భారత క్రికెట్ జట్టుకు అత్యంత విజయవంతమైన కెప్టెన్ ఒకప్పుడు, బ్యాటింగ్ లో మణికట్టు మాంత్రికుడు, ప్రపంచ క్రికెట్ లో అత్యంత ప్రతిభావంతమైన బ్యాట్స్ మన్లలో ఒకరు.. మామూలుగా ఇలాంటి ట్యాగ్ లు ఇండియాలో సదరు వ్యక్తిని ఎక్కడికో తీసుకెళ్తాయి. అల్మోస్ట్ దేవుడిని చేసేస్తాయి. అజహరుద్దీన్ కన్నా చాలాతక్కువ స్థాయి ప్లేయర్లు కూడా అభిమానుల గుండెల్లో ఉంటారు. అయితే మ్యాచ్ ఫిక్సింగ్ ఉందంతం అజర్ ప్రతిభకు గుర్తింపును తగ్గించి వేసింది.
జరిగింది పొరపాటో, గ్రహపాటో.. ఏదో ఒకటి. అక్కడకూ అజర్ ఎక్కడా ఫిక్సింగ్ చేసిన ఉదంతాలు బయటకు రాలేదు. కేవలం బుకీలను దక్షిణాఫ్రికా క్రికెటర్ నాటి కెప్టెన్ దివంగత హ్యాన్సీ క్రోనేకు పరిచయం చేశాడనే అభియోగాలను ఎదుర్కొన్నాడు అజర్. క్రోనే, గిబ్స్ తదితర సౌతాఫ్రికా క్రికెటర్లు ఫిక్సింగ్ కు పాల్పడ్డారు. వారి వ్యవహారం బయటకు రావడంతో.. మొదలైన పరిశోధన అజర్ వద్దకు వచ్చి ఆగింది. వారికి బుకీలను పరిచయం చేసింది అజర్ అని తేలింది. దీంతో అజర్ పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. అలాగే అదే వ్యవహారంలో పాలుపంచుకున్నాడన్న అభియోగంతో మరో ప్రతిభావంత క్రికెటర్ జడేజా మీద కూడా వేటుపడింది.
అజర్, జడేజాలు అత్యున్నత స్థాయి ఆటగాళ్లు. అయితే ఫిక్సింగ్ మరకలు వారిని వెనక్కు నెట్టేశాయి. ఇదంతా గతం. దాదాపు ఇరవై యేళ్ల కిందటి వ్యవహారం. ఇలాంటి నేఫథ్యంలో.. అజర్ ఇప్పుడు కొత్త కెరీర్ మొదలుపెట్టాడు. హెచ్ సీఏ ప్రెసిడెంట్ అయ్యాడు. ప్రత్యర్థిపై భారీ ఓట్ల తేడాతో అజ్జూభాయ్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఇన్నిరోజులూ బీసీసీఐ అజర్ తో అంటీముట్టనట్టుగా వ్యవహరించింది. ఇప్పుడు హెచ్ సీఏ అధ్యక్షుడు కావడంతో అజర్ బీసీసీఐలో ఇక కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. మొత్తానికి అజర్ టైమ్ క్రికెట్ లో మళ్లీ మొదలైనట్టుంది.