Advertisement

Advertisement


Home > Politics - Gossip

బాబుగారు చేస్తున్న రెండోతప్పు

బాబుగారు చేస్తున్న రెండోతప్పు

తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు కచ్చితంగా వుండేలా పేరు తెచ్చుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం నిండిన చంద్రబాబుకు అనేక భుజకీర్తులు వున్నాయి. క్రైసిస్ మేనేజ్ మెంట్ లో నిపుణుడు. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో పక్కాగా తెలిసిన వ్యక్తి. ఎవర్ని ఎలా దారికి తెచ్చుకోవాలో నేర్చుకున్న నేత, సరైన టైమ్ లో సరైన ట్రంప్ కార్డ్ వాడి నెగ్గుకు వస్తారు అని అందరూ అంటారు.

కానీ అలాంటి చంద్రబాబు నాయుడు వయసు వల్లనో, పరిస్థితుల వల్లనో సరైన నిర్ణయాలు తీసుకొవడం లేదనిపిస్తోంది. లేదా తీసుకుంటున్ననిర్ణయాలు వికటిస్తున్నాయనిపిస్తోంది. ఇప్పటికే ఆయన తన రాజకీయ జీవితం మొత్తం మీద దారుణమైన తొలి తప్పు చేసారు.

2019 ఎన్నికల వేళ మోడీ ప్రభావాన్ని తక్కువ అంచనా వేసి, ఆయనతో తెగతెంపులు చేసుకోవడమే కాక, భాజపాను అధికారంలోకి రానివ్వకూడదని శతథా, సహస్రధా ప్రయత్నించారు. ఇల్లు వదిలి వీధికెక్కి తను విజయం సాధించడానికి బదులు, కాంగ్రెస్ కు విజయం సాధించిపెట్టడానికి కిందా మీదా అయ్యారు. ఇది దారుణంగా వికటించింది. 

కేవలం అధికారం చేజారడంతో సరిపోకుండా, మరోసారి మోడీకి దగ్గరవ్వడం అంటే భగీరధ యత్నంగా మారిపోయింది. ఒకసారి అయితే ఓకె, రెండు సార్లు అయితే ఓకె. మరీ పదే పదే భాజపాకు లేదా మోడీకి వెన్నుపోటు పొడుస్తూ పోతే ఎలా? మోడీని అరెస్ట్ చేస్తా అన్నది ఓసారి. భాజపాకు ఎప్పటికీ ఇక దగ్గర కాను అన్నది మరోసారి.

మోడీపై నిప్పులు చెరుగుతూ దేశం అంతా తిరిగింది మరోసారి. ఈ తరం జనాలకు గుర్తు లేకపోవచ్చు కానీ, నాయుడు అంటే నాయకుడు అని బాబుతో భుజం కలిపిన వెంకయ్య నాయుడు  చాలా అంటే చాలా ఏళ్ల క్రితం ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినపుడు, తన ఓటమికి కారణం చంద్రబాబు వెన్నుపోటే అని కామెంట్ చేసారు. ఆఫ్ కోర్స్ ఆ కామెంట్ ఇప్పుడు చరిత్రలో కలిసి, కనుమరుగైపోయింది అనుకోండి.

మొత్తం మీద అన్ని తప్పుల కంటే పెద్ద తప్పు 2019 ఎన్నికల టైమ్ లో మోడీ కి దూరంగా, కాంగ్రెస్ కు దగ్గరగా జరగడం. సరే, అయిపోయింది ఏదో అయిపోయింది. 2024 నాటికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమిటి? ఈ విషయంలోనూ బాబుగారు తప్పే చేస్తున్నారేమో? ఇప్పటికీ ఇంకా మోడీకి దగ్గర కావాలని, ఎలాగైనా దగ్గర అవుతానని ఆయన ఆలోచనలో వున్నారు. కానీ మోడీ కానీ భాజపా కానీ ఎంత ఇబ్బందుల్లో పడితే జగన్ లేదా వైకాపాతో ఆ పార్టీ బంధం అంత గట్టి అవుతుందన్న సంగతి గమనించడం లేదు. అలాగే ఇప్పటికే సిఎమ్ ఆస్పిరెంట్ పవన్ కళ్యాణ్ భాజపాతో పొత్తు పెట్టుకుని వున్నారన్న సంగతి కూడా గమనించాల్సి వుంది. 

