Advertisement

Advertisement


Home > Politics - Gossip

ప్రతిపక్షాల వికటాట్టహాసం...మీడియా కరాళ నృత్యం

ప్రతిపక్షాల వికటాట్టహాసం...మీడియా కరాళ నృత్యం

జనపక్షం ప్రతిపక్షం. జనహితం జర్నలిజం. ఇది ఇప్పుడు మనం నోటికొచ్చినట్లు చెప్పుకునే మాట కాదు. వాటి నైతిక ధర్మం అది. అందుకే ఓడినా ప్రతిపక్షానికి ఆ స్థానం. నేరుగా ఏమి చేయలేకపోయినా జర్నలిజానికి ఆ గౌరవం. కానీ, ఎప్పుడెప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు కష్టాల కడలిలో మునిగిపోతారా? అని వేయికళ్ళతో ఎదురు చూస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షం. జనావాసాలకు నిప్పుపెట్టి ఎప్పుడెప్పుడు తాను చలి కాచుకుందామా? అని ఎదురు చూస్తోంది రాష్ట్రంలోని ఎల్లో మీడియా. అందుకే అవకాశం దొరికినప్పుడల్లా ప్రభుత్వంపై ప్రతిపక్షం వికటాట్టహాసం చేస్తుంటే, ఎల్లో మీడియా కరాళ నృత్యం చేస్తోంది.

విశ్వాన్నికరోనా  తన కబంధహస్తాల్లో ఊపిరాకుండా చేస్తోంది. ఆ రక్కసి కోరల్లోంచి తమను తాము రక్షించుకోవడానికి సర్వ మానవాళి నిద్రాహారాలు మాని పోరాడుతుంటే, ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షం, ఎల్లో మీడియా విజ్ఞత మరచి వ్యవహరిస్తున్నాయి. మండలాల వారీగా తీసుకుంటే 86.4 శాతం భూభాగం గ్రీన్ జోన్‌లో ఉంది. ఒక్క కేసు కూడా నమోదు కాని భూభాగంగా ఉంది. రెడ్ జోన్‌లో ఉన్న భూభాగం కేవలం 6.21 శాతం మాత్రమే.

ఇదే ప్రతిపక్షాలకు ఏ మాత్రం రుచించ‌ని విష‌యం. సాధారణంగా అయితే తమ రాష్ట్రంలో ఇంత భాగం సురక్షితంగా ఉందని సంతోషించాలి. ఇంకా ఎక్కడెక్కడ కరోనా కేసులు ఉన్నాయో వెతికి పట్టుకుని నిర్మూలనకు చేయుతనియ్యాల్సిన ప్రతిపక్షం బురదజల్లే కార్యక్రమాన్ని నెత్తికెత్తుకుంది. విశాఖలో కేసులు ఎక్కువగా ఉన్నాయని, వాటిని దాచిపెడుతున్నారనే ఆరోపణలు చేశారు. రకరకాల ఆరోపణలు చేసి రాష్ట్రాన్ని అల్లరిపాలు చేశారు. 40 ఏళ్ళ రాజకీయ అనుభవం అని చెప్పుకునే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్ర‌బాబు బాధ్యత మరచి వ్యవహరించారు. అదే సమయంలో ఎల్లో మీడియా దానికి తాళం వేయడం మొదలు పెట్టింది.

టీవీ 5 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆంధ్రజ్యోతి పత్రికను ఈ రోజు చదివితే నాకు భయమేసింది. 33 వేల మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు మొద‌టి పేజీలో ప్రచురించి తన దిగజారుడు తనాన్ని, తెంపరితనాన్ని చాటుకుంది. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 11వేల మందికి కరోనా పాజిటివ్ కేసులు ఉంటే, ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 33 వేల మందికి ఆ లక్షణాలున్నట్లు ప్రచురించడాన్ని చూస్తే అసహ్యమేసింది. పత్రికలు ఉండేది ఆపత్కాల జనానికి భరోసా కల్పించడానికా? లేక అధికార పక్షంపై కక్ష తీర్చుకోవడానికి జనాన్ని ఇంతగా భయపెట్టాలా? అని కంపరం పుట్టుకొస్తోంది. ఇలాంటి ప్రతిపక్షాలు, మీడియా సంస్థలు ఆంధ్రరాష్ట్రాన్ని ఏమి చేస్తాయోనని భయమేస్తోంది. దేశపరిరక్షణలో భాగంగా మీడియా తమకున్న వెసలుబాటును ఇంత దారుణంగా వాడుకోవడం బహుశా ఇంకెక్కడా జరగదేమో. ఒక వైపు బీజేపీ నాయకులు, ఎల్లో మీడియా ప్రధాన ప్రతిపక్షం తీవ్రంగా కృషి చేసి జగన్‌ను కష్టాల్లోకి నెట్టేశామని ఆనందపడుతున్నాయి. కానీ, వారు ప్రమాదంలోకి నెట్టింది అధికారపక్షాన్ని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కాదు. ఏకంగా రాష్ట్రాన్నే ప్రమాదంలోకి నెట్టేశారు.

