Advertisement

Advertisement


Home > Politics - Gossip

చంద్రబాబుకు ఆ అవకాశం కూడా లేదు!

చంద్రబాబుకు ఆ అవకాశం కూడా లేదు!

రాష్ట్ర రాజకీయాలతో పాటు తనకు అవసరం ఉన్నప్పుడు ఢిల్లీ పాలిటిక్స్ పై కూడా దృష్టి పెడుతుంటారు చంద్రబాబు. అతను దృష్టి పెట్టకపోయినా, ఆయన కేంద్రంలో చురుగ్గా ఉన్నట్టు అనుకూల మీడియా కథనాలు వండివారుస్తుంది. ఈ ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు చుట్టూ అలాంటి స్టోరీలు కుప్పలుతెప్పలుగా వస్తూనే ఉన్నాయి. కేంద్రంలో ప్రధానిని డిసైడ్ చేసే రిమోట్ కంట్రోల్ బాబు చేతిలోనే ఉందన్నట్టు చెబుతుంటాయి ఇక్కడ కొన్ని పత్రికలు.

కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే ఈసారి చంద్రబాబుకు కేంద్రంలో కూడా ప్రాధాన్యం ఉండదేమో అనిపిస్తోంది. ప్రస్తుతం బాబుతో రాసుకుపూసుకు తిరుగుతున్న కాంగ్రెస్ పార్టీ కూడా జగన్ పై ఓ కన్నేసి ఉంచిందంటే, ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి హస్తం పార్టీ ఇస్తున్న విలువ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఈసారి ఎన్నికల్లో జగన్ కు అత్యధిక ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉందంటూ సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్ ను ఆకర్షిస్తున్న అంశం ఇదే.

ఈసారి కేంద్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకుంది కాంగ్రెస్. బీజేపీ కూటమికి ఈసారి ఆశించిన స్థాయిలో మెజారిటీ రాదని, మేజిక్ ఫిగర్ కు 50 సీట్ల దూరంలో కాంగ్రెస్ ఆగిపోతుందంటూ విశ్లేషణలు రావడంతో హస్తం పార్టీ మరింత జోరుపెంచింది. దేశవ్యాప్తంగా పొత్తులకు తెరదీసింది. తమకు పట్టులేని దాదాపు ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంది. ఇందులో భాగంగా ఏపీ నుంచి టీడీపీతో ఆ పార్టీ దోస్తీ కట్టింది. కానీ ఫలితాలు చూస్తే జగన్ కు అనుకూలంగా ఉన్నాయి. అందుకే ఇప్పుడు జగన్ పై ఆచితూచి స్పందిస్తోంది కాంగ్రెస్.

రాబోయే ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కంటే వైసీపీకి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తే జగన్ తో చేతులు కలపడానికి కాంగ్రెస్ ఏమాత్రం మొహమాటపడదు. పైగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ తమవాడే అనే అంశాన్ని కూడా ఆ పార్టీ తెరపైకి తీసుకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే సమయంలో, చంద్రబాబును నిర్దాక్షిణ్యంగా పక్కనపెట్టడానికి కూడా వెనకాడదు. అదేకనుక జరిగితే బాబుకు తన జీవితంలో అంతకంటే అవమానం ఇంకోటి ఉండదు. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎంత నష్టంచేయాలో అంతా చేశారు బాబు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల విషయంలో కూడా బాబు చేతిలో భంగపడ్డానికి కాంగ్రెస్ సిద్ధంగాలేదు.

కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా వైసీపీతో పొత్తు కోసం చూస్తోంది. ఇప్పటికే పలువురు బీజేపీ జాతీయ స్థాయి నేతలు జగన్ తో టచ్ లోకి వచ్చారు. ప్రస్తుతానికి జగన్ మాత్రం కాంగ్రెస్-బీజేపీలకు సమదూరంలో ఉన్నారు. కేంద్రంలో ఏ పార్టీకి మద్దతివ్వాలనే అంశంపై జగన్ ఇప్పటికే నిశ్చితాభిప్రాయంతో ఉన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చే పార్టీకే మద్దతిస్తామని ప్రజల సమక్షంలో ప్రకటించారు.

సో.. సర్వేలు చెబుతున్నట్టు వైసీపీకి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తే, ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పాలనే బాబు ఆలోచనకు గండి పడినట్టే. ఈసారి చంద్రబాబుకు ఆ అవకాశం కూడా లేనట్టే.

వర్మపై అంత దాష్టికం అవసరమా బాబు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?