కన్నడ కమలానికి అష్టమగండం!

కన్నడ నాట భారతీయ జనతా పార్టీకి ‘అష్టమగండం’ అనేది పొంచి ఉంది. ఇప్పుడు 17 స్థానాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ 8 సీట్లు గెలుపొందాల్సి ఉంది. ఏ మాత్రం…

కన్నడ నాట భారతీయ జనతా పార్టీకి ‘అష్టమగండం’ అనేది పొంచి ఉంది. ఇప్పుడు 17 స్థానాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ 8 సీట్లు గెలుపొందాల్సి ఉంది. ఏ మాత్రం తేడా వచ్చినా.. యడియూరప్ప ప్రభుత్వం కుప్పకూలుతుంది.

పాతప్రభుత్వాన్ని కూలతోయడానికి పన్నిన కుట్రలు, వేసిన ఎరలు అన్నీ నిష్ఫలం అవుతాయి. పార్టీ పరువు బజార్న పడుతుంది.

అవును.. అసెంబ్లీ లెక్కల సాక్షిగా… ఈ ‘అష్టమ గండం’ అనేది నిజం. కర్నాటక అసెంబ్లీలో మొత్తం 225 సీట్లు ఉన్నాయి. గతంలో కుమారస్వామి ప్రభుత్వం ఉండగా.. 17మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో… ఆ సంఖ్య 208కి పడిపోయింది. ఒక ఇండిపెండెంటుతో కలిపి 106 సీట్ల బలం ఉన్న కమలం గద్దెమీదికి వచ్చింది. కానీ పూర్తి సభలో వారు మెజారిటీ నిరూపించుకోవాలంటే.. 113 మంది సభ్యుల బలం ఉండాలి.

భాజపాకు సొంతంగా అంత బలం కావాలంటే.. 8 సీట్లు తక్కువ ఉంది. అంటే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న 17 సీట్లలో వారు 8 గెలిచి తీరాలి. గతంలో కాంగ్రెస్ తరఫున గెలిచిన వారు.. రాజీనామాల వలన అనర్హులయ్యాక.. 16మంది ఇప్పుడు భాజపాలో చేరారు. వారిలో 15 మందికి టికెట్లు ఇచ్చారు. మళ్లీ గెలిచిపోతారని నిమ్మళంగా కూర్చోడానికి వీల్లేదు.

ఆ నియోజకవర్గాలన్నీ కాంగ్రెస్ గెలిచిన సీట్లు. నాయకులు పార్టీ మారినా, కాంగ్రెస్ ఓటు బ్యాంకు పదిలంగానే ఉంటుంది. అదే సమయంలో గతంలో భాజపా తరఫున పోటీచేసి ఓడిపోయిన నాయకులు ఎంత మనస్ఫూర్తిగా పనిచేస్తారనేది ముఖ్యం.

ఈ కొత్త వలసనాయకులు మళ్లీ గెలిస్తే.. నియోజకవర్గంలో తమ కెరీర్ భూస్థాపితం అయినట్లే గనుక.. వారు చాపకింద నీరులా నెగటివ్ ప్రచారం చేస్తే.. భాజపాకు ఆ చేటు తప్పదు.

ఇలాంటి నేపథ్యంలో 8 సీట్లను నెగ్గడం భాజపాకు మరీ నల్లేరు మీద బండినడక కాకపోవచ్చునని పలువురు విశ్లేషిస్తున్నారు.

వక్రమార్గంలో కుట్రపూరితంగా తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఆ 17 మంది కారణం కాబట్టి.. కాంగ్రెస్ వారిని ఓడించడానికి తమ శాయశక్తులూ ఒడ్డి పోరాడుతుందనేది కూడా గుర్తుంచుకోవాలి.