇఫ్పుడేం చేస్తారు? అందుకే గతంలో పదే పదే వేసిన ఒట్టు తీసి గట్టున పెట్టి సినిమాలు పచ్చ జెండా ఊపేసారు. ఎవరో ఏదో అంటారని ఆయన ఊహించేసుకుని, ఎదురుదాడి మొదలెట్టేసారు. తాను సినిమాలు చేయకూడదా? తనకు వేరే ఆదాయం ఏమి వుంది అంటూ ఆయనే నీడతో యుద్దం చేయడం మొదలుపెట్టేసారు.

ఏమైనా జనం మాత్రం ఆయన గతంలో అన్న మాటలు, ఇప్పుడు చెబుతున్న మాటలు బేరీజు వేసుకుని, పవన్ అనే వ్యక్తి పార్ట్ టైమ్ పొలిటీషియన్ అని ఫిక్స్ అయిపోయారు. ఇలాంటి టైమ్ లో కరోనా వచ్చింది. ఇక ఇప్పుడు సమస్యే లేదు. జనం దృష్టి అటు మళ్లి పోయింది. ఇప్పుడు ఎవరికీ కూడా పవన్ ఏం చేస్తున్నారు. కనీసం జిల్లా కార్యవర్గాలు అయినా ఏర్పాటుచేస్తారా? చేయరా? లేక ఈ అయిదేళ్లు ఇలాగే సినిమాతో గడిపేస్తారా? అని లెక్కలు కట్టి, ఆరాలు తీసే ఓపిక లేదు.

అమరావతి కథ కంచికి

దాదాపు మూడు నెలలుగా ఆ రెండు పత్రికల్లో ఒకటే రొద. ఇక కొంతమంది సామాజిక వర్గ నాయకులతే పార్టీలకు అతీతంగా అదే గొడవ. అమరావతి..అమరావతి..అమరావతి. రోజూ మొదటి పేజీలో కచ్చితంగా అమరావతి ఉద్యమ వార్త వుండాల్సిందే. అమరావతి ఉద్యమ ఛాయా చిత్రం వుండాల్సిందే. విజవయంతమైన ముఫై ఆరో రోజు, ముఫై ఏడో రోజు, ముఫై ఎనిమిదో రోజు అన్నట్లుగా వార్తలు, కథనాలు.

ఇలాంటి టైమ్ లో కరోనా వచ్చింది. ఎక్కడి టెంట్లు అక్కడ లేచిపోయాయి. వార్తలు వీగిపోయాయి. రాయాలనుకున్నా, లోపలిపేజీల్లో ఏదో విధంగా గుర్తు చేయడం తప్ప, మొదటి పేజీని అంకితం చేయలేకపోయాయి.  పత్రికల దన్నుతో చేసే ఏ ఉద్యమాలు అయినా, ఆ దన్ను లేకపోతే ఇట్టే వీగిపోతాయి. అమరావతి ఉద్యమం కూడా అలాగే జరిగింది. పైగా జనాలు కూడా ఇళ్లకు పరిమితం అయిపోయారు.

ఆ విధంగా కరోనా వచ్చి అమరావతి ఉద్యమాన్ని అటక ఎక్కించేసింది.

తరువాత ఏంటి?

కరోనా అన్నది ఎప్పటికి ముగిసే అధ్యాయం అన్నది ఇప్పుడే తెలిసే విషయం కాదు. 14తో లాక్ డౌన్ ఆగిపోవచ్చు. కానీ రాజకీయాలు రెగ్యులర్ బాట పట్డడం అన్నది ఇప్పుడే తెలిసే సంగతి కాదు. కొన్నాళ్ల పాటు రాజకీయాలు పక్కనే వుంటాయి. మోడీ చరిష్మా చూసి ఏం చేయాలో తెలియక ప్రతిపక్షాలు తల పట్టుకుంటాయి. మోడీ దగ్గరగా వెళ్లలేక, దూరంగా వుండలేక చంద్రబాబు లాంటి వాళ్లు కిందా మీదా అవుతుంటారు. మొత్తం మీద కరోనా వచ్చి, అంతా మార్చేసింది.

దీన్నే మనవాళ్లు పూర్వం 'గాలి వానా వస్తే ఏ కథా లేదు' అనేవారు. ఇప్పుడు జరిగింది అదే.

-చాణక్య
writerchanakya@gmail.com