ఓడిపోయినప్పట్నుంచి చంద్రబాబు, చినబాబు సింపతీ కోసం చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. పోయిన ప్రజామద్దతును కూడగట్టుకునేందుకు, జనాల నోళ్లలో నానేందుకు వీళ్లిద్దరూ కలిసి ఆడుతున్న డ్రామాలు ఒకటి రెండు అని చెప్పలేం. ఫలితాలు వచ్చిన వెంటనే ఓదార్పు డ్రామాలు ప్రారంభించారు. అవి బెడిసికొట్టిన వెంటనే ఇంకోటి.. ఆ వెంటనే మరొకటి.. ఇలా చంద్రబాబు అండ్ కో సింపతీ కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు.
ప్రజావేదిక కూల్చివేసినప్పుడు రావాల్సినంత సింపతీ రాలేదని, టెంపరరీ ఏర్పాట్ల కోసం కోట్లు ఖర్చుపెట్టారనే అపవాదే తనకు మిగిలిందని బాధపడ్డారు బాబు. తనపై కక్ష సాధించడం కోసమే అన్న క్యాంటీన్లు మూసివేశారని మరో వితండవాదం చేసి నవ్వులపాలయ్యారు, ఆస్పత్రుల్లో వైఎస్సార్ క్యాంటీన్ల ఏర్పాటుకి జగన్ సిద్ధపడే సరికి ఆ అవకాశం కూడా టీడీపీకి లేకుండాపోయింది. ఇక వరదను దారి మళ్లించారని, తన ఇల్లు ముంచడం కోసం, వేలాది మందిని నిరాశ్రయుల్ని చేస్తున్నారంటూ అర్థంలేని డైలాగులు పేలుస్తూ చంద్రబాబు, లోకేష్ పూర్తిగా అభాసుపాలయ్యారు. డ్రోన్ వివాదంలో కూడా తమ తెలివితక్కువతనాన్ని బయటపెట్టుకున్నారు.
ఇలా ఎన్నికల ఫలితాలు వచ్చినప్పట్నుంచి ఈరోజు వరకు ఏదో ఒక రూపంలో ప్రజల సింపతీ కోసం బాబు, లోకేష్ తో పాటు టీడీపీ నేతలంతా చేస్తున్న ప్రయత్నాలు జబర్దస్త్ కామెడీ ఎపిసోడ్లను తలపిస్తున్నాయి తప్ప, ప్రజల్లో సింపతీని తీసుకురాలేకపోతున్నాయి. మరోవైపు తమపై కక్షకట్టి జగన్ ఇదంతా చేస్తున్నారంటూ చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్లో కూడా పస లేకపోవడంతో టీడీపీ నేతలంతా బిక్కమొహాలు పెట్టారు. చంద్రబాబు గెస్ట్ హౌస్ కూలిస్తేనో, ఆయన సెక్యూరిటీ తగ్గిస్తేనో, అసెంబ్లీలో మైక్ కట్ చేస్తేనో.. అది రివెంజ్ తీర్చుకున్నట్టు అనుకునే రకం కాదు జగన్.
నిజంగా బాబుపై కక్ష తీర్చుకోవాలనుకుంటే ఒక్క ఎమ్మెల్యే కూడా టీడీపీలో ఉండడు. అంతా ఈ పాటికి వైసీపీలో ఉండేవారు. నిజానికి బాబుపై కక్ష తీర్చుకునే ఆలోచన, అవసరం కూడా జగన్ కు లేదు. అంత టైమ్ కూడా లేదు. అధికారం అందుకున్న తర్వాత దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, తండ్రికి తగ్గ తనయుడిగా ఎలా నిరూపించుకోవాలి అనే వాటిపైనే జగన్ దృష్టి అంతా ఉంది. అందుకే పాలనలో వడివడిగా అడుగులు వేస్తూ, విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ దూసుకెళ్తున్నారు జగన్. ఇటు బాబు అండ్ కో మాత్రం సింపతీ కోసం టిక్ టాక్ ట్రిక్స్ అన్నీ ప్లే చేస్తోంది. అవన్నీ సెల్ఫ్ గోల్స్ గా మారేసరికి, రాష్ట్ర రాజకీయాల్లో హిలేరియస్ కామెడీ పండుతోంది.