ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారనే వార్త ఆసక్తిదాయకంగా మారింది. గత రెండు నెలలుగా రాజకీయ ప్రయాణాలు లేవు. దేశంలో రాజకీయ వేడి అయితే చాలా ఉంది కానీ, నేతల సమావేశాలు ఏవైనా జరిగినా అన్నీ ఆన్ లైన్ సమావేశాలే. ఇక ఇప్పుడిప్పుడే ఆన్ లాకింగ్ జరుగుతూ ఉంది. ఈ క్రమంలో జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తిని రేపుతూ ఉంది.
కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యల గురించి, కరోనా ప్రభావం గురించి జగన్ కేంద్రానికి వివరించనున్నారనేది ప్రాథమిక సమాచారం. అయితే జగన్ సమావేశం అవుతున్నది హోం మంత్రి అమిత్ షా తో కావడంతో అనేక ఊహాగానాలకు ఆస్కారం ఏర్పడుతూ ఉంది.
కరోనా లాక్ డౌన్ వేళ కూడా ఏపీకి సంబంధించి రాజకీయం హాట్ హాట్ గానే నిలిచింది. ప్రత్యేకించి ఏపీ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలకు హై కోర్టు బ్రేక్ వేయడం. ఈ అంశాలపై విస్తృత చర్చ జరిగిన సంగతి తెలిసిందే. హై కోర్టు తీర్పుల మీద తాము సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్టుగా జగన్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
ఇక ఏపీ ప్రభుత్వం పంపించిన శాసనమండలి రద్దు తదితర బిల్లులు ఢిల్లీలో పెండింగ్ లో ఉన్నాయి. అయితే ఇప్పట్లో పార్లమెంట్ సమావేశం కూడా లేదు. అయినా ఇప్పుడు జగన్ ఢిల్లీ బయల్దేరుతుండటం సర్వత్రా ఆసక్తిని రేపుతూ ఉంది. ఇక తెలుగుదేశం పార్టీ వాళ్లు జగన్ ఢిల్లీ పర్యటన పై ఇప్పటికే ఒక కన్నేసి ఉండొచ్చు. జగన్ కు ఢిల్లీలో బీజేపీ పెద్దల అపాయింట్ మెంట్లు దొరకకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్లు ఎనలేని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వార్తలు రాస్తూ ఉంటారు. మరి ఇప్పుడు అమిత్ షాతో జగన్ సమావేశం అయితే తెలుగుదేశానికి అది అంత తేలికగా రుచించే అంశం కాదు.
అయితే ఎలాగూ ఈ సమావేశంలో జగన్ కు అమిత్ షా క్లాసు పీకారంటూ పచ్చమీడియా రాస్తుంది. ఆ ఆర్టికల్ ఎప్పటికీ రెడీగానే ఉంటుంది. అయితే జగన్ ఢిల్లీ పర్యటన అసలు కథ ఏమిటనేదే ఆసక్తిదాయకమైన అంశం.