సీఆర్డీఏపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత.. ఆ భేటీ వివరాలను మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ విలేకర్ల సమావేశం పెట్టి వివరాలు వెల్లడించారు. కొన్ని రోజులుగా విచ్చలవిడిగా రేగుతున్న పుకార్లకు తెరదించారు. అనుమానాలను నివృత్తి చేశారు. పనులు మొదలు కానీ, బ్యాంకులతో ఒప్పందంలేని కాంట్రాక్టుల్ని రద్దుచేశామని, నిధుల లభ్యతను బట్టి పనుల విషయంలో ముందుకెళతామని చెప్పారు. దాంతో రాజధాని ఇక్కడే ఉంటుందన్న మాట నిశ్చయం అయినట్టే. బొత్స ప్రకటన తర్వాత కూడా ఎవ్వరికైనా అనుమానాలు ఉంటే గనుక.. వాటిని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరింత తేటపరిచేశారు.
రాజధాని అనేది ఇక్కడినుంచి తరలిపోతుందని మీకు ఎవరు చెప్పారు? అని ఆళ్ల ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఆయన బొత్స మాటల వలన తరలింపు అనుమానాలు రేకెత్తిన మొదట్లో కూడా.. ఇదేమాట చెప్పారు. రాజధాని తరలదు.. నల్లరేగడి భూముల్లో కోర్ కేపిటల్ నిర్మాణాలు కాకుండా ఉంటే మంచిది అని కూడా అన్నారు. ప్రధానమైన రాజధాని భవనాలకు సరిపడా ప్రభుత్వ భూములు మంగళగిరి ప్రాంతంలోనే ఉన్నాయని కూడా ఆయన అప్పుడే చెప్పారు.
కానీ.. బొత్స మాటల పుణ్యమాని వివాదాన్ని పెంచడానికి, అనుమానాల్ని వ్యాపింపజేయడానికి ఉత్సాహపడుతున్న వాళ్లెవరూ ఆయన మాటల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు సీఆర్డీయే సమావేశం తర్వాత బొత్స.. అధికారికంగా.. తరలింపు లేదనే సంగతిని చెప్పేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మరింత క్లారిటీ ఇచ్చారు. రాజధాని ఇక్కడ ఉంటున్నది కాబట్టే… మా నాయకుడు జగన్మోహనరెడ్డి తాడేపల్లి సొంత ఇల్లు కట్టుకున్నారు… అంటూ ఆయన స్పష్టత ఇచ్చారు.
దీంతో మబ్బులు విడిపోయాయి. బొత్స మాటలకు తమదైన భాష్యంచెప్పి ప్రజల్లో అనుమానాలు, భయాలు పెంచి.. రాజకీయంగా, రియల్ ఎస్టేట్ పరంగా అనుచిత లబ్ధిపొందడానికి రాజకీయ ప్రత్యర్థులే ఈ పన్నాగం వేశారని అర్థమవుతోంది. ఈ వక్రప్రచారాల వలన ప్రజలు ప్రభావితం కాకుండా ఉంటే బాగుంటుంది.