తాను ఒకసారి ట్రయిన్ లో ఒక మిలటరీ వ్యక్తితో చేసిన ప్రయాణం నుంచే 'సరిలేరు నీకెవ్వరు' సినిమా కథ పుట్టిందని డైరక్టర్ అనిల్ రావిపూడి అన్నారు. రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కు ఒకసారి ట్రయిన్ లో ఫ్రయాణం చేయాల్సి వచ్చిందని, ఆ టైమ్ లో నిద్రపోకుండా కూర్చుని వున్న ఓ సోల్జర్ ను చూసి పలకరించానని ఆయన 'గ్రేట్ ఆంధ్ర'కు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పారు.
తమకు నిద్ర అనేది చాలా తక్కువ అని, జాగ్రత్తగా వుండడం అలవాటు అయిపోయిందని చెప్పారని, ఇంట్రస్టింగ్ గా వుండడంతో రోజంతా మాట్లాడుతూ వున్నానని, ఆ రోజల్లా తనను అతను నవ్విస్తూనే వున్నాడని, అప్పుడు హీరో క్యారెక్టర్ పుట్టిందని ఆయన అన్నారు. పనిలో అంత జాగ్రత్తగా, టెన్షన్ గా వుండే సోల్జర్ బయట ఇంత ఫన్ గా వుండడం అన్నది అక్కడ పుట్టిందని అన్నారు.
రాజా ది గ్రేట్ టైమ్ లో పుట్టిన ఈ కాన్సెప్ట్ ను అనుకోకుండా మహేష్ బాబుకు చెప్పడం, ఆయనకు నచ్చడంతో ఎఫ్ 2 సినిమా టైమ్ లోనే ఈ సినిమా ప్లానింగ్ జరిగిపోయిందని అనిల్ అన్నారు. 40 నిమషాల కథ విన్న తరువాత మహేష్ మళ్లీ తనను సినిమా గురించి అడగలేదని, ఏం చెబితే అది చేసారని, అంతలా తనను నమ్మారని అన్నారు.
సినిమాలో రష్మికను హీరోయిన్ తీసుకోకుండా వుండి వుంటే, తాము తప్పు చేసిన వాళ్లం అయ్యేవారమమని ఆయన అన్నారు. రష్మికను తీసుకున్నాక చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేసారని, కానీ సినిమాలో ఇప్పుడు రష్మికనే ప్లస్ అయిందన్నారు. భారతి పాత్రకు విజయశాంతిని తప్ప మరొకరిని అనుకోలేదని, ఊహించలేదని ఆయన అన్నారు.
సినిమా కథను దృష్టిలో పెట్టుకునే 'సరిలేరు నీకెవ్వరు' టైటిల్ పెట్టానని, సినిమా అంతా చూసాక, కథకు యాప్ట్ టైటిల్ అంటారని ఆయన చెప్పారు. పోటీగా బన్నీ-త్రివిక్రమ్ సినిమా వస్తోంది అన్న ఫీలింగ్ తనకు లేదని, అసలు ఆ పోటీ అనేదాన్ని తాను పట్టించుకోనని ఆయన అన్నారు.
సంగీతను తల్లి పాత్రకు ఒప్పించడం కాస్త కష్టమైందని, కానీ సినిమా చూసాక, ఎంత మంచి పాత్రనో ఆమెకు కూడా తెలుస్తుందన్నారు. సినిమాకు ఓవర్ బడ్జెట్ అయిందన్న మాట అవాస్తవమని, సినిమాను అతి తక్కువ కాలంలో తీయడం వల్ల నిర్మాతకు చాలా మంచి లాభం వచ్చిందని అనిల్ రావిపూడి అన్నారు.
పాటల విషయంలో దేవీని అందరూ జడ్జ్ చేయలేరని, బాగా లేవున్న పాటలు నెల తరువాత వైరల్ అయిపోయి, ఆ ఏడాది మేటి పాటలు అవుతాయని, ఇది తనకు చాలా అనుభవమని ఆయన అన్నారు.