కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోల్‌కతలో సీఏఏ అనుకూల సభలో పాల్గొన్నారు. కేంద్రప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయడానికే కట్టుబడి ఉన్నదనే సంగతి స్పష్టం. అయితే.. ఈ విషయాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మలచుకోవడానికి.. సీఏఏ వ్యతిరేకతతో దేశంలో రగులుతున్న మంటలను ఎంతగా వీలైతే అంతగా ఎగదోయడానికి తద్వారా లబ్ధి పొందడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. అమిత్ షా మాటలు ఆ తరహాలోనే సాగుతున్నాయి.
కోల్‌కత వేదికగా ఆయన మమతా బెనర్జీ సర్కారుపై నిప్పులు చెరిగారు. సరిగ్గా మరొక ఏడాదిలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. మమత మీద విమర్శలు రాజకీయ వ్యూహంలో భాగమే అనుకోవచ్చు. 2021 లో పశ్చిమ బెంగాల్ లో తమ పార్టీ భాజపా అధికారంలోకి వచ్చి తీరుతుందని కూడా అమిత్ షా జోస్యం చెప్పారు. పొరుగుదేశాలనుంచి వచ్చిన శరణార్థులకు దళితులకు పౌరసత్వం ఇస్తాం అంటే.. మమతా బెనర్జీకి భయం ఎందుకంటూ ఆయన ప్రశ్నించారు. ఇదంతా తమ పార్టీ బలాన్ని ఆ రాష్ట్రంలో పెంచుకోవడానికి చేసే ప్రయత్నమే అనుకోవచ్చు.
నిజానికి అమిత్ షా సభ సందర్భంగా గోలీమారో నినాదాలు కూడా కోల్‌కతలో వినిపించాయి. భాజపా వాటితో తమకు సంబంధం లేదని ప్రకటించుకున్నప్పటికీ.. బాధ్యత వహించాల్సింది వారే. కాగా, అమిత్ , దీదీపైనే ఎదురుదాడికి దిగడం విశేషం. మమత తన వ్యాఖ్యలతో సీఏఏ వ్యతిరేక నిరసనల్తో అగ్నికి ఆజ్యం జతచేస్తున్నారని షా ఆరోపిస్తున్నారు.
అమిత్ షాకు అంత జాతీయ దృక్పథం ఉంటే గనుక.. పౌరసత్వ సవరణ చట్టం ఏ విధంగా మైనారిటీలకు వ్యతిరేకం కాదో, వారు భయపడాల్సిన అవసరం ఎందుకు లేదో చెప్పి ఉండాలి. ఆ పనిచేయకుండా.. సవాళ్లు విసరడం.. దమ్ము నిరూపించుకోవాలనడం ఇవన్నీ ఆయన తరఫు నుంచి రెచ్చగొట్టే వ్యవహారాలే. రాజకీయ లబ్ధిని లక్ష్యించిన మాటలే అని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఢిల్లీలో అల్లర్లు ప్రాణాలు బలిగొన్నాయి. కానీ చూడబోతే.. దేశమంతా ఉద్రిక్త వాతావరణం ఏర్పడితే.. తమపట్ల అనుకూలంగా ఉండే వారందరూ మరింతగా సంఘటితమై… పార్టీ బలం పెరుగుతుందని భాజపా అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.