పెరుగుతున్న రాయలసీమ సెంటిమెంట్‌…!

అమరావతి నుంచి రాజధాని తరలింపు ప్రక్రియ వేగం పుంజుకొంటున్నకొద్దీ 'రాయలసీమ సెంటిమెంట్‌ ' కూడా ఎక్కువవుతోంది. కర్నూలు జ్యుడీషియల్‌ క్యాపిటల్‌ అంటూ ప్రభుత్వం చెప్పినా అది నిజమైన కేపిటల్‌ కాదనే విషయం రాయలసీమ నాయకులకు…

అమరావతి నుంచి రాజధాని తరలింపు ప్రక్రియ వేగం పుంజుకొంటున్నకొద్దీ 'రాయలసీమ సెంటిమెంట్‌ ' కూడా ఎక్కువవుతోంది. కర్నూలు జ్యుడీషియల్‌ క్యాపిటల్‌ అంటూ ప్రభుత్వం చెప్పినా అది నిజమైన కేపిటల్‌ కాదనే విషయం రాయలసీమ నాయకులకు తెలుసు. హైకోర్టు వల్ల రాయలసీమ అభివృద్ధి చెందదనే సంగతి తెలుసు. అందుకే 'ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం' అంటూ డిమాండ్‌ చేస్తున్నారు. పది మంది మంత్రులు, ఉన్నతాధికారులతో కూడిన హైపవర్‌ కమిటీకి రాయలసీమకు చెందిన కొందరు నాయకులు లేఖలు రాశారు. ఏమని? రాజధాని రాయలసీమవాసుల సెంటిమెంట్‌ అని, రాయలసీమను రాజధానిగా చేయాలని డిమాండ్‌ చేస్తూ కమిటీకి లేఖలు పంపారు. రాయలసీమను రాజధానిగా చేయడమంటే కర్నూలును రాజధానిగా చేయాలని అర్థం. 

రాయలసీమ రాజధాని సెంటిమెంట్‌ ఎక్కడిది? ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర ప్రాంతం విడిపోయి ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పుడు అంటే 1953లో కర్నూలును రాజధానిగా చేశారు. 1956లో తెలంగాణను కలుపుకొని ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడినప్పుడు హైదరాబాద్‌ రాజధాని అయింది. అప్పట్లో రాజధాని పోయిందంటూ కర్నూలువాసులు ఆవేదన చెందారు. 2014లో ఉమ్మడి రాష్ట్రం విడిపోయినప్పడు చంద్రబాబు అమరావతిని రాజధాని చేశారు. అమరావతిని అన్ని ప్రాంతాలవారు అంగీకరించి కుదుటపడుతున్నంతలో సీఎం జగన్‌ విశాఖపట్నం రాజధాని అన్నారు. దీంతో రాయలసీమవాసుల్లో అసహనం, అసంతృప్తి పెరిగిపోయాయి. ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను తెర మీదికి తెస్తున్నారు. 

హైపవర్‌ కమిటీలోనూ రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరిగిందంటున్నారు. పది మంది మంత్రుల్లో రాయలసీమకు చెందినవారు ముగ్గురే ఉన్నారని ఆక్షేపించారు. అమరావతిలో రాజధాని కోసం రైతులు 33 వేల ఎకరాలు ఇవ్వగా, శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి రాయలసీమ రైతులు 80 వేల ఎకరాలను లాభాపేక్ష లేకుండా త్యాగం చేశారని గుర్తు చేస్తున్నారు. మైసూరా రెడ్డి, బైరెడ్డి రాజశేఖరరెడ్డి, జేసీ దివాకర్‌ రెడ్డి …ఇలా పలువురు నాయకులు రాయలసీమలో ఉద్యమాన్ని లేవదీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం గురించి మాట్లాడారు. ఈ విషయమై చర్చించడానికి ప్రత్యేకంగా సమావేశమవుతామని చెప్పారు.  

జ్యుడీషియల్‌ రాజధాని కర్నూలులో ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. హైకోర్టు వస్తున్నందుకు కొందరు సంతోషపడుతున్నారు. కాని దానివల్ల కర్నూలుగాని, రాయలసీమగాని అభివృద్ధి చెందుతాయా అనే సందేహం వెంటాడుతోంది. ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి, కొన్నాళ్ల తరువాత తెలంగాణను కలుపుకొని ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడి, 2014లో మళ్లీ ఆంధ్ర-తెలంగాణగా విడిపోయి , వైకాపా అధికారంలోకి వచ్చిన సమయానికి కూడా 'రాయలసీమ ఇప్పటికీ వెనుకబడి ఉంది' అనే మాట వినిపిస్తోంది. అసలు ప్రభుత్వంగాని, మంత్రులుగాని సీమను ఏవిధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారో చెప్పడంలేదు. రాజధాని అమరావతి నుంచి విశాఖపట్టణానికి తరలిపోతే అమరావతిని ఏవిధంగా అభివృద్ధి చేస్తామో కొన్ని అంశాలైనా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో రాయలసీమను కలిపేయాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. 

ఈమధ్య  కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన రెడ్డి 'కర్నూలు జిల్లాను తెలంగాణలో కలిపేయండి' అని డిమాండ్‌ చేశాడు. కర్నూలు జిల్లాను తెలంగాణలో విలీనం చేసి, మిగతా మూడు సీమ జిల్లాలతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కలిపి 'గ్రేటర్‌ రాయలసీమ' గా చేయాలని అన్నాడు. విశాఖను రాజధానిగా చేస్తే రాయలసీమవాసులకు కష్టాలు తప్పవని, ఈ కష్టాలు తాము పడలేమని, అందుకే కర్నూలును తెలంగాణలో కలిపేయాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్‌ చేశాడు. కొందరు సీమ నాయకులు  ప్రత్యేక రాష్ట్రం గురించి మాట్లాడకుండా, తమ జిల్లాలకు రాజధాని హంగులు సమకూర్చాలని అడుగుతున్నారు. బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్‌ మినీ సచివాలయాలు ఏర్పాటు చేయాలంటున్నాడు.  మినీ సచివాలయాలు అనేవి ఉండవు. కాని ఈ కొత్త కాన్సెప్టును టీజీ వెంకటేష్‌ తెరమీదికి తీసుకొచ్చాడు.  మొత్తం మీద జగన్‌ రాజేసిన మూడు రాజధానుల చిచ్చు ఎక్కడికి పాకుతుంది?