రాష్ట్రంలో జగన్ గెలుపుని, చంద్రబాబు ఓటమిని ప్రజలంతా అర్థం చేసుకున్నారు. సాక్షాత్తూ టీడీపీ నాయకులే ఇష్టంగానో, అయిష్టంగానో జగన్ కి శుభాకాంక్షలు చెప్పి ఓటమికి కుంగిపోవట్లేదని సర్దిచెప్పుకున్నారు. ఓడిపోయినా కూడా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు. కానీ ఓ వర్గంవారికి మాత్రం జగన్ విజయం ఇంకా మింగుడుపడలేదు. చంద్రబాబు ఓటమిని వారింకా జీర్ణించుకోలేకపోతున్నారు.
సామాజిక మాధ్యమాల్లో కమ్మవారి ఆత్మఘోష పేరుతో చక్కర్లు కొడుతున్న ఓ ఆడియో దీనికి నిదర్శనం. కేవలం కమ్మవారిని ఓడించడానికే ఈసారి అందరూ కంకణం కట్టుకున్నారని, అందుకే చంద్రబాబుని ఓడించారని ఓ ప్రముఖ యాంకర్ చెబుతున్న వాయిస్ ఓవర్ ఆడియో టేపు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
తెలంగాణ ఉద్యమం కేవలం ఆ రాష్ట్రంలో కమ్మవారి ఆధిపత్యానికి గండికొట్టడం కోసమే మొదలైందని తనదైన విశ్లేషణ ఉంది ఈ ఆడియోలో. అంతేకాదు.. టీవీ9 రవిప్రకాష్ కి వ్యతిరేకంగా తెలంగాణ వెలమ దొరలంతా ఏకమయ్యారని, అందుకే ఆయన్ని ఆ ఛానెల్ నుంచి బలవంతంగా పంపించి వేశారని చెప్పుకొచ్చారు. రవిప్రకాష్ కి వ్యతిరేకంగా ఏబీఎన్, ఎన్టీవీ వార్తలిస్తున్నాయని, కొన్నిరోజుల తర్వాత కమ్మవారి చేతుల్లో ఉన్న ఈ ఛానెల్స్ ని కూడా వారు లాగేసుకుంటారని ముక్తాయించారు.
మొత్తమ్మీద కమ్మవారి ఆధిపత్యాన్ని ఒప్పుకోలేకే.. అటు తెలంగాణ వెలమలు, ఇటు ఏపీ రెడ్లు.. ఒక్కటై వారిని ఓడించారని, ఇది రాష్ట్రానికి మంచిది కాదని చెప్పుకొచ్చారు. వ్యాపారానికి, వ్యవసాయానికి పెట్టింది పేరైన తమను అణగదొక్కాలని ఇతర కులస్తులు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పుడీ ఆడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. టీవీ9 ప్రస్తావన, రవిప్రకాష్ పై సానుభూతి ఎక్కువగా ఉండటంతో.. ఈ ఆడియో బయటకు రావడం వెనక రవిప్రకాష్ హస్తం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఓవైపు రవిప్రకాష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం, మరోవైపు చంద్రబాబు ఘోరంగా ఓడిపోవడం వల్ల.. ఈ రెండు అంశాల్ని కలుపుతూ సింపతీ కోసం కావాలనే ఎవరో ఈ ఆడియో టేపును సృష్టించినట్టు కనిపిస్తోంది.. కులాలకు అతీతం, కులరహిత సమాజం అని చెప్పుకునే వ్యక్తులు.. ఈ ఆడియో టేపు నిండా కులపిచ్చిని రగిల్చే ప్రయత్నం చేయడం, ఇతర కులాల్ని కించపరచడం విడ్డూరం.