ఆ ముగ్గురు- కేవిపీ కనెక్షన్

కేవిపి రామచంద్రరావు. అలియాస్ ఆత్మ. వైఎస్ జమానాలో ఆయన ఏ రేంజ్ కీలకమైన వ్యక్తి అన్నది రాజకీయాలతో పరిచయం వున్నవారు అందరికీ తెలిసిందే. నోట మాట రాకుండానే, మౌనంగానే పరిస్థితులను చక్కబెట్టి, రాజకీయాల్లో చక్రం…

కేవిపి రామచంద్రరావు. అలియాస్ ఆత్మ. వైఎస్ జమానాలో ఆయన ఏ రేంజ్ కీలకమైన వ్యక్తి అన్నది రాజకీయాలతో పరిచయం వున్నవారు అందరికీ తెలిసిందే. నోట మాట రాకుండానే, మౌనంగానే పరిస్థితులను చక్కబెట్టి, రాజకీయాల్లో చక్రం తిప్పడంలో ఆయన దిట్ట. 

వైఎస్ జమానాలో ఆయన అప్పుడప్పుడు అలా అలా మాట్లాడిన మాటలు అన్నీ తీసి ఒక చోట చేర్చినా పట్టపది పాతిక పేజీలు కావు. అంత మౌనంగానే ఆయన రాజకీయాలు నడిపేవారు. ఏ రోజూ పార్టీ జనాల వరకే తప్ప, మీడియాలో ఆయన హడావుడి అస్సలు వుండేది కాదు. కానీ ఆ విధంగా పనులు చక్క బెట్టడంలో ఆయన ను మించిన రాజకీయ వేత్త తెలుగునాట మరొకరులేరు. 

కానీ అలాంటి చాణక్యుడు ఉన్నట్లుండి కనుమరుగయ్యారు. వైఎస్ మరణం అనంతరం ఆయన జగన్ వెంట నడవలేదు..మామ అనేంత చనువు వున్నా జగన్ ఆయనను దగ్గరకు తీయలేదు. ప్రతి ఒక్కరికీ ఒకటే అనుమానం. ఎందుకు కేవిపిని దగ్గరకు తీసుకోలేదా? అన్నదే. కేవిపి లాంటి చాణక్యుడు పక్కన వుంటే ఆ బలమే వేరు కదా. జగన్ తప్పు చేస్తున్నాడు అనుకున్నవారే అంతా. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కేవిపిని ఇందుకే దూరం పెట్టారా? లేదా కేవిపి దూరం పెట్టిన ఫలితమా ఇది అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. 

ఎందుకంటే, ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో జగన్ మీద ఒంటికాలితో లేస్తున్న వారు ముగ్గురు వున్నారు. ఒకరు రఘురామకృష్ణం రాజు. ఈయన కేవిపి కి స్వయనా బంధవు. మరొకరు సబ్బం హరి. ఈయన కేవిపి మనిషి. ఆయనే పూనుకుని హరికి అనకాపల్లి ఎంపీ టికెటి ఇప్పించారు. దీనికి కారణం ఇద్దరూ ఒకే సామాజిక వర్గం అనే గుసగుసలు రాజకీయ వర్గాల్లో వున్నాయి. మొత్తం మీద హరికి కేవిపి కి మంచి బంధాలు వున్నాయి.

ఇక మూడో వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్. ఆయన వైఎస్ కు ఎంత సన్నిహితమో, కేవిపికి అంతే. ఇద్దరి మధ్య మాంచి స్నేహం కూడా వుందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ వుంటుంది. ఇప్పుడు ఈ ముగ్గురూ జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. మనం జయించలేని వారు ఏదో విధంగా మాయం అయిపోతే బాగుండు అని అనుకోవడం మానవ నైజం. ఈ ముగ్గురి గోల కూడా ఇదే. జగన్ జైలుకు వెళ్లిపోతే బాగుండును. జగన్ ఏదో విధంగా గద్దె దిగిపోతే బాగుండును.

రఘరామ కృష్ణం రాజు, హరి నేరుగా టార్గెట్ చేస్తున్నారు. ఉండవల్లి తన మేధావితనం రంగరించి టార్గెట్ చేస్తున్నారు. అంతే తేడా. నిజానికి వైఎస్ కొడుకుగా జగన్ మీద కేవిపి కి ఏ మాత్రం అభిమానం వున్నా, ఆయన తలుచుకుంటే ఈ ముగ్గురు వీరులు సైలంట్ కావడానికి ఎంతో సమయం పట్టదు. అయినా అలా జరగడం లేదు అంటే కేవిపి కి జగన్ మీద అలకో, ఆగ్రహమో వుండి వుండాలి. లేదా అసలు అందుకే జగన్ ఆయనను దగ్గరకు తీయకుండా వుండి వుండాలి. 

గుడ్డు ముందా..పిల్ల ముందా అనే ప్రశ్నలాంటది ఈ వ్యవహారం. కేవిపి కి జగన్ కు మధ్య ఏదైనా వుందా? దాని పర్యవసానంగానే దగ్గర కాలేకపోయారా? దాని ఫలితంగానే ఈ ముగ్గురు వీరులు జగన్ ను విడతల వారీగా టార్గెట్ చేస్తున్నారా?  ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం దొరకాలంటే అంత వీజీ కాదు. 

ఎందుకంటే అక్కడ వున్నది కేవిపి. నోరు విప్పకుండానే పనులు చక్కబెట్టగల దిట్ట. కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోయినా, తనపై అమెరికాలో కేసు వున్నా, అది ఎక్కడ వుందో, అసలు వుందో లేదో? వుంటే ఏ స్థాయిలో వుందో కూడా ఎక్కడా తెలియకుండా పోవడం అంటే కేవిపి చాణక్యం అర్థం అవుతుంది. అలాంటి చాణక్యం ముందు ఆంధ్ర రాజకీయాలను ఆయన ప్రభావితం చేయడం లేదని అనుకోవడానికీ లేదు.అలా అని ఆ ఆనూ పానూ కూడా చిక్కదు.