భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు సుష్మాస్వరాజ్ (67) ఇక లేరు. భారత రాజకీయ యవనికపై సుదీర్ఘకాలంపాటు ప్రభావవంతమైన నాయకురాలిగా పనిచేసిన సుష్మాస్వరాజ్ గుండెపోటుతో కన్నుమూశారు. మంగళవారం రాత్రి 10.15 గంటలకు ఆమెకు తీవ్రమైన గుండెపోటు రావడంతో.. కుటుంబసభ్యులు ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఎమర్జన్సీ వార్డులో ఉండి చికిత్స అందిస్తుండగానే… ఆమె మరణించారు. ఆమెకు భర్త స్వరాజ్ కౌశల్, కుమార్తె బన్సురి ఉన్నారు.
సుష్మాస్వరాజ్ కు చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2016లో ఆమెకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగింది. ఆ తర్వాత కూడా ఆరోగ్యం పరంగా స్థిమితంగా ఉన్నదేమీ లేదు. 2014 నుంచి 19 వరకు మోదీ సర్కారులో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న సుష్మాస్వరాజ్… పదవీకాలం చివరి రోజుల్లో రాజకీయాల్లోను, అధికారిక కార్యకలాపాల్లోను అంత చురుగ్గా వ్యవహరించలేదు. ఆరోగ్య కారణాల రీత్యా 2019 ఎన్నికల్లో పోటీ చేయలేదు కూడా. కాగా మంగళవారం నాడు గుండెపోటుతో మరణించారు.
ఏబీవీపీ రాజకీయాలతో రంగప్రవేవం చేసిన సుష్మాస్వరాజ్.. ఈ దేశంలో అత్యంత చిన్న వయసులో ఒక రాష్ట్రానికి కేబినెట్ మంత్రి అయ్యారు. డిల్లీ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రి అయ్యారు. ప్రధాని పదవితో పాటు అదనంగా బాధ్యతలు చూడడం కాకుండా, పూర్తిస్థాయిలో బాద్యత చూసిన వారిలో దేశానికి తొలి మహిళా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి కూడా సుష్మా స్వరాజే! అలాంటి సుష్మాస్వరాజ్ ఇకలేరు.
భారతీయ జనతా పార్టీలో మోడీ కంటె సీనియర్ గా, కేంద్ర రాజకీయాల్లో ప్రభావపూరితమైన నాయకురిలిగా సుష్మాస్వరాజ్ కు తనదైన ముద్ర ఉంది. గతంలో వాజపేయి ప్రధానిగా భాజపా పాలన సాగిస్తున్న రోజుల్లో.. వాజపేయి వారసురాలు సుష్మాస్వరాజ్ అని పార్టీలో అంతా అనుకునేవాళ్లు. ఆమె కూడా అందుకు దీలైన నాయకురాలిగానే ఉండేవారు. ‘‘అబ్ తో హై అటల్ బిహారీ.. అగలీ బారీ బహెన్ హమారీ’ అనే నినాదం పార్టీలో వినిపిస్తుండేది. మోదీ ప్రధాని అయిన తర్వాత.. చాలా మంది సీనియర్లను పక్కన పెట్టినట్టే, సుష్మాస్వరాజ్ కు కూడా అప్రాధాన్య శాఖ కేటాయించారనే ప్రచారం ఉంది.