తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి రాజకీయంగా విశాఖపట్నం జిల్లాలో భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. టీడీపీ శాసనసభ్యుడు, మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. గంటా బ్యాచ్ మొత్తం వైసీపీలో చేరడానికి ముహూర్తం ఖరారైనట్లు స్థానికంగా ప్రచారం సాగుతోంది.
అన్నీ అనుకున్నట్లు జరిగితే అక్టోబర్ 2వ తేదీన గంటా బ్యాచ్ వైసీపీలో చేరుతుందని సమాచారం. వైసీపీలో చేరడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన షరతును కూడా గంటా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ షరతు మేరకు ఆయన తన శాసనసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తారని అంటున్నారు.
గంటాను చేర్చుకోవడానికి వైఎస్ జగన్ పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. అయితే, వైసీపీలో చేరితే తనకు దక్కే అవకాశాలపైనే గంటా తుది చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తనకు ఏ విధమైన పదవి ఇస్తారనే విషయంపై ఆయన స్పష్టత కోరుతున్నట్లు తెలుస్తోంది. ఆ స్పష్టత కోసమే గంటా హైదరాబాదు వెళ్లారని ప్రచారం సాగుతోంది.
గంటాతో పాటు విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే నాయుడు, తదితరులు వైసీపీలో చేరుతారని చెబుతున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న మరోనేత కూడా వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీకి విశాఖపట్నం జిల్లా కంచుకోటగా నిలుస్తూ వచ్చింది. అయితే, కాస్తా క్రమంగా బీటలు వారుతోంది. విశాఖ రూరల్ జిల్లాలో బలమైన నేతగా పేరుగాంచిన ఆడారి తులసీరావు కుమారుడు అడారి అజయ్ కుమార్, కూతురు, మాజీ చైర్ పర్సన్ రమాకుమారి వైసీపీలో చేరిపోయారు. మాజీమంత్రి అయ్యన్నపాత్రుడి సోదరుడు సన్యాసిపాత్రుడు త్వరలో వైసీపీలో చేరుతారని సమాచారం.
విశాఖ రూరల్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు కూడా వైసీపీలో చేరుతారని ప్రచారం సాగుతోంది. ఈ స్థితిలో గంటా కూడా వైసీపీలో చేరితే టీడీపిపై పెద్ద దెబ్బ పడుతుంది.