మరి కేంద్రం ప్రకటన మాటేంటి?

దేశంలోని కరోనా ప్రభావిత రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ 9 స్థానంలో ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ కంటే 8 రాష్ట్రాలలో ఇంతకంటే ఎక్కువ కరోనా కేసులు ఉన్నాయి. చివరకు ప్రధాని మోడి సొంత రాష్ట్రం గుజరాత్ కూడా ఆంధ్రప్రదేశ్ కంటే ముందే ఉంది. కానీ, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో 84.5 శాతం భూభాగాన్ని రెడ్ జోన్‌గా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11  జిల్లాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు.

కేంద్ర ప్రభుత్వం, గుడ్డిగా కళ్ళు మూసుకుని ఎద్దు ఈనిందంటే గాట కట్టేయండన్న చందంగా రెడ్ జోన్లను ప్రకటించింది. ఎక్కడా శాస్త్రీయత కనిపించలేదు. ఏది హాట్ స్పాట్? దాని పరిధి ఎంత?  ఏది రెడ్ జోన్‌? దానికి పారామీటర్ ఏంటి? అనే విషయాలను ఏ మాత్రం వెల్లడించలేదు. జిల్లాలను ప్రమాణంగా తీసుకుని రెడ్ జోన్లను ప్రకటించారు. ఉదాహరణకు  11 జిల్లాలు ఉన్న ఢిల్లీ రాష్ట్రంలో మొత్తం 5 వేల చదరపు కిలో మీటర్లు  వైశాల్యం ఉంది. అందులో 10 జిల్లాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని కేవలం ఒక్క చిత్తూరు వైశాల్యం ఎంతో తెలుసా? ఢిల్లీకి మూడు రెట్లు ఉంటుంది. అంటే 15 వేల చదరపు కిలోమీటర్లు. ఇక రాష్ట్ర వైశాల్యం ఎంతో తెలుసా? 1.62 లక్షల చదరపు కిలోమీటర్లు. ఇక్కడ 11 జిల్లాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. ఢిల్లీలో ఉన్న కరోనా కేసుల సంఖ్య అక్షరాలా 1578. ఆంధ్రప్రదేశ్లో  కరోనా కేసుల సంఖ్య 525. ఇక్కడా అక్కడా ఇంచుమించుగా ఒకే స్థాయిలో జిల్లాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. ఏం? ఢిల్లీలోనో, లేదా గుజరాత్‌లోనో  కరోనా సోకడం అంత మందంగా ఉంటుందా? ఆంధ్రప్రదేశ్‌లో అంత వేగంగా ఉంటుందా? అసలు మీరు ప్రకటించిన రెడ్ జోన్ కు ప్రాతిపదిక ఏంటి?

ఇక పక్కనున్న తెలంగాణతో పోల్చుకున్నా కూడా ఇక్కడున్న ఒక్క జిల్లా అక్కడున్న మూడు జిల్లాలతో సమానం అవుతుంది. అక్కడ 8 జిల్లాలను రెడ్ జోన్లుగా ప్రకటిస్తే ఇక్కడ మాత్రం 11 జిల్లాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. అందుకున్న శాస్త్రీయత ఏంటి? ఉదాహరణకు కడప జిల్లాను తీసుకుందాం. ఇప్పటి వరకూ ప్రొద్దుటూరులో 15 మినహా అన్ని చోట్ల 5కు మించి కేసులు లేవు. కడప జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని మూడు జిల్లాలతో సమానం.

