ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని లేదా మూడు రాజధానులు అనే ప్రతిపాదన ఇప్పుడు పూర్తిగా రాజకీయ అంశం అయిపోయింది. అధికారాన్ని వికేంద్రీకరించి మూడు ప్రాంతాలలో రాజధాని ఏర్పాటు చేయాలనేది జగన్ ప్రభుత్వ ఆలోచన కావడంతో… తెలుగుదేశం పార్టీ అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలనే ప్రతిపాదనను పట్టుకు వేళ్లాడుతోంది. జగన్ పాలన నడుస్తున్నది కనుక తెలుగుదేశం వారంతా రోడ్డెక్కి పెద్ద స్థాయిలో ఆందోళనలకు దిగుతున్నారు. ప్రభుత్వం కమరే గనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుచరులు అందరూ మిన్నకుంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఏ వాదనకు మద్దతు ఇస్తున్న వారు చెబుతున్న కారణాలు ఏమిటి అనేది ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం వాదనను సమర్థిస్తున్న వారందరూ.. సహజంగానే అధికారాన్ని వికేంద్రీకరించడం వలన.. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయనే కారణం చూపిస్తున్నారు.
అయితే దీనికి వ్యతిరేకంగా.. రాజధాని తరలింపు వద్దని.. అమరావతిలో మాత్రమే రాజధాని ఉండాలని చెబుతున్న వారి వాదనల మాటేమిటి? వారి కారణాలు ఏమిటి? అని ఆలోచిస్తే.. వారు చెప్పేవన్నీ కూడా.. సంకుచితమైన, స్వార్థ ప్రయోజనాలతో కూడిన కారణాలుగానే కనిపిస్తున్నాయి.
ప్రధానంగా అమరావతి ప్రాంత రైతుల ఆందోళన గురించి చెప్పాలి. తాము ప్రభుత్వానికి ఇచ్చిన భూముల వేల్యూ పడిపోతుందని, తాము నష్టపోతామని వారు ఆందోళన చెందుతున్నారు. తాము వస్తాయనుకున్న లాభాలు రాకుండా పోతాయి గనుక.. ఇక్కడినుంచి రాజధానిని తరలించవద్దనేది వాళ్ల వాదన. ఇవాళ సచివాలయ ఉద్యోగులు కూడా గళమెత్తుతున్నారు. ప్రభుత్వోద్యోగంలో కుదురుకున్నాక.. సచివాలయం ఎక్కడుంటే అక్కడ విధులు నిర్వర్తించాలి. అంతే తప్ప.. ఇక్కడ మేం ఆస్తులు కొనుక్కున్నాం.. కాబట్టి ఇక్కడినుంచి మేం తరలి రాం.. అని వాదిస్తే ఎలా? ఎవడు ఎక్కడ ఆస్తులు కొనుక్కుంటే.. అదే ప్రాంతంలో వాళ్ల ఆఫీసు నడపాలంటే.. ప్రభుత్వం వారు చెప్పినట్టల్లా వినాలా? అనే సందేహం కలుగుతోంది.
సచివాలయం తరలిస్తే.. తాము విశాఖకు రాలేం అని వాదిస్తున్న వారిని.. వారిస్థాయికి తగిన ఇతర శాఖలకు బదిలీచేసేస్తే.. మూడేళ్లకోసారి రెగ్యులర్ ట్రాన్స్ ఫర్స్ లో ఏ ఊరికి వేస్తే ఆ ఊరికి వెళ్తూ గడుపుతారు. ప్రభుత్వ ఆలోచనను అర్థం చేసుకోకుండా.. అధికార వికేంద్రీకరణ ప్రతిపాదనను సంకుచిత కారణాలతో అడ్డుకోవాలని చూసే వారి కుట్రలను గమనించి, తిప్పికొట్టాలని ప్రజలు అనుకుంటున్నారు.