సీఎం జగన్పై కక్షతో మాజీ మంత్రి అఖిలప్రియ విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏకంగా ఆమె రాయలసీమకు హైకోర్టు అవసరం లేదనే స్థాయికి చేరారని ఆ ప్రాంతవాసులు మండిపడుతున్నారు. అభివృద్ధి కోసమే వైసీపీ నుంచి టీడీపీలో చేరామని నాడు చెప్పిన అఖిలప్రియ…అప్పుడెందుకు హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయలేదని వారు ప్రశ్నిస్తున్నారు.
కేవలం భూమా కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందింది తప్పితే కర్నూలు జిల్లాకు ఒరిగిందేమీ లేదని రాయలసీమ వాసులు గుర్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని స్వగృహంలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాయలసీమ ప్రజల మనోభావాలను కించపరిచారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని దశాబ్దాలుగా కరవుకాటకాలతో రాయలసీమ రైతాంగం పంటలు పండక అల్లాడుతున్న రైతాంగం బాధలు ఏనాడూ అఖిలప్రియకు కన్నీళ్లు తెప్పిస్తున్నట్టు ప్రకటించిన సందర్భాలు లేవంటున్నారు.
అలాంటిది రాజధానిలో రైతుల ఆందోళనలు తనకు కన్నీటిని తెప్పిస్తున్నాయనడం విడ్డూరంగా ఉందన్నారు. భౌతికంగా, రాజకీయంగా జన్మనిచ్చిన అత్యంత వెనుకబడిన కర్నూలుకు జగన్ సర్కార్ హైకోర్టు ఇస్తామంటే, వద్దని చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. హైకోర్టు వల్ల ఏం లాభమని ప్రశ్నించడం అంటే ఎలా అర్థం చేసుకోవాలని అక్కడి ప్రజానీకం నిలదీస్తోంది.
రాయలసీమ రైతులు అమరావతి రైతులకు సంపూర్ణ మద్దతు ఇస్తారని ఆమె ప్రకటించారు. రాయలసీమ తరపున వకల్తా పుచ్చుకోడానికి అఖిలప్రియ ఎవరని ప్రశ్నిస్తున్నారు. పంటలు పండక విలవిలలాడుతున్న రాయలసీమ రైతాంగానికి ఏనాడైనా డెల్టా ప్రాంత రైతుల మద్దతు కూడగట్టారా అని రాయలసీమ వాదులు ప్రశ్నిస్తున్నారు. ప్రజా తిరస్కరణకు గురైన అఖిలప్రియ ఇప్పటికైనా కర్నూలు అభివృద్ధికి అడ్డు పడవద్దని ఆ జిల్లా వాసులు విన్నవిస్తున్నారు. ఏమ్మా అఖిలా వినిపిస్తోందా?