అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకున్నారు? సభకు రానోళ్లకు ఎమ్మెల్యే జీతం ఎందుకు? అసలు ప్రతిపక్ష విధులు నిర్వహించలేనోళ్లకు ఆ పదవులెందుకు? అధికారంలో ఉండగా చంద్రబాబు కొట్టిన డైలాగ్ లు ఇవి. అప్పట్లో ప్రతిపక్షానికి అసెంబ్లీలో వాయిస్ లేకుండా చేసి, వారి గొంతునొక్కేసి, విధిలేని పరిస్థితుల్లో బైటకు వెళ్లిపోతే దానికి నానా రాద్ధాంతం చేశారు చంద్రబాబు. చివరికి ఎన్నికల ప్రచారంలో కూడా ఈ అంశాన్ని వాడుకున్నారు.
కాలచక్రం గిర్రున తిరిగింది. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అయ్యాయి. అధికారపక్ష హోదాలో వైసీపీ ఎమ్మెల్యేలు రోజూ అసెంబ్లీకి వస్తున్నారు, మరి ప్రతిపక్షం సంగతేంటి? మాట్లాడటానికి అవకాశం ఇస్తున్నా కూడా వారికొచ్చిన నొప్పి ఏంటి? పదే పదే ప్రసంగానికి అడ్డు తగులుతుంటే ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం తప్పా? సస్పెండ్ చేశారనే సాకుతో చంద్రబాబు సహా అందరూ అసెంబ్లీని వదిలిపెట్టి పారిపోతారా?
పారిపోవడం అటుంచి సమావేశాలు పూర్తికాగానే రోజూ ప్రెస్ మీట్లు పెట్టి అధికారపక్షంపై పడి ఏడవడం మరో ఎపిసోడ్. మరి దీనికి చంద్రబాబు ఏమని సమాధానం చెబుతారు. అసెంబ్లీ నుంచి పారిపోతున్న చంద్రబాబు టీమ్ జీతం ఎలా తీసుకుంటుంది? తాము అధికారంలో ఉండగా ఒక న్యాయం, ప్రతిపక్షంలోకి వెళ్లాక మరో న్యాయమా? ప్రజాసమస్యలపై చిత్తశుద్ధిలేదంటూ అధికారంలో ఉన్నప్పుడు జగన్ పై ఆరోపణలు చేసిన చంద్రబాబుకు, ఇప్పుడు ఆ డైలాగ్ గుర్తురావడం లేదా?
ఇవన్నీ ఒకెత్తయితే, సమావేశాలు ముగియకుండానే బాబు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. బాబు సంగతి పక్కనపెడితే మిగతావాళ్లు అసలు అసెంబ్లీకి వస్తారా రారా అనేది డౌటే. మొత్తమ్మీద అసెంబ్లీ బడ్జెట్ సెషన్ లో పూర్తిస్థాయిలో పదే పదే మంత్రుల ప్రసంగాలకు అడ్డుతగులుతూ, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా విమర్శలతో కాలక్షేపం చేసి, వాకౌట్ లు చేసి విఫలపక్షం అనిపించుకుంది ప్రతిపక్షం. మరి ఈ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పనిచేయకుండా జీతం తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? చంద్రబాబే సమాధానం చెప్పాలి.