వీటన్నింటికన్నా చంద్రబాబు గమనించాల్సింది ఇంకోటి వుంది. దేశం అంతా ఎలా వున్నా, ఆంధ్రలో భాజపా పట్ల జనం రియాక్షన్ ఎలా వుందీ అన్నది. ప్రస్తుతానికి అయితే ఆంధ్రనాట భాజపా పట్ల అంత సానుకూల వైఖరి అయితే వున్నట్లు కనిపించడం లేదు. రాజధాని విషయంలో భాజపా వైఖరి ఓ వర్గం జనాలకు అంతగా మింగుడుపడడం లేదు. అలాగే రాజకీయాలకు అతీతంగా కావచ్చు, అమరావతిని ఇప్పటికే రాజధానిగా ఫిక్స్ అయిపోవడం వల్ల కావచ్చు, కొంతమంది న్యూట్రల్ జనాలకు కూడా భాజపా మీద పెద్దగా ఆసక్తి లేదు.

చంద్రబాబు గమనించాల్సింది ఏమిటంటే, మోడీతో పొత్తుపెట్టుకుంటే ఏ మేరకు లాభం అన్నది? మోడీ ప్రభావం లోక్ సభ అభ్యర్థుల మీద చూపించే అవకాశం వుందేమో కానీ అసెంబ్లీ ఎన్నికల మీద కాదు. చంద్రబాబుకు ముందుగా కావాల్సింది ఆంధ్రలో అధికారం. ఆపైన లోక్ సభ సీట్లు. అసెంబ్లీ సీట్లు చాలా వరకు సాధించగలిగితే, ఆ ప్రభావం లోక్ సభ సీట్ల మీద ఎలాగూ వుంటుంది.

అందువల్ల ఇప్పుడు తక్షణం చంద్రబాబు చేయాల్సింది కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల మీద మాత్రమే కాకుండా కేంద్ర నిర్ణయాల మీద కూడా పోరాటం. పైగా ఈ పోరాటం అన్నది జగన్ ఎలాగూ చేయలేరు. ఆ అవకాశం చంద్రబాబు అందిపుచ్చుకోవాలి.

రాజధాని సమస్య, జిఎస్టీ బకాయలకు ఎసరు పెట్టడం, వ్యవసాయ బిల్లు, విద్యుత్ వ్యవస్థను కేంద్రం తన చేతుల్లోకి తీసేసుకోవడం, అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్లకు కొమ్ముకాయడం, ఆర్థిక విధానాలు, ఇంకా చాలా విషయాలను చంద్రబాబు నేరుగా ఢీకొని వుండాల్సింది. అది కచ్చితంగా జనాల్లో వర్కవుట్ అవుతుంది. ముందే కూసిన కోయిల మాదిరిగా 2019లో అనవసరంగా తొందరపడ్డారు. ఇప్పుడు అవసరం వచ్చినపుడు మౌనం వహించి అందివచ్చిన అవకాశాన్ని పాడు చేసుకుంటున్నారు. 

పక్క రాష్ట్రంలో కేసిఆర్, కేటిఆర్ నేరుగా భాజపాను, మోడీ విధానాలను విమర్శిస్తున్మనారు. కానీ జగన్ ఆ పని చేయగలిగే అవకాశం లేదు. కానీ కేంద్ర నిర్ణయం వల్ల ప్రభావితం అయిన జగన్ నిర్ణయాలను చంద్రబాబు టార్గెట్ చేస్తున్నారు. దాని వల్ల ఫలితం లేదు. ఎందుకంటే సోషల్ మీడియా వల్ల, పక్క రాష్ట్రంలో కేసిఆర్, కేటీఆర్ చేస్తున్న విమర్శల వల్ల జనాలకు అన్నీ తెలుస్తున్నాయి. 

అందువల్ల చంద్రబాబు సరైన టైమ్ లో సరైన నిర్ణయం అన్నట్లుగా మోడీ లేదా కేంద్రం నిర్ణయాలను సుతిమెత్తగా అయినా ఎత్తి చూపాల్సి వుంది. భాజపా జనాలు తనను టార్గెట్ చేస్తారేమో అనో, లేదా 2024లో జగన్ తోనే భాజపా ముందుకు వెళ్లి, తనకు ఇబ్బంది అవుతుందనో, లేదా అప్పటికి మోడీ మనసు మారి భాజపా తనకు దగ్గర అవుతుందనో ఆలోచిస్తూ కూర్చుంటే ఆయన తన రాజకీయ జీవితంలో రెండో తప్పు చేసినట్లు అవుతుంది. 

ఆర్వీ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?