పులివెందుల, మైదుకూరు, వేంపల్లి, బద్వేల్, యర్రగుంట్లలలో మాత్రమే కేసులు నమోదయ్యాయి. దాదాపు ఇవన్నీ ఒకే ప్రాంతంలో ఉంటాయి. అయితే ఒక్క కేసు కూడా నమోదు కాని రాజంపేట, రాయచోటి, కోడూరు ప్రాంతాలను రెడ్ జోన్ కింద చేర్చడం విచిత్రంగా ఉంది. అలాగే చిత్తూరు జిల్లాలో తిరుపతి పక్క‌నున్న శ్రీకాళహస్తి, వడమాల పేట, అలాగే పలమనేరు ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే కేసులు నమోదయ్యాయి. 15 వేల చదరపు కి.మీ పరిధి కలిగిన చిత్తూరు జిల్లా మొత్తాన్ని రెడ్ జోన్‌గా ప్రకటించారు. దాదాపుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇలాగే జరిగింది.

రెడ్ జోన్‌గా ప్రకటిస్తే నష్టం ఏంటి?

కరోనా వ్యాప్తి చెందకుండా రెడ్ జోన్లుగా ప్రకటిస్తే మంచిదే కదా? అందులో తప్పు ఏమిటి? మనది వ్యవసాధారిత దేశం. అందులో ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా పేరు. అంటే పూర్తి స్థాయిలో పంటలపై ఆధారపడి బతికే రాష్ట్రం మనది. తిని కూర్చోవడానికి మనదేశం సంపన్నదేశమూ కాదు. అలాగని కేంద్రం విదిల్చిన ఐదు వందలతోనో, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యం, పప్పుతోనే బతికేస్తారనుకోవడంలో అర్థం లేదు.

పంటలు చేతికొచ్చే సమయంలో రెడ్ జోన్ల ప్రకటనతో రాష్ట్ర వ్యవసాయ రంగం కుదేలు కావడం ఖాయం. ఇప్పటికే 21 రోజులు గడిచిపోయాయి. కోడూరులో పండించిన అరటి, పులివెందులలో పండించిన నిమ్మ, చీని, చిత్తూరులో దిగుబడి వచ్చిన మామిడి, గుంటూరులో పండిన మిరప, కోస్తాలో వచ్చిన‌ వరి ధాన్యాన్ని ఏం చేయాలి? ఏ రాష్ట్రానికి ఎగుమతి చేయాలి? రాష్ట్రం వీటన్నింటిని కొంటుంది. ఓకే. ఆ తరువాత పరిస్థితి ఏంటి? ఇలాగే స్తంభించిపోవాలా? మిగిలిన రాష్ట్రాలలో మాత్రం రెడ్ జోన్ల నుంచి వెసలుబాటుతో వ్యవసాయం, పరిశ్రమలతో ముందుకు పరుగులు తీయాలా?

ఇది ఒక ఎత్తయితే. లేని ప్రాంతాలను రెడ్ జోన్లగా ప్రకటించడం వల్ల‌ ప్రతిపక్షాలకు, కేంద్రానికి, ఎల్లో మీడియాకు ఆనందం కావచ్చునేమో కానీ, భవిష్యత్తు అంధకారమే. ఇంత పెద్ద ఎత్తున కరోనా ప్రమాదం ఉన్న రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పరిశ్రమల స్థాపనకు పెట్టుబడిదారులు ముందుకురారు. ఇప్పటికే ఉన్నఅప్పులతో రాష్ట్రం పరిస్థితి మూలిగే నక్కపై తాటి పండు ప‌డ్డ‌ట్టుగా తయారవుతుంది. సరిగ్గా ప్రతిపక్షాలకు, ఎల్లో మీడియాకు కావాల్సింది కూడా ఇదే. రాష్ట్రం అధోగతి పాలైనా ఫార్వాలేదు. జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పడాలి. సంక్షేమ పథకాలు ఆగిపోవాలి. ఇలాంటి కుహానా రాజకీయ నేత‌లు, రాజ‌కీయాలు ఉన్నంత కాలం రాష్ట్ర భవిష్యత్తుకు దినదినగండమే.

పుత్తా య‌ర్రంరెడ్డి